యెషయాలో మెస్సయ్యా

యెషయా గ్రంథములో దేవుడైన యేహోవా చేత ‘నా సేవకుడు’ అని పిలువబడింది ఎవరు? 

యెషయా 52:13 – 53:12 వరకున్న లేఖనాలలో ఇశ్రాయేలీయులనందరిని సమిష్టిగా పేర్కొంటూ ‘నా సేవకుడు’ అన్న పదజాలము ఉపయోగించబడింది అంటూ కొందరు అలాగే ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతులయిన ఇశ్రాయేలీయులనందరిని కలిపి సాదృశ్యముగా సూచించడానికి ‘నా సేవకుడు’ అన్న అలంకార పదజాలము ఉపయోగించబడింది అంటు మరికొందరు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తూంటారు.  మరి అలాంటి అభిప్రాయాలను లేఖనాలు సమర్ధిస్తున్నాయా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. 

1) ‘నాసేవకుడు ‘ (עַבְדִּ֑י=అబ్’ది) అన్నఏకవ్యక్తి పదజాలం యెషయా గ్రంథములో అనేకసార్లు ఉపయోగించబడింది
 
– 16 సార్లు వుపయోగించబడింది.  
– ప్రవక్త యెషయా ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 20:3)  
– హిల్కియా కుమారుడు ఎల్యాకీము  ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 22:20)
– రాజైన దావీదు ‘నా సేవకుడు’  గా పేర్కొనబడ్డాడు (యెషయా 37:35)    
– యాకోబు సంతానము లేక ఇశ్రాయేలు జనాంగము ‘నా సేవకుడు’ గా పేర్కొనబడింది (యెషయా 41:8-9; 44:1,2,21; 45:4; 49:3).  
– అప్పటికింకా నామము బహిర్గతం చేయబడని ఒక విశిష్టమైన వ్యక్తి ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 42:1,19; 43:10; 49:5-8; 52:13-53:12).  

2) యెషయా గ్రంథములో ప్రభువైన దేవుడు ఉపయోగించిన ‘నాసేవకుడు’ అన్న పదజాలం భవిష్యత్తులో రాబోవుతున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి విశయంలో ఉపయోగించబడింది. అయితే, అదివరకేవచ్చిన/ఉండిన వ్యక్తులనుగాని లేక జనాంగాన్నిగాని ఉద్దేశించి ‘నాసేవకుడు’ అంటూ పేర్కొంటునప్పుడు ఆవ్యక్తియొక్క లేక జనాంగము యొక్క నామాన్ని కూడా అదేసందర్భములో స్పష్టంగా పేర్కొనడం చూస్తాము.    

యెషయా గ్రంథములో దేవుడు (ప్రభువైన యెహోవా) ఏర్పరచుకున్న ప్రత్యేకమైన ‘సేవకుడు’ ప్రవక్త అయిన యెషయా కాదు, రాజైన దావీదు కాదు, కోశాధికారి అయిన ఎల్యాకీముకూడా కాదు. ఆమాటకొస్తే, ఆయన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగము యొక్క సాదృశ్య రూపము అంతకన్నా కాదు.    

3) దేవుడైన యెహోవా ‘నాసేవకుడు’ అంటూ ప్రవక్త అయిన  యెషయాద్వారా పరిచయం చేసిన ఆప్రత్యేకమైన కారణజన్ముని గూర్చి లేఖనాలు సెలవిస్తున్న సత్యాలు

– అతడు దేవుడైన యెహోవాకు ప్రాణప్రియుడు (యెషయా.42:1)  [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతనియందు యెహోవా ఆత్మ వుండును (యెషయా.42:1) [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతడు అన్యజనులకు న్యాయము అందిస్తాడు (యెషయా.42:1) [తండ్రి మహిమతో రాజుగా వచ్చినప్పటినుండి] 
– అతని ఉపదేశము/ధర్మశాస్త్రము (తోర) కొరకు దూరప్రాంత ప్రజలలుకూడా ఎదురుచూస్తారు (యెషయా.42:4) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు ప్రభువైన యెహోవాచేత అన్యజనులకు వెలుగుగా నియమించబడ్డాడు (యెషయా.42:7) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు యెహోవా యొక్క దూత (యెషయా.42:19) [పాతనిబంధన కాలమునుండి]
– అతడు యెహోవా యొక్క సాక్షి (యెషయా.43:10) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]  
– అతడు ఇశ్రాయేలీయులను తిరిగి యెహోవ యొద్దకు తీసుకు వచ్చేవాడు (యెషయా.49:5) [పరిచర్య ప్రారంభించినది మొదలుకొని తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు భూదిగంతములవరకు యెహోవా కలుగజేయు రక్షణకు సాధనముగా వుంటాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు అన్యజనులకు వెలుగుగా వుండేందుకు యెహోవా చేత నియమించబడ్డాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు మనుషులచేత నిరాకరించబడినవాడు (యెషయా.49:7, 53:2) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]
– అతడు జనులచేత అసహ్యించుకోబడ్డవాడు (యెషయా.49:7, 53:3) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]    
– అతడు యెహోవాచేత ప్రజలకు నిబంధనగా (క్రొత్తనిబంధనగా) నియమించబడ్డవాడు (యెషయా.42:7; 49:8) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు] 
– అతడు మన (ప్రజల) రోగములను, వ్యసనములను వహిస్తాడు (యెషయా.53:4)
– అతడు మన (ప్రజల) స్థానములో శిక్ష అనుభవిస్తాడు (యెషయా.53:5)
– అతడు పొందే శిక్షనుబట్టి మనము (ప్రజలు) స్వస్థత పొందుతాము (యెషయా.53:5) 
– అతడు దేవుని ప్రజల స్థానములో శిక్షించబడుతాడు మరియు ప్రాణత్యాగము చేస్తాడు (యెషయా.53:8)
– అతడు ఏ పాపము చెయకున్నా మరణశిక్షను అనుభవిస్తాడు (యెషయా.53:9)
– అతడు తననుతాను పాపపరిహారార్థబలిగా చేసుకుంటాడు (యెషయా.53:10)
– అతడు (మరణములోనుండి తిరిగి బ్రతుకుటద్వారా) దీర్ఘాయుష్మంతుడవుతాడు (యెషయా.53:10)
– అతనిద్వారా యెహోవా యొక్క ప్రణాలిక నెరవేర్చబడుతుంది (యెషయా.53:10)
– అతడు నీతిమంతుడైన యెహోవా సేవకుడు (యెషయా.53:11) 
– అతడు ప్రజల దోషములను తాను భరించి వారిని నిర్దోషులుగా చేస్తాడు (యెషయా.53:11)
– అతడు మరణమునొందునంతగా తన ప్రాణమును ధారపోస్తాడు (యెషయా.53:12)
– అతడు ప్రజల పాపములను భరిస్తూ వారి కొరకు విజ్ఙాపన చేస్తాడు (యెషయా.53:12)

పై వైశిష్టాలన్నీకూడా కన్యమరియ యొక్క కుమారుడైన యేసు (యషువ) జీవితములో ప్రస్పుటముగా నేరవేర్చబడటాన్ని క్రొత్తనిబంధన లేఖనాలలో వివరించబడింది. ఈ రకంగా ఇశ్రాయేలీయుడైన ఒక వ్యక్తి జీవితములో పై ప్రత్యేకతలన్నీ నెరవేర్చబడటమన్నది చరిత్రలో కన్యమరియ కుమారుడు యేసు (యషువ) జీవితములో తప్ప మరొకరి జీవితములో నెరవేర్చబడలేదు. ఇది దేవుడే మాట యిచ్చి నెరవేర్చాడన్న సత్యము కేవళము సత్యాన్వేషకులైన విజ్ఙులు గ్రహించగలరు. తద్వారా అలాంటివారు మాత్రమే పరమతండ్రి యొక్క నిత్యసంకల్పములోని యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క పాత్రను గుర్తించి స్వీకరించగలరు.

జూడాయిజములోని కొందరు దుర్బోధకులు లేఖనాలను వక్రీకరించే ప్రయత్నములో యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అన్నది కన్యమరియ కుమారుడు యేసు [యషువ] కాదు అంటూ అసందర్భ అభ్యంతరాలను అనేకం లేవనెత్తుతుంటారు. అలాంటివారు చెప్పేది సత్యమయితే మరి పైన చూపిన యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అనబడిన ఆ వ్యక్తి ఎవరు? ఆవ్యక్తిలో పైన ప్రవచనాత్మకంగా పేర్కొనబడ్డ విశయాలు నెరవేర్చ బడ్డాయా? ఆ వివరాలను అందిస్తేతప్ప ఆ వ్యక్తి యేసు కాదు అనడానికి వారికి అర్హత లేదు.

4) యెషయా గ్రంథము 42:1-7; 43:10; 49:5-8; 52:13-53:12 వాక్యాలలో ప్రభువైన యెహోవా చేత ‘నాసేవకుడు’ అంటు పేర్కొనబడింది యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగాని సూచించే ఒక అలంకార రూపమైన వ్యక్తి కాదుగాని, దేవుడే యెన్నుకొన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గ్రహించడానికిగల కారణాలు:

అ) యెషయా.42:1-7 వచనాల ధ్యానము: ఈ వాక్యాలలో ప్రవక్త అయిన యెషయా పేరుగాని, రాజైన దావీదు పేరుగాని, లేక కోశాధికారి ఎల్యాకీము పేరుగాని పేర్కొనబడలేదు. అంతమాత్రమేగాక యాకోబు లేక ఇశ్రాయేలు అన్న జనాంగము పేరుకూడా పేర్కొనబడలేదు. కనుక, ఈ వాక్యాలలో పేర్కొనబడిన వ్యక్తి అప్పటికింకా పేరు వెల్లడి చేయబడని దేవుడైన యెహోవా చేత ఏర్పరచుకోబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నది సుస్పష్టము.       

అంతేకాక, దేవుడైన యెహోవా ఈ వ్యక్తిని కాపాడి ప్రజలకు అంటే కేవళం అన్యులకే అనికాదు అందరికీ (ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు) నిబంధనగా నియమించబోటున్నట్లు వాగ్ధానము చేసాడు. ప్రజలతో అంటే మానవులందరితో చేయబడే నిబంధన నోవహునిబంధన తరువాత మెస్సయ్యనందు చేయబడే క్రొత్తనిబంధనే. 

ఆ) యెషయా.43:10 వచన ధ్యానము:

ఇ) యెషయా.49:5-6 వచనాల ధ్యానము:

“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.” 

– పై వాక్యాలలోని ‘నా సేవకుడు ‘ అన్నది యాకోబు/ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేషించి వాడబడిన పదజాలము కాదు. అది యెహోవా యెన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేషించి పేర్కొనబడింది. ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి ప్రభువైన దేవుని  యొద్దకు తీసుకువచ్చేవాడు, వారిని ఉద్దరించేవాడు. ఆ ప్రత్యేకమైన వ్యక్తే ‘నా సేవకుడు ‘ (మత్తయి 12:18) లేక ‘తన సేవకుడు ‘ (అపొ.కా.3:13) అనబడిన యేసు (యషువ) అన్న సత్యాన్ని దేవుడు తన ఆత్మ ప్రేరణతో క్రొత్తనిబంధన లేఖనాలలో స్పష్టపరచాడు.   

ఈ) యెషయా.52:13-53:12 వచనాల ధ్యానము

– అది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. ‘నా సేవకుడు ‘ అంటూ ఇశ్రాయేలు ప్రజలను సంబోధించిన ప్రతిసారి యాకోబు లేక ఇశ్రాయేలు అన్న నామాన్ని విస్పష్టముగా పేర్కొనడాన్ని యెషయా గ్రంథములో చూడగలము. అయితే ఇక్కడ ‘నా సేవకుడు ‘ అని ప్రకటిస్తున్న సందర్భములో యాకోబు అనిగాని ఇశ్రాయేలు అనిగాని పేర్కొనలేదన్నది గమనించాలి. దీన్ని బట్టి ఇక్కడ వివరించబడుతున్నది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదుగాని ప్రభువైన దేవుడు తానే ఎన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి అన్నది గ్రహించాలి.  

– ఇక్కడ ‘నా సేవకుడు ‘ అన్నది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. కారణం, ఇక్కడ వివరించబడుతున్న ‘నా సేవకుడు ‘  “తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును.” (యెషయా 53:10). అపరాధపరిహారార్థబలి/పాపపరిహారార్థబలి విశయములో లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం “ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొర్రెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి” (లేవి.కాం.4:32).
అయితే, యెషయా ప్రవక్త  గ్రంథము మొదటిలోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పాపిష్టి ప్రజలుగా దోషభరిత ప్రజలుగా మారిపోయారని స్పష్టగా ప్రకటించాడు (యెషయా 1:4). కనుక వారికి అపరాధపరిహారార్థబలిగా ఉండే అర్హత లేదు. ఆమాటకొస్తే వారికే అంటే వారినే ప్రక్షాళనము చేసేందుకు ఒక  అపరాధపరిహారార్థబలి అవసరమన్నది గ్రహించాలి. ఆ బలి ప్రభువైన దేవుడు ఎన్నుకొనిన ‘ఆయన సేవకుడు,’ ఆ సేవకుడు మెస్సయ్యగా విచ్చేసిన యషువ.        

– ఇక్కడ ‘నా సేవకుడు ‘ అన్నది ఇశ్రాయేలు ప్రజలను గురించి కాదు. “అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలో చించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు.”  (యెషయా 53:8-9).  

ఈ రెండు వాక్యాలలోని అతడు యెవరు? నా జనులు ఎవరు? నా జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అయితే అతడు ఇశ్రాయేలీయుల కొరకు బలిపశువుగా మారాడు అన్నది అర్థమవుతున్నది. మరి అతడే ఇశ్రాయేలు జనాంగము అని కాదు! అ ‘అతడు’ ప్రభువైన దేవుని ‘నా సేవకుడు.’ ఆయనే మెస్సయా. పై వాక్యాలలో పేర్కొనబడ్డట్టుగా ఆ మెస్సయ్య నిర్వర్తించబోయే కార్యాలను నిర్వర్తించినది యేసు (యషువ). దీన్ని బట్టి కూడా యేసు (యషువ) మెస్సయా (మషియాఖ్) అని నిరూపితమవుతున్నది.  

2 comments

  • నేను వ్యవసాయ చేస్తు దేవుని సేవ చేస్తాను

    యేసు యొక్క గొప్ప తనము ఆకాష అంచులు దాక చాటారు సూపర్ సూపర్ వందనాలు బాగుంది ..దయచేసి నన్ను కూడ మీగ్రూప్లొ యాడ్ చేయండి నేర్చుకుంటాను బ్రదర్

    • Admin

      బ్రదర్ ప్రభాకర్, వందనాలు! దేవుడు మిమ్ములను మీ పరిచర్యను అలాగే మీ వ్యవసాయ ప్రయత్నాలను ఆశీర్వదించి మీ అవసరతలన్నీ తీర్చాలని దేవునికి మా ప్రార్థన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *