రబ్బీల మతం Vs. మెస్సయ్య మార్గం

రబ్బీల మత ప్రారంభం

రబ్బీల మతం [జూడాయిజం] అన్నది ప్రవక్తలకాలం తరువాత ఉనికిలోకి వచ్చిన మతం.

పాతనిబంధన కాలములోని చివరి ప్రవక్త మలాకి తరువాత దేవునికి మరియు నరులకు మధ్య దాదాపు 400 సంవత్సరాల నిశబ్ధత నెలకొన్నది. అటుతరువాతే బాప్తీస్మమిచ్చు యోహానుద్వారా ప్రకటించబడిన మారుమనస్సుకొరకైన పిలుపు, మెస్సయ్య యొక్క ఉపదేశము (యెషయా.42:4), చివరగా మెస్సయ్య పంపిన అపోస్తలులద్వారా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాలు మానవకోటికి అందించబడ్డాయి.

పాతనిబంధనా కాలములోని చివరిప్రవక్తకు మరియు బాప్తీస్మమిచ్చు యోహానుకు మధ్య నెలకొనివున్న 400 సంవత్సరాల నిశబ్ధకాలములో యూదుమతబోధకుల ప్రాభల్యము పెరిగి వారి ప్రయత్నాలలో రబ్బీల మతం అయిన జూడాయిజం లేక యూదుమతం అన్నది మొలకెత్తింది. ఈమతస్తులు ఒకవైపు మోషేద్వారా యివ్వబడిన తోరా మరియు అటుతరువాత వచ్చిన ప్రవక్తలద్వారా యివ్వబడిన లేఖనాలలోని సందేశాలను సామాన్యులకు బోధిస్తూ తాముమాత్రము తమకిష్టమైన నియమాలను విధులను ఏర్పరచుకొని వాటిప్రకారం వేశధారజీవితం గడిపేవారు.

ప్రవక్తల ప్రవచనాలను నెరవేరుస్తూ మొదటిశతాబ్ధములో ఇశ్రాయేలీయుల మధ్యకు విచ్చేసిన మెస్సయ్య ఈ మతబోధకులను ఎదురిస్తూ వారి దైవవ్యతిరేక బోధలను ప్రజల ముందు యెండగడుతూ దారితప్పిన అమాయక ఇశ్రాయేలీయులను తన ఉపదేశముద్వారా తిరిగి దేవుని మార్గములోకి తీసుకురావడం మొదలుబెట్టాడు.

తనాక్ జూడాయిజమునుండి తాల్ముద్ జూడాయిజంలోకి

ఒకవైపు మెస్సయ్య పాపపరిహారార్థబలిగా మరణించి తిరిగిలేచి పరలోకానికి ఆరోహనమైన తరువాతి దినాలలో వేలాది యూదుమతస్తులు జూడాయిజమును వదిలి యేసును (యషువ) క్రీస్తుగా (మెస్సయ్య) గుర్తించి క్రైస్తవులుగా మారడం మొదలుబెట్టారు. మరొకవైపు 70 క్రీ.శ. లో జూడాయిజానికు కేంద్రంగా నిలిచిన యెరూషలేములోని దేవాలయమును రోమనులు ద్వంసం చేసారు. ఈ రేండు కారణాలనుబట్టి తనాక్ ఆధారంగా అంటే పాతనిబంధనాగ్రంథాన్ని ఆధారం చేసుకొని పాటించబడిన జూడాయిజం (తనాక్-జూడాయిజం) తొందరలోనే ఉనికిని కోల్పోవడంతో రెండవ శతాబ్ధములో యూదుమతబోధకుల ప్రమేయంతో ఒక క్రొత్త జూడాయిజం అంటే రబ్బీల బోధలపై ఆధారపడి ప్రస్తుతం విస్తరిస్తున్న రబ్బీల జుడాయిజం (తాల్ముద్-జూడాయిజం) పుట్టుకొచ్చింది.

జూడాయిజములోనుండి మెస్సయ్య మార్గములోనికి

పౌలుగా మారిన ఒకప్పటి సౌలు కూడా యేసే (యషువ) క్రీస్తు (మెస్సయ్య) అన్న ఉత్కృష్ట సత్యాన్ని గుర్తించకముందు జూడాయిజములో (యూదుమతములో) తాను నిష్టతో గడిపిన తన జీవితముగురించి చెప్పుకోవడం చూస్తాము (గలతీ.1:11-14). అయినా తాను యేసుక్రీస్తులో పొందబోయే మహిమతో పోలిస్తే అదంతా పెంటతో సమానమని కూడా (ఫిలిప్పీ.3:4-11) అపోస్తలుడైన పౌలు నిర్ద్వందంగా తేల్చేసాడు! తాను ఎంతో నిష్టగా పాటించిన జూడాయిజం తనను రక్షించలేకపోయిందని అయితే మెస్సయ్యగా వచ్చిన యేసే తనను రక్షించగలిగాడని సాక్ష్యమిచ్చి ఆ సత్యాన్ని ప్రకటిస్తూ ఆప్రయత్నములో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి హతసాక్షిగా మారాడు.

అపోస్తలుడైన పౌలు ఒకప్పటి తన పాతజీవితాన్ని గురించి మాట్లాడుతూ క్రింది వివరాలనిచ్చాడు:

ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని” (ఫిలిప్పీ.3:5-6)

మెస్సయ్యను గుర్తించి వెంబడిస్తున్న తరువాత ఆ పాత జీవితములోని గొప్పల గురించి చెబుతూ అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు,

అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చ యముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును, ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.” (ఫిలిప్పీ.3:7-11)

పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితములోని లాభకరమైన విశయాలు:

  1. ఎనిమిదవ దినమున సున్నతి పొందటం
  2. ఇశ్రాయేలువంశపువానిగా పుట్టడం
  3. బెన్యామీను గోత్రముకు చెందినవాడుగా ఉండటం
  4. హెబ్రీయ సంతానముకు చెందటం
  5. ధర్మశాస్ర విశయములో పరిసయ్యుడుగా జీవించటం
  6. ఆసక్తి విశయములో సంఘమును అంటే నిజ క్రైస్తవులను హింసించటం
  7. ధర్మశాస్త్రము యొక్క నీతి విశయములో నిందారహితుడుగా చూపించుకోవటం

అయినా, అపోస్తలుడైన పౌలు తాను క్రీస్తును సంపాదించుకొన్న తరువాత క్రీస్తునందలి విశ్వాసముద్వారా దేవుని నీతిని పొందిన కారణాన్నిబట్టి అలాగే క్రీస్తును పోలి వుండాలన్న ఆశనుబట్టి పై లాభకరమైన వాటినన్నిటిని నష్టముగా మరియు పెంటగా లెక్కించాడు! పౌలు భక్తుడు నష్టముగా మరియు పెంటగా లెక్కించినవాటిలోని కొన్నింటిని సంపాదించుకోవాలనే వృధా ప్రయత్నము చేసే వ్యక్తుల మానసికస్థితిగాని లేక స్వభావలక్షణాలనుగాని వివరించి చెప్పాల్సిన అవసరము లేదు!

అపోస్తలుడైన పౌలుకు భిన్నంగా ఈనాడు అనేకమంది క్రైస్తవులనబడినవారు [మత క్రైస్తవులు లేక నామకార్థ క్రైస్తవులు] జూడాయిజమువారి దుర్బోధలనుబట్టి మోసపోతూ తిరిగి అపోస్తలుడైన పౌలు నష్టముగా మరియు పెంటగా ఎంచినవాటివైపు మరలిపోతూ నిత్యజీవితాన్ని కోల్పోతున్నారు. అయ్యో అలాంటివారికి శ్రమ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *