యూదుమతస్తులకు ప్రశ్నలు-9

రబ్బీల కథనాలు లేకపోతే “ఓరల్ తోరాహ్” లేదు! “ఓరల్ తోరాహ్” లేకపోతే ఈనాటి యూదుమతమే లేదు!

ఈ వాస్తవాల వెలుగులో “ఓరల్ తోరాహ్” యొక్క సత్యా అసత్యాలను పరిశీలించటం అతి ప్రాముఖ్యం. ఈ ప్రయత్నంలో భాగంగా క్రింది పది ప్రశ్నలను లేవనెత్తటమైనది. ఈ ప్రశ్నలకు యివ్వబడే లేక యివ్వలేని ప్రతిస్పందనలే “ఒరల్ తోరాహ్” యొక్క అసలు స్థితిని బహిర్గతం చేస్తాయి. 

“ఓరల్ తోరాహ్” నిజంగానే పరమతండ్రి అందించి వుంటే దాన్ని స్వీకరించి శిరస్సావహించాలి. అలాకాకుండా అది కేవలం రబ్బీల పుఱ్రెలోనుండి పుట్టిందైతే దాన్ని త్రోసివేసి ఖండించాలి.

? (1) రబ్బీల బోధలో కేవలం 5% ప్రాధాన్యత స్థాయికి దిగజారిన “రిటెన్ తొరాహ్” [మోషే ధర్మశాస్త్రం] బైబిల్ లో అనేక పర్యాయాలు పేర్కొనబడింది మరియు ప్రస్తావించబడింది. మరి, అదే రబ్బీల బోధలో 95% ప్రాధాన్యతను సంతరించుకున్న “ఓరల్ తోరాహ్” ఎన్ని సార్లు బైబిల్ లో పేర్కొనబడింది? అసలు “ఓరల్ తోరాహ్” [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్] అన్న పదజాలము తనాఖ్ లో ఒక్కసారైనా పెర్కొనబడిందా? పేర్కొనబడి ఉంటే, ఎక్కడుంది?

? (2) మోషేద్వారా రెండు తోరాహ్ లు అంటే “రిటెన్ తోరాహ్” మరియు “ఓరల్ తోరాహ్” యివ్వబడ్డాయి అన్న ప్రకటన తనాఖ్ లో ఎక్కడుంది? 

? (3) యాహ్వే తన ఆజ్ఙలన్నింటిని వివరించి మోషేకు చెప్పాడు, కాని మోషే వాటన్నింటిని వ్రాసిపెట్టలేదు అలా వ్రాసిపెట్టనివాటినే “ఒరల్ తోరాహ్” అంటారు అని మీరు చేస్తున (దుర్)బోధ ఏ తనాఖ్ లోనిది? ఆధారాలతోకూడిన వివరాలివ్వండి!

? (4) యాహ్వే ఎలోహిం మోషేకు తన ఆజ్ఙలన్నింటిని వివరించి చెప్పాడు [ని.కాం.20:1], అటుతరువాత యాహ్వే ఎలోహిం తనకు తెలియచేసిన మాటలన్నింటిని మోషే వ్రాసి పెట్టాడు [ని.కాం.24:4]. మరి, యాహ్వే వివరించిన మాటలన్నీ మోషే వ్రాసిపెడితే, యిక మోషే వ్రాసిపెట్టని దేవుని మాటలు ఎలా ఉంటాయి? ఉన్నాయనటం స్పష్టంగా వ్రాయబడిన దైవలేఖనాలకు వ్యతిరేకంగా ఉండటమేగాక అది పరమతండ్రినే అబద్దికునిగా చేయటం అవుతుంది. ఉన్నాయని రబ్బీలు బోధిస్తున ఆ మాటలు ఎక్కడినుండి వచ్చాయి? నిజానికి అవి రబ్బిలే పుట్టించిన మాటలు అయివుండవచ్చు. కాదని మీరెలా చెప్పగలరు?

? (5) యాహ్వే ఎలోహిం యొక్క ఆజ్ఙలకు దేన్ని కలుపకూడదు మరియు తీసివేయకూడదు అని తోరాహ్ లో ఆజ్ఙ యివ్వబడింది [ద్వి.కాం.4:1-2]. కాని, మోషే వ్రాసి యిచ్చిన తోరాహ్ ను 5% కు దిగజార్చి రబ్బీల రాతలైన “ఒరల్ తోరాహ్” గ్రంథాలను తోరాహ్ కు కలపటమేగాక వాటికి అత్యధిక శాతం అంటే 95% విలువను యిచ్చి అందలమెక్కించటం పరమతండ్రి దృష్టిలో ఎంతగొప్ప నేరమో మరియు పాపమో గ్రహించారా? 

? (6) “ఓరల్ తోరాహ్” [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్] అన్న పదప్రయోగం క్రీస్తు శకం రెండవ శతాబ్ధమునుండి ప్రారంభమైంది. అంతకుముందు ఆ గ్రంథాలుకాని లేక వాటి బోధలుగాని లేవు. ఒకవేళ అవి మోషే కాలములోనుండి ఉంటే క్రీస్తుకు పూర్వం వ్రాయబడిన యూదు గ్రంథాలైన అపోక్రిఫ సంపుటిలో మరియు మృతసముద్ర తాళపత్ర గ్రంథాలలో [Dead Sea Scrolls] వాటి వివరాలు ఎందుకు లేవు? ఆమాటకొస్తే, క్రీస్తుకు పూర్వం వ్రాయబడిన యేగ్రంథాలలోనైన “ఒరల్ తోరాహ్” పేర్కొనబడిందా?

? (7) ఒకవేళ యాహ్వే ఎలోహిం వ్రాతపూర్వకమైన ఆజ్ఙలతోపాటు మౌఖికమైన [oral] వివరణలను మోషేకు అందించి ఉండివుంటే, కొన్ని సమస్యలకు [సం.కాం.9:5-8; 15:32-36; 27:1-7; లే.కాం.24:10-14] మోషే ఆ “మౌఖిక వివరణలను” సంప్రదించకుండా పరమతండ్రి యొక్క పరిష్కార ప్రత్యక్షత కొరకు తిరిగి ఎదురుచూడాల్సిన ఆవశ్యకత ఎక్కడిది?

? (8) ఒకవేళ యాహ్వే ఎలోహిం తన సేవకుడైన మోషేకు వ్రాతపూర్వక ధర్మశాస్త్రం [రిటెన్ తోరాహ్] తోపాటు “ఓరల్ తోరాహ్” లేక “మౌఖిక తోరాహ్” అన్నదాన్ని కూడా తెలియపరచి ఉంటే 1500 సంవత్సరాల వ్యవధిలో ఏప్రవక్తా సాహసించని కార్యాన్ని అంటే ఆ “మౌఖిక తోరాహ్” ను లిఖిత తోరాహ్ గా మార్చే ప్రక్రియను చేపట్టే అధికారం రెండవ శతాబ్ధపు రబ్బీలకు ఎవరిచ్చారు?

? (9) “రిటెన్ తోరాహ్”లో పేర్కొనబడకున్నా కేవలం “ఓరల్ తోరాహ్” లో మాత్రమే పేర్కొనబడిన ఆజ్ఙలను మరియు సూచనలను ఇశ్రాయేలీయులు అతిక్రమించి శిక్షించబడిన లేక గద్దించబడిన ఒక్క సందర్భమైనా తనాఖ్ లో ఉందా? ఉంటే వివరాలివ్వండి!

? (10) మోషే ద్వారా పరమతండ్రి అందించిన అసలు ధర్మశాస్త్రం [రిటెన్ తోరాహ్] కు వ్యతిరేకంగా రబ్బీలు రాసుకున్న “ఓరల్ తోరాహ్” లోని కొన్ని బోధలు:

అ) దైవలేఖనాల మాటలకు వ్యతిరేకంగా పనిచేయటం కన్నా “ఓరల్ తోరాహ్” కు చెందిన శాస్త్రుల మాటలకు వ్యతిరేకంగా పనిచేయటమే ఎక్కువ శిక్షార్హమైనది. (ట్రాక్టేట్ బెరఖొత్ 3.2, ట్రాక్టేట్ సన్ హెడ్రిన్ 11.3)

ఆ) ధర్మశాస్త్రం యొక్క మాటలకన్నా రబ్బీల మాటలకే అధికంగా చెవియొగ్గాలి. (ట్రాక్టేట్ ఎరూవిన్ 21బి)

ఇ) నీవు పూర్వమే సీనాయి కొండపై ధర్మశాస్త్రంలో [తోరాహ్] “సమూహాన్ని వెంబడించు” అని వ్రాసి పెట్టావు (బాబ మెట్సియ 59.బి). (నిజానికి యిది తోరాహ్ బోధకు [ని.కాం.23:2] పూర్తిగా వ్యతిరేకమైన మాట)

“ఓరల్ తోరాహ్” లోని పై మాటలు మోషే ద్వారా యివ్వబడిన రిటెన్ తోరాహ్ [ధర్మశాస్త్రం] ను సమర్దించటం కాకుండా అసలు ధర్మశాస్త్రానికే వ్యతిరేకమైన దుష్ట ప్రకటనలు అన్నది మీకు అర్థంకావటం లేదా?