యూదుమతస్తులకు ప్రశ్నలు-2

హీబ్రూ భాష దేవభాషా లేక అన్నిభాషలు దేవునికి సమానమేనా…?

(1) సృష్టికర్త తనను కేవలము హీబ్రూ భాషలోనే సంబోధించాలని, ప్రార్థించాలని, లేక అరాధించాలను అదేశించాడా? ఇతర భాషాపదాలను సృష్టికర్త అంగీకరించడా? లేఖనాధారలతో వివరించండి.

(2) సృష్టికర్త అన్యజనులనుకూడా హీబ్రూ భాష నేర్చుకొనే తనను సేవించాలని అశిస్తున్నాడా? లేఖనాధారాలతో వివరించండి. 

(3) కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా దేవుడు హీబ్రూ భాషను దైవభాషగా లేక ఆత్మీయభాషగా ఉద్దేశిస్తే పాత నిబంధన గ్రంథములోని కొన్ని లేఖనాలను అరామిక్ భాషలో వ్రాయబడటానికి (ఎజ్రా 4:8–6:18; దానియేలు 2:4–7:28) అనుమతించేవాడు కాదుగదా? 

(4) ఏకారణముచేత సృష్టికర్త తాను యిచ్చిన మోషేధర్మశాస్త్రములోని 613 ఆజ్ఙలలో ఒక్క ఆజ్ఙకూడా హీబ్రూభాషకు సంబంధించినది యివ్వలేదు? దీని కారణము భాషలన్నీ దేవునిముందు సమానమేనన్నది కాదా?  

(5)  దేవుడు ఆజ్ఙాపించకున్నా “సృష్టికర్తను లేక పరమతండ్రిని కేవలము హీబ్రూ భాషా పదాలతోనే సమీపించాలి, సంబోధించాలి, మరియు ఆరాధించాలి” అంటూ మానవులు కల్పించిన విధిని లేక ఉపదేశాన్ని అమాయకులపై రుద్దడము అన్నది ఎంతవరుకు దేవుని దృష్టికి అంగీకారము? అలా చేస్తున్నవారికి అది దేవుని వుగ్రతను దేవుని శాపాన్ని కొనితీసుకు రాదా?

(6) దేవుడు హీబ్రూ భాషను దైవభాషగా లేక ఆత్మీయభాషగా ఉద్దేశిస్తే బాబెలు గోపురము వద్ద దేవుడే భాషలను తారుమారు చేయడము జరిగింది. దేవుడే పలు భాషల ప్రారంభానికి నాంది పలికాడు. దేవుడే లోకములోవున్న భాషలన్నింటికి ప్రారంభకుడు మరియు అధికారి. కనుక, దేవుడే ప్రారంభించిన భాషా వైవిధ్యాలను లేక అన్యభాషలను తప్పుపట్టడము లేక తిరస్కరించడము అన్నది పాపభూయిష్టమైన ప్రయత్నము కాదా?

అయితే, కొందరి వాదన యిలా వుంటుంది: దేవుడే పలుభాషల ప్రారంభకుడైనా అది మానవులు దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడముద్వారా దేవుని శిక్షగా/శాపముగా పొందినవి. కనుక యితరభాషలు అశీర్వదించబడినవి కావు అందుచేత దేవున్ని యితరభాషాపదాలతో సంబోధించకూడదు మరియు అరాధించకూడదు.

పైవాదన చేసేవారు అలాగే ఈవాదనకు వంతపలికేవారు గమనించాలి. ఆదాము హవ్వలు పాపము చేసి దేవుని చేత శిక్షగా/శాపముగా కొనితెచ్చుకున్న దుష్పరిణామాలున్నాయి. మరి వాటిద్వారాకూడా దేవున్ని సమీపించకూడదు మరియు అరాధించకూడదు (ఆది.కాం.3:6-21). దేవుడు శాపముగా/శిక్షగా మానవాళికి అందించిన పరిణామాలు: గర్భవేదన (3:16), వ్యవసాయము దాని ఫలాలు (3:17-19), మరియు శరీరభాగాలను కప్పే దుస్తులు (3:9-12,21). పై వాదనప్రకారం, శాపముగా వచ్చిన గర్భ వేదనద్వారా పుట్టిన గర్భఫలాన్ని దేవునికి అర్పించకూడదు కదా?!. కాని, దేవుడే ప్రథమ సంతానాన్ని తనకు అర్పించమని చెప్పాడు, కాదా?! (నిర్గ.కాం.22:29). హన్నా తన గర్భఫలమైన సమూయేలును దేవునికి అర్పించింది (1సమూయేలు 1:21-28). శాపముగా సంక్రమించిన వ్యవసాయ ప్రయత్నాలద్వారా వచ్చే దేనినికూడా దేవున్నికి అర్పించకూడదు కదా…?!. మరి, దేవుడే వ్యవసాయములో వచ్చే ప్రథమఫలాలను దేవుని అర్పించాలని ఆజ్ఙాపించాడు…?! (లేవీ.కాం.2:1-16). ఇక శాపము యొక్క పర్యవసానముగా సంక్రమించిన దుస్తులను ధరించడమన్నది దేవున్ని సమీపించడానికి మరియు ఆరధించడానికి అడ్డురాదా? అసలు దిగంబరులుగా దేవున్ని సమీపించడమన్నది దేవున్ని గౌరవించడమా లేక అవమానించడమా…?! (నిర్గ.కాం.20:26). నిజానికి దిగంభరత్వాన్ని దేవుడు శాపముగా లెక్కిస్తున్నాడు (ద్వి.కాం.28:48; యెషయా 47:3; నహూము 3:5).        

కనుక, బట్టలయినా భాషలైనా లేక పనులైనా పదాలైనా దేవుడనుగ్రహించినవే. వాటియొక్క సరియైన వుపయోగముద్వారా పరమతండ్రిని సమీపించాలి ఆయనను వాటిద్వారా ఘనపరుస్తూ ఆరాధించాలి. ఒకవేళ దేవుడే యేదుస్తులనూ ధరించకూడదు అని ఆజ్ఙాపిస్తే దిగంబరులుగానే వుండాలి. కాని ఆయన అలాంటి ఆజ్ఙ యేదీ యివ్వలేదు. అలాగే, ఒకవేళ దేవుడే యితరభాషలాతో తనను సంబొధించకూడదు మరియు ఆరాధించకూడదు అని ఆజ్ఙాపిస్తే యితరభాషలను దేవున్ని ఆరాధించడానికి వుపయోగించకూడదు. కాని, ఆయన అలాంటి ఆజ్ఙ యేది యివ్వలేదు. దేవుడివ్వని ఆజ్ఙను యిచ్చినట్లు లేక ఆయన యిచ్చిన ఆజ్ఙను యివ్వనట్లు బోధించడము ఘోరమైన పాపము. ఆపాపము దేవుని వుగ్రతను శాపాన్ని తీసుకొస్తుందన్న సత్యం  మరవకూడదు.   

(7) కొందరు అపోహపడుతున్నట్లుగా మొదట్లో మొత్తము బైబిలు, పాతనిబంధన మరియు క్రొతానిబంధన, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన దైవజనులు కేవలము హీబ్రూ భాషలోనే వ్రాసినా కాలక్రమేన పాతనిబంధనలోని కొన్ని భాగాలను అరామిక్ భాషలో క్రొత్తనిబంధన అంతా గ్రీకు భాషలో మతపెద్దలు వ్రసుకున్నారు అన్నది వాస్తవమైతే, సదరు వ్యక్తులు క్రింది ప్రశ్నలకు సమాధానమివ్వాలి:

– ఒకవేళ కాలక్రమములో పాతనిబంధనలోని కొన్ని లేఖన భాగాలను అరామిక్ భాషలో ఎత్తివ్రాసుకుంటే మరి మొత్తము పాతనిబంధన అంతా ఎందుకు అరామిక్ భాషలో వ్రాసుకోలేకపోయారు ఆ సందర్భములో? 
– అరమైక్ భాషలోని లేఖన భాగాలు మిగతా హీబ్రూ లేఖనాలసరసన ఎందువలన హీబ్రూ భాషలో లేకుండాపోయాయి?
– పాతనిబంధన అంతా హీబ్రూ భాషలోనే వ్రాయబడింది అని నమ్మేందుకు అలాంటి ఆధారాలుగల పురాతన్ హీబ్రూ లేఖనాలేవీ లేవెందుకని?
– క్రొత్తనిబంధన అంతా మొదట హీబ్రూ భాషలో వ్రాయబడి వుంటే కాలక్రమేన వాటిని గ్రీకు భాషలోకి ఎత్తివ్రాసుకున్నారనేది వాస్తవమైతే మరి మొదట వ్రాయబడిన క్రొత్తనిబంధన లేఖనాల హీబ్రూ వ్రాతప్రతులు ఎక్కడున్నాయి?
– సర్వశక్తిగల దేవుడు తన లేఖనాలను అన్నింటినీ కేవలము హీబ్రూ భాషలో వ్రాయించినా మానవులు వాటిన మార్చి అరామిక్ మరియు గ్రీకు భాషలలోకి అనువదించుకుంటే దేవుడు ఆ అనువాదాలను మాత్రమే కాపాడగలిగాడు కాని హీబ్రూ భాషలోని తన లేఖనాలను కాపాడుకోలేకపోయాడని మీరు భావించడానికి కారణమేమి?

(8) హీబ్రూ దేవుని భాష అయితే మరి రాజగు బెల్షస్సరు యెదుట దేవుని యొద్దనుండి పంపబడిన హస్తము సహితం హీబ్రూ భాషలో కాక వేరే భాషలో వ్రాసింది ఎందుకని? (దానియేలు 5వ అధ్యాయము). 

(9) దేవుడు హీబ్రూభాష తప్ప అన్యభాషలను లెక్కించడు లేక అంగీకరించడు అంటూ తప్పుడు బోధ చేస్తున్నవారి మాటలను పటాపంచలుచేస్తూ తానే తన ప్రజలతో అన్యభాషతో మాట్లాడబోతున్నట్లు దేవుడే ప్రకటించాడు (యెషయా 28:12-13). అంతమాత్రమే కాక ఐగుప్తు దేశములోని ఐదు పట్టణాలు కనానుభాషతో మాట్లాడుచు దేవునివారమంటూ ప్రమాణము చేయబోతున్నరంటూ దేవుడే తన ప్రవక్తద్వారా ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (యెషయా 19:18-21). అన్యభాషలకు ఈ రకమైన ఉత్కృష్టస్థానాన్ని యిచ్చే దేవుడు  అన్యభాషలను అంగీకరించకుండా వాటిని తిరస్కరించేవాడంటూ ఆయన నామాన్ని వ్యక్తిత్వాన్ని తమ అబద్దాలతో వక్రికరించేవారు యెంతటి పాపములో శాపములో వున్నారో గ్రహించడములేదు ఎందుకని?

(10) ఈనాడు రబ్బీల-జూడాయిజం వారు మాసాలకు అన్యులైన అరామీయులు పెట్టుకున్న మాసాల పేర్లను వుపయోగిస్తున్నారు. ఇది బబులోనుచెఱ నుండి ప్రారంభమైన అన్యాచారముగా గుర్తించవచ్చు. జూన్-జులై లలో వచ్చే మాసానికి “తమ్మూజ్” అని పేరు పెట్టుకున్నారు. “తమ్మూజ్” అన్నది బబులోనులోని అన్యులు ఆరాధించే అబద్ద దేవుని పేరు (యెహెజ్కేలు 8:14). తనాక్ అంతటిలో ఎక్కడాకూడా ఒక మాసానికి “తమ్మూజ్” అన్న పేరు ఏ ప్రవక్తా యివ్వలేదు. ఇది తనాక్-జూడాయిజం కు వ్యతిరేకులైన రబ్బీల-జూడాయిజం వారి ఆచారము. ఈ అన్యాచారాన్ని పాటించే రబ్బీల-జూడాయిజం లోనివారు అన్యభాషలలో దేవున్ని సంబోధిస్తూ ఆరాధించే వారిని విమర్శిస్తూ తప్పుపట్టడమన్నది వేశధారులైన శాస్త్రులు పరిసయ్యులకన్నా నీచమైన ప్రవర్తన అని ఇట్టే అర్థమవుతున్నది.   

(11) ఎల్, ఎలోహిం, అదోనాయ్ వంటి హెబ్రీ పదాలు నరులకు, అబద్ధ దేవుళ్ళకు/దేవతలకు ఆపాదించబడ్డాయి, అదీ తనాక్ లోనే చూడగల విశయము. మరి మనుషులకు అన్యదేవుళ్ళకు వుపయోగించబడిన ఇలాంటి పదాలు అపవిత్రమైనవి కావా? ఈ పదాలను తనాక్ లోని ప్రవక్తలు నిజదేవునికి  ఎలా ఆపాదించగలిగారు?

(12) సృష్టికర్త తన జ్ఙాపకార్త నామాన్ని ప్రవక్త అయిన మోషేకు ప్రకటించాడు. అది ‘యోద్, హే, వవ్, హే’ (יהוה) అన్న నాలుగు హీబ్రూ హల్లులైన అక్షరాలతో కూడినది. ఈ నాలుగు హీబ్రూ అక్షరాలతో (హల్లులతో) కూడిన సృష్టికర్త నామము యొక్క పరిపూర్ణ వుచ్చారణ కేవలము ప్రవక్తల/అపోస్తలుల కాలానికే పరిమితమైనది. ఇప్పుడు వాటి పరిపూర్ణ వుచ్చారణ యేనరునికీ తెలియదు. అయితే, ఒకవేళ తెలుసును అని ఎవరైన నమ్మితే దయచేసి యెవరికి ఎలా తెలుసునో ఆధారాలతో వివరించండి.   

(13) సృష్టికర్త నామములోని మొదటి రెండు అక్షరాల వుచ్చారణ పాత నిబంధనలోనే (తనాఖ్) తెలుపబడినది. ‘యోద్ హే’ (יה) అన్న రెండు అక్షరాలకు (హల్లులకు) అచ్చును చేర్చడముద్వారా ‘య్యా/యాహ్’   (יהּ) గా వుచ్చరించబడుతున్నది. ఉదాహరణకు, హల్లెలూయ్యా. అంటే, య్యా కు స్తోత్రము. ఇక్కడ “యోద్ హే వవ్ హే” (יהוה) అన్న సృష్టికర్త నామానికి యివ్వబడిన సంక్షిప్తరూపమే ‘య్యా!’ (ఉదాహరణ: ని.కాం.15:2; 17:16; కీర్తన 89:9; పరమగీతములు 8:6). కనుక దీన్నిబట్టి మనకు సృష్టికర్త నామములోని మొదటి సగభాగాన్ని మాత్రమే సరిగ్గా వుచ్చరించడము తెలుసు. మిగిలిన సగభాగాన్ని సరిగ్గా వుచ్చరించడము తెలియదు. అంటే, ‘వవ్ హే’ అన్న హీబ్రూ హల్లులమధ్య ఎలాంటి అచ్చును (నిక్కుద్) వుపయోగించాలన్నది లేఖనాలలో సూచించబడలేదు. వహ్ లేక వెహ్ లేక వొహ్ లేక విహ్ లేక వుహ్???!!! అంటే, సృష్టికర్త నామాన్ని వుచ్చరించాల్సినది యహ్ వహ్ గాన లేక యహ్ వెహ్ గాన లేక యహ్ విహ్ గాన లేక యహ్ వొహ్ గాన లేక యహ్ వుహ్ గానా అన్నది ప్రశ్న. దీనికి జవాబు తెలిసినవారు దయచేసి లేఖనాధారాలతో వివరించగలరు.   

(14) సృష్టికర్త నామాన్ని నమ్మాలి, ప్రేమించాలి, లక్షపెట్టాలి, ఘనపరచాలి, మరియు పరిశుద్ధపరచాలి అంటే అర్థము యేమిటి? సృష్టికర్త నామాన్ని హీబ్రూ భాషలో వ్రాసిపెట్టుకోవడమనా లేక హీబ్రూ భాషలో పలకడమనా లేక పరమతండ్రి నామాన్ని ప్రత్యక్షంగా లేక పరోక్షంగాని రోజుకు ఓ డజను సార్లో లేక వందసార్లో సోషలు మీడియాలో, బజారులో, వాదోపవాదాలలో, లేక సంభాషణలలో అలవోకగా వల్లించడమనా? ఇది పరమతండ్రి మహోన్నత నామాన్ని వ్యర్థముగా వుచ్చరించడము కాదా? తద్వారా దైవోగ్రతకూ దైవశాపానికి పాత్రులు కారా?                    

(15) ఈలోకములోని శరీరసంబంధమైన తండ్రిని తండ్రీ లేక నాన్నా అని ప్రేమగా గౌరవంగా పిలుస్తాము. మరి పరమతండ్రిని యింకెంత ప్రేమగా గౌరవంగా పిలవాలో అలోచించండి! 

పరమతండ్రిని అబ్బా తండ్రీ అని లేక పరమందున్న మాతండ్రీ అని సగౌరవంగా సంబోధించాలేగాని పేరుపెట్టి సంబోధించడమన్నది అగౌరవమైనదేకాక అనాగరికమైనదికూడా. ఆ రకంగా అన్యులు లేక దుర్భీజులే సృష్టికర్తను/పరమతండ్రిని పేరుపెట్టి పిలిచేది, కాని ఆయన పిల్లలు ఆయనను పేరుపెట్టి సంబోధించడమన్నది చేయరు, కాదా?! 

(16) బైబిలులోనే యేసు/యషువ అన్న పేరు అనేకమందికి వుంది. అయితే రక్షణ అన్నది సిరా గుర్తులలోకాదు, అక్షరాల కూర్పులోకాదు, పదాల ఉచ్చరణలోకాదు. రక్షణ అన్నది వ్యక్తిలోనే. ఆ వ్యక్తే దైవసుతుడు, యషువ మషియాఖ్./యేసుక్రీస్తు/Jesus Christ. ఈ నామములో లేక ఆయన నామములో అంటే ఆయనయందే అని భావము.

(17) నామము అంటే యేమిటి? సృష్టికర్త ‘నా నామము ‘ అని తెలియచేస్తున్నప్పుడు దాన్ని ఏవిధంగా అర్థము చేసుకోవాలి? 

(1Kin.8:29, 2Kin.23:27; 1Kin.9:3; 2Kin.21:7; 1Kin.11:36; Jer.7:12; Amos 2:7; Mal.1:11; Acts 15:17’ Ex.23:21)

(18) క్రీ.పూ.రెండవ శతాబ్దములోనే తనాక్ లేక పాతనిబంధన గ్రంథాన్ని యూదులు హీబ్రూ మరియు అరామిక్ భాషలలోనుండి గ్రీకు భాషలోనికి అనువదించారు. దాన్నే సెప్టూజింట్ అనిపిలుస్తారు. ఇది మొదటి శతాబ్దములోని యూదులకు మరియు క్రైస్తవులకు అందుబాటులోవుండింది. సెప్టూజింట్ అనబడే తనాక్ యొక్క గ్రీకు అనువాదాన్నిగాని లేక దాని వుపయోగాన్నిగాని యూదా మతపెద్దలు, ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్), మరియు అపొస్తలులు ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తపరచలేదు. నిజానికి సెప్టూజింటును నిజమైన యూదులు తమ మతాభ్యాసములో విరివిగా వాడుతారన్నది చరిత్ర తెలిపే సత్యం. ఆమాటకొస్తే తనాక్ (పాతనిబంధన గ్రంథం) పై వ్రాయబడిన యూదుల వ్యాఖ్యానం (מדרשׁ/మిద్రాష్) బోధిస్తున్నదాని ప్రకారం మోషే తనద్వారా యివ్వబడిన ధర్మశాస్త్రాన్ని కేవలం హీబ్రూ భాషలోనే కాక ఆ దినాలలోని 70 భాషలలో ఇశ్రాయేలీయులకు అందించాడట!

పై వాస్తవాల వెలుగులో తనాక్ (పాతనిబంధన) గ్రంథాన్ని వేరే భాషలలోకి అనువదించకూడదు అంటూ బోధించేవారు నిజానికి దైవ వ్యతిరేకులని, లేఖన వ్యతిరేకులని, మరియు అబద్ద యూదులని ఇట్టే తెలిసిపోతున్నది. కనుక అలాంటివారి బోధలకు చెవియొగ్గువారు నిర్మలమైన విశ్వాస విశయములో కలవరపరచబడి తత్ఫలితంగా అసత్యములోనికి మళ్ళి నిత్యనాశనములోకి ప్రవేశించే ప్రామాదముంది!