బైబిలు వెలుగులో యషువ (యేసు)

దేవుడు ఈలోకములోని కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిద్వారా తన సందేశాన్ని మానవులకు అందిస్తూ వచ్చాడు. దేవునిచేత ఎన్నుకోబడి దేవుని తరపున పంపించబడినవారిలో ప్రధానమైనవాడు మోషే (ని.కాం.3:14-15).

మోషే తరువాత వచ్చిన ప్రవక్తలందరుకూడా (యిర్మీయ.26:5) ఈలోకములోనుండి దేవునిచేత ఎన్నుకోబడి పంపబడ్డవారే. ఈ రకంగా దేవుడు మోషే మొదలుకొని మలాకి వరకు దాదాపు వెయ్యి సంవత్సరాల వ్యవధిలో అనేకమంది ప్రవక్తలను ఎన్నుకొని తన సందేశాలతో తన ప్రజల యొద్దకు పంపిస్తూ వచ్చాడు. అయినా వారిలో ఒక్కరుకూడా పరలోకములోనుండి దిగివచ్చినవారు లేరు. బాప్తీస్మమిచ్చు యోహానుకూడా ఇదే కోవకు చెందినవాడు.

దేవునియొద్దనుండి [παρὰ Θεοῦ/పారా థియూ=from God] పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.” (యోహాను.1:6)

అయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవాళికి కేవలము తన అంతిమ సందేశాన్ని అందించటానికి మాత్రమేగాక వారికి రక్షకునిగా మారి వారి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అందించే పరిపూర్ణ బలిగా తననుతాను అర్పించుకునేందుకై అద్వితీయుడైన తన స్వంత కుమారున్ని పరలోకములోనుండి ఈ లోకములోనికి పంపించాడు అన్నది లేఖనాలు ఘంఠాపథంగా చేస్తున్న ప్రకటన.

పరలోకములోనుండి ఈలోకములోకి దైవాంశసంభూతునిగా విచ్చేసిన యేసు క్రీస్తుకు మరియు ఈ లోకములోనుండే ప్రవక్తలుగా ఎన్నుకోబడిన వారికి మధ్య ఉన్న ప్రాథమిక అస్తిత్వ వ్యత్యాసాన్ని గ్రహించలేని ఆత్మీయ అంధత్వముతోకూడిన దుర్బోధకులు ప్రభువైన యేసు క్రీస్తును కేవలము ఒక నరునిగా మరియు ప్రవక్తలలో ఒకనిగా మాత్రమే చిత్రీకరించె ప్రయత్నం చేస్తారు. ఈ వాస్తవాన్ని బట్టి దైవ సంబంధులు లేఖనాల సమిష్టి బోధను పరిశీలించి అబద్ధ బోధకుల వక్రవ్యాఖ్యానాలకు ప్రతికూలంగా యివ్వబడిన లేఖన బోధలోని సత్యాన్ని గ్రహించాలి.

I. యషువ ఈలోకములో శరీరధారిగా ప్రవేశించకముందు ఉనికిని కలిగివున్నవాడు

“యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి [Θεοῦ ἐξῆλθον/థియూ ఎక్సెల్తోన్ = came out of God/దేవునిలోనుండి వచ్చాను] యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.” (యోహాను.8:42)

“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి [ἐξῆλθον/ఎక్సెల్తోన్ = came out of/లోనుండి వచ్చాను] లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)

(i) మట్టిలోనుండి సృష్టించబడిన ఆదాములా గాక పరలోకములోనుండి వచ్చాడు:

“నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.” (యోహాను.6:38)
దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.” (యోహాను.6:47)
“అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు?” (యోహాను.6:62)
“యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.” (యోహాను.8:14)
“మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమి్మతిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:27-28)
“మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.” (1కొరింథి.15:47)

(ii) ఈలోకములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు తండ్రి ఒక శరీరాన్ని అమర్చాడు:

“దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:4)
“కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

(iii) విశ్వాసుల తండ్రియైన అబ్రహాముకంటే ముందు ఉన్నవాడు [ఉండినవాడు కాదు]:

“యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని [I am, not I was] మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను.8:58)

(iv) తండ్రియైన దేవుని యొద్ద వసించాడు:

“మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను.3:13)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.” (1యోహాను.1:1-2)

(v) తండ్రియైన దేవునితో సృష్టికార్యములో పాల్గొన్నాడు:

ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” (యోహాను.1:2-3)
“ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.” (1కొరింథీ.8:6)
“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.” (కొలొస్సీ.1:16-17)
“ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.” (హెబ్రీ.1:2)
తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.” (హెబ్రీ.8-12)

(vi) ఉనికికి ప్రారంభము లేనివాడు:

“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)
“అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.” (హెబ్రీ.7:3)

(vii) దేవుని వాక్కుగా [Λόγος/లోగొస్] దేవునితో వున్నాడు:

“ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.” (ఆది.కాం.15:1)
“అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా” (2సమూయేలు.7:4)
“అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1రాజులు.6:11)
“ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1ది.వృ.17:3)
యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యెషయా.38:4)
“మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యిర్మీయా.2:1)
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను.1:1-2,14)
“రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” (ప్రకటన.19:13)

(viii) దేవుని రూపము [μορφή/మోర్ఫే=form] నందుండి దైవత్వములోని అంతర్గత వాస్తవముగా [Internal Reality] ఉన్న వ్యక్తి:

ఆయన దేవుని స్వరూపము [μορφή/మోర్ఫే=form/రూపము] కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని” (ఫిలిప్పీ.2:6)

II. లోకములోనికి యషువ ప్రవేశము

బైబిలులో ‘లోకము’ [గ్రీకు మూల పదం: κόσμος/కాస్మోస్] అన్న పదము మూడు వివిధ అర్థాలను వ్యక్తపరుస్తూ ఉపయోగించబడింది. కొన్ని సందర్భాలలో ‘లోకము’ అన్న పదం విశ్వమంతటిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.13:35; యోహాను.13:1; 17:5,24), మరికొన్ని సందర్భాలలో భూమిపై వసిస్తున్న నరులందరిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.4:8; యోహాను.1:29; 3:16; 4:42; 17:6), ఇంకొన్ని సందర్భాలలో కేవలము భూలోకములోని అవిశ్వాసులను మాత్రమే సూచించటానికి వుపయోగించబడింది (యోహాను.1:10; 3:17; 7:7: 14:17; 17:14,18). ఈ పదము ఉపయోగించబడిన లేఖన సందర్భమే ఆ పదం ఏ భావముతో అక్కడ ఉపయోగించబడిందో గ్రహించటానికి ప్రధాన ఆధారము.

ఈలోకములోకి శరీరధారిగ విచ్చేయకముందు ఆయనకున్న స్థాయి మరియు అస్తిత్వము

(i) దేవుడైన తండ్రికి కుమారుడు: కన్యమరియకు జన్మించక పూర్వమే ఆయన దేవునికి కుమారుడు (కీర్తనలు 2:7,12; సామెతలు 30:4). మరోవిధంగా చెప్పుకోవాలంటే ఆయన దేవునిలోనుండి ఉద్భవించినవాడు! ఆ కారణాన్నిబట్టే ఆయన ఈ లోకములోనికి రాకముందే ఆయనను దేవుని కుమారుడంటూ లేఖనాలు పేర్కొంటున్నాయి:

“లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపలేదు.” (యోహాను.3:17)
తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి [విశ్వములోనికి] పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?” (యోహాను.10:36)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు [విశ్వములోనికి] వచ్చియున్నాను; మరియు లోకమును [విశ్వమును] విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,” (గలతీ.4:4)
“దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1యోహాను.4:8-10)

(ii) దైవత్వములోని వ్యక్తి: దైవత్వపు లక్షణాలను కలిగిన వ్యక్తిగా ఆయనను లేఖనాలు పరిచయం చేస్తున్నాయి (మీకా 5:2; యోహాను 1:1,14, 20:28; రోమా.9:5; ఫిలిప్పీ.2:5-6; కొలొస్సీ.1:15,17; తీతుకు.1:13; హెబ్రీ.1:3,8)

(iii) నిత్యత్వములో తండ్రిచేత ప్రేమించబడ్డాడు: సృష్టికిముందే తండ్రియైన దేవునితో వసించాడు మరియు తండ్రిచేత ప్రేమించబడ్డాడు (యోహాను 17:5,24)

III. ఈలోకములోనికి యషువ విచ్చేసిన విధానము

– తన దైవత్వపు అధికారాలను/హాక్కులను ఉపయోగించకుండా రిక్తునిగా చేసుకోవటముద్వారా దైవత్వాన్ని మరుగుపరచుకొన్నాడు (ఫిలిప్పీ.2:7; హెబ్రీ.2:9,17-18)
– శరీరధారిగా అంటే పాపశరీరాకారముతో (పాపశరీరముతో కాదు సుమా!) వచ్చాడు (యోహాను 1:14; రోమా.8:4; హెబ్రీ.10:5). కనుకనే ఒక మనిషిగా జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, అలాగే దేవుడు కూడా వున్నారు. అంతేగాక, ఈలోకములో మానవులకివ్వబడిన పరిమితులలో జీవించాడు.
– దాసునిస్వరూపములో వచ్చాడు (ఫిలిప్పీ.2:7-8)

IV. దేవుడు ఈ లోకస్తుల యెదుట యషువకు నిర్దేశించిన స్థానము/పాత్ర

– ‘రక్షకుడు’ మరియు ‘ప్రభువు’ (కీర్తనలు 110:1; మత్తయి.1:21; లూకా.1:43, 20:41-44; అపో.కార్య.2:36)
– దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా వసించిన దేవుని ‘మర్మము’ (కొలొస్సీ.2:2,9)
– దేవునికి మరియు నరులకు ‘మధ్యవర్తి’ (1తిమోతి.2:5-6). కేవలం ఒక నరుడు మాత్రమే దేవునికి మరియు నరులకు నడుమ మధ్యవర్తి కాలేడు. అలాగే, కేవలం దేవుడు మాత్రమే నరులకు మరియు దేవునికి మధ్య మధ్యవర్తిగా వుండలేడు. దైవత్వములో దేవునిగావుంటూ అదేసమయములో నరులమధ్య నరునిగా వున్న దైవాంశసంభూతుడే దేవునికి మరియు నరులకు మధ్య నిజమైన మధ్యవర్తిగా వుండగలడు.

V. ఈ సృష్టి అంతటిలో యషువకున్న గొప్పతనం

– ఆదాముకంటే గొప్పవాడు (1కొరింథీ.15:22,45)
– సొలొమోనుకంటే గొప్పవాడు (మత్తయి 12:42; లూకా 11:31)
– యోనాకంటే గొప్పవాడు (మత్తయి 12:41; లూకా 11:32)
– దావీదుకంటే గొప్పవాడు (కీర్త.110:1; మత్తయి 22:44; ప్రకటన 22:16)
– మోషేకంటే గొప్పవాడు (హెబ్రీ. 3:1-6)
– యాకోబు/ఇశ్రాయేలుకంటే గొప్పవాడు (యోహాను.4:12-14)
– అబ్రహాముకంటే గొప్పవాడు (యోహాను 8:54-58)
– మెల్కీసెదెకుకంటే గొప్పవాడు (హెబ్రీ.7:1-25)
– దేవదూతలకంటే గొప్పవాడు (మత్తయి 13:41-42; హెబ్రీ 1:4,6)
– విశ్రాంతిదినముకంటే గొప్పవాడు (మత్తయి 12:8; యోహాను.5:17-18)
– అందరికంటే గొప్పవాడు (ఎఫెసీ 1:20-21; ఫిలిప్పీ 2:9-11)
– దేవుని మందిరముకంటే గొప్పవాడు (మత్తయి.12:6; యోహాను.2:19-21)

VI. యషువ తనకు మరియు తండ్రికి మధ్య వున్న అవినాభావసంబంధాన్ని గురించి తెలియజేసిన సత్యాలు

– “తండ్రియందు నేనును నాయందు తండ్రియు యున్నాము” (యోహాను 10:38; 14:10-11).
– “నేనును తండ్రియును ఏకమై యున్నాము.” (యోహాను 10:30)
– “నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహి మపరచబడి యున్నాను.” (యోహాను 16:15; 17:10)
– “తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను” (యోహాను 5:23).
– “నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు” (యోహాను 12:45; 14:9).
– “నాయందు విశ్వాసముంచు వాడు…నన్ను పంపిన వానియందు విశ్వాసముంచుచున్నాడు. (యోహాను 12:44)
– “కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.” (1యోహాను 2:23)
– “నన్ను ద్వేశించువాడు నా తండ్రినికూడా ద్వేశించుచున్నాడు.” (యోహాను. 7:7; 15:23)
– “తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడుగాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.” (మత్తయి 11:27)
– “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము.” (యోహాను 17:2)

VII. యషువ యెడల నిజవిశ్వాసులకుండాల్సిన దృక్పథము/వైఖరి విశయములో తండ్రి చిత్తము

– దేవుని స్వరూపియైన ఆయన మహిమను చూడాలి (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)
– ఆయన దేవుని అద్వితీయ కుమారుడని విశ్వాసముంచాలి (యోహాను 3:36, 12:44; 1యోహాను 5:10)
– తండ్రిని ఘనపరచునట్లుగా/అదేవిధంగా [καθὼς/కాతోస్=just as/same as/even as; అదేవిధంగా/ఆరకంగానే] ఆయనను ఘనపరచవలెను (మత్తయి.2:9-11, 28:9,17; యోహాను 5:23, 20:28; హెబ్రీ.1:6; ప్రకటన 5:8-14)
– ఆయనను దేవుని అద్వితీయ కుమారునిగా గుర్తించి దేవుని అద్వితీయ కుమారునికి ఏస్థానమిచ్చి ఏవిధంగా గౌరవించాలోనన్నది అపోస్తలుల వ్రాతలలో మరియు వారి మాదిరిలో చూపించబడిందో ఆవిధమైన స్థానాన్ని గౌరవాన్ని ఆయనకు యివ్వనివ్యక్తి తండ్రినే అగౌరవపరచి త్రుణీకరించినవాడుగా లెక్కించబడుతాడు (యోహాను 5:23). అలాంటివాడే క్రీస్తువిరోధి (1యోహాను 2:22-23)

యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) కు నిజవిశ్వాసులు ఇవ్వాల్సిన స్థానము గురించి అపోస్తలుల బోధ మరియు మాదిరి

– అపోస్తలుల బోధ ప్రకారం ఆయన దేవున్ని తన తండ్రిగా ప్రకటించుకొని దేవునితో సమానునిగా చేసుకొన్నాడు (యోహాను 5:18, 10:30-38)
– అపోస్తలులు ఆయనను దేవునిగా గుర్తించారు (యోహాను 1:1, 20:28; 2కొరింథీ.4:4; ఫిలిప్పీ.2:6; రోమా.9:5; కొలొస్సీ.1:15; తీతుకు 1:13; హెబ్రీ.1:8). తండ్రి మరియు కుమారుడు ఇరువురిని ఒకే దేవుడు అని దైవాత్మచేత నడిపించబడిన అపోస్తలులు గుర్తించడానికి నిజదేవుని ప్రవృత్తే కారణం!
– అపోస్తలుల బోధ ప్రకారము అంటే క్రొత్తనిబంధన బోధప్రకారము ప్రొస్కినియో (προσκυνέω=bowing down/worship/show reverance;మ్రొక్కుట/ఆరాధన/పూజ్యభావముతోకూడిన నమస్కారము) అన్నది కేవలము దేవునికే చెందాలి (మత్తయి 4:10). మనుషులకు ఆపాదించకూడదు (అపో.కా.10:26). దేవదూతలకుకూడా ఆపాదించకూడదు (ప్రకటన 19:10, 22:9). అయినా, ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రొస్కినియో (προσκυνέω) ను దేవునిచే దర్శించబడి నడిపించబడిన తూర్పుదేశ జ్ఙానులు ఆపాదించారు (మత్తయి 2:9-11), సాధారణ యూదులు ఆపాదించారు (యోహాను 9:38), అపోస్తలులుకూడా ఆపాదించారు (మత్తయి 28:9,17), మరియు  దేవదూతలు సహితం ఆపాదించారు (హెబ్రీ.1:6). మనుషులు తనకు ప్రొస్కినియో (προσκυνέω) ఆపాదిస్తున్నప్పుడు పేతురు తిరస్కరించాడు, దేవదూత నివారించాడు, కాని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము దాన్ని అంగీకరించి స్వీకరించాడు. కారణం, ఆయన ప్రొస్కినియోకు (προσκυνέω) అర్హుడు! అందుకే యుగాంతమందుకూడా సృష్టియావత్తూ తండ్రికి మరియు కుమారునికి సమిష్టిగా ప్రొస్కినియో (προσκυνέω) అర్పించబోతున్నారన్నది లేఖనము ప్రవచనాత్మకంగా మనకు ప్రకటిస్తున్నది (ప్రకటన 5:8-16).

“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2కొరింథీ.4:4-5)

4 comments

  • వెంపాటి అబ్రహమ్ మణిరత్నం తిరువూరు

    విశ్రాంతి దినం కంటే గొప్పవాడే కాని ఆయనకూడా విశ్రాంతి దినం గైకొన్నారు కదా మరి మీరు తిరగడం బోధ చేస్తారే బ్రదర్ షాలోమ్

    • Admin:Judaism.in

      షలోం, బ్రదర్!

      “మీరు తిరగడం బోధ చేస్తారే” అంటూ వ్రాసారు. ఈవిశయాన్ని ఇంకా కొంత వివరణతో స్పష్టత ఇవ్వగలరు.

      యషువ మిమ్ములను దీవించును గాక!

    • Admin

      షలోం బ్రదర్!

      మీరు అడిగిన ప్రశ్నకు లేక చేసిన వ్యాఖ్యానానికి మా స్పందన ఈ క్రింద యివ్వబడింది. దయచేసి దాన్ని పరిశీలనగా చదివి లేఖన వెలుగులో మీ ప్రతిస్పందనను మాకు తెలియచేయగలరు:

      యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] విశ్రాంతిదినాన్ని గైకొన్నారు పాటించారు. మరి ఆయనయందు విశ్వాసముద్వారా నిజదేవుని సంబంధులముగా చేయబడిన వారు ఈనాడు ఆయనలా విశ్రాంతిదినాన్ని గైకొని పాటించాలా వద్దా…?!

      మొదట, ఆయన విశ్రాంతిదినాన్ని పాటించాడా? ఒకవేళ పాటిస్తే ఎలా పాటించాడు? ఎందుకు పాటించాడు? అన్న విశయాలనుగురించి లేఖనాలు తెలియచేస్తున్న సత్యాలను పరిశీలిద్దాం.

      బైబిలు వెలుగులో యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] విశ్రాంతిదినాన్ని తన జీవితములో పాటించాడు. ఆయన విశ్రాంతిదినాన్ని పాటించడములో ఏకొదవా లేకుండా పాటించాడు. అంటే, మోషేధర్మశాస్త్రములో వివరించబడినవిధంగా పాటించడము జరిగింది. అలా పాటించని పక్షములో ఆయనలో తప్పును నిరూపించే ప్రయత్నాలలో దివారాత్రములు ఆయనను పరిశీలనగా చూస్తున్న ఆనాటి యూదా మతపెద్దలు శాస్త్రులు పరిసయ్యులలాంటివారు దాన్ని ఎత్తిచూపేవారు. నిజానికి ఆప్రయత్నములో వారు ఆయన “విశ్రాంతిదినాన్ని మీరాడు” అంటూ ఆయన చేసిన దొడ్డ పనులకు దుష్టవివరణలిస్తూ ఆయనపై అబద్దసాక్షాలు చెప్పుకొచ్చారు (యోహాను.5:18; 9:14-24).

      యషువ [యేసు] ఎన్నడుకూడా విశ్రాంతిదినాన్ని మీరలేదు. విశ్రాంతిదినాన్న ఆయన చేసిన దొడ్డకార్యాలను “విశ్రాంతిదినాన్ని మీరటమే” అంటూ యూదుమతస్తులు దుష్టవ్యాఖ్యానం చేస్తున్న సందర్భములో ఆయన “…కాబట్టి విశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమే” అంటూ వారి తప్పుడు అవగాహనను ఎండగట్టాడు (మత్తయి.12:12). నిజానికి మోషేధర్మశాస్త్రమంతటిలో ఎక్కడా “విశ్రాంతిదినాన పొరుగువారికి మేలు చేయవద్దు” అనిగాని లేక “విశ్రాంతిదినాన తప్ప మిగతా దినాలలో పొరుగువారికి మేలు చేయండి” అనిగాని వ్రాయబడలేదు.

      యషువ [యేసు] తో మూడు సంవత్సరాలు జీవించిన ఆయన శిష్యులు కూడా ఆయనను గురించి సాక్షమిస్తూ “ఆయనలో ఏపాపము లేదు” అని ప్రకటించారు (2కొరింథీ.5:21; హెబ్రీ.4:15; 1పేతురు.2:22).

      ఇక, యషువ [యేసు] ఎందుచేత విశ్రాంతిదినాన్ని పాటించాడు అన్నది అలోచిస్తే దానికి రెండుకారణాలు వున్నాయి:

      1) యషువ యూదునిగా జన్మించి యూదులమధ్య జీవించాడు. ప్రతియూదుడు మోషేధర్మశాస్త్రము ప్రకారము ఈలోకములో జీవించబద్దుడై వున్నాడు. ఒక యూదునిగా మోషేధర్మశాస్త్రము ప్రకారము జీవిస్తూ అందులో భాగంగా యివ్వబడిన విశ్రాంతిదినాన్ని ఆయన ఆచరించాడు. మోషేద్వారా యివ్వబడిన ధర్మశాస్త్రాన్ని తు.చ.తప్పకుండా పరిపూర్ణముగా పాటించిన చరిత్రలోని ఒకేఒక యూదుడు యేసు క్రీస్తు [యషువ మషియాఖ్].
      2) యషువను తండ్రి ఈలోకములోనికి పంపడానికి గల అతి ప్రాముఖ్యమైన ఒకానొక కారణం ధర్మశాస్త్రము క్రింద జీవిస్తూ శాపగ్రస్తులుగా వున్న వారికి విడుదల కలిగించడము. ఆ కారణాన్ని బట్టి ఆయన మోషేధర్మశాస్త్రము క్రింద జీవించి దాన్ని పరిపూర్ణముగా పాటించాడు (గలతీ.4:4-5). అందులో భాగంగానే ఆయన ధర్మశాస్త్రములోని విశ్రాంతిదినాచారాన్ని కూడా పాటించాడు.

      మరి యిప్పుడు ఆయనయందు విశ్వాసముంచినవారు ఆయనను వెంబడిస్తున్నవారు ఆయనలా విశ్రాంతిదినాన్ని ఆచరించాల్సిందేకదా…?

      గమనించాలి, ఆయనయందు విశ్వాసముంచి ఆయనను వెంబడిస్తున్నాము అంటూ చెప్పుకునేవారుకూడా ఆయన విశ్రాంతిదినాన్ని ఆచరించాడు గనుక వారుకూడా దాన్ని ఆచరించాలని వాదించేవారు క్రింద పేర్కొనబడిన వాస్తవాల వెలుగులో అడగబడిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి …

      – ఆయన ఇశ్రాయేలీయుల మధ్య పుట్టి పెరిగాడు. ఆయనను వెంబడించేవారు కూడా అలా పుట్టి పెరగలా…?
      – ఆయన మోషేధర్మశాస్త్రము క్రింద జీవించి దాన్ని పరిపూర్ణముగా అనుసరించాడు. ఆయనను వెంబడించేవారు కూడా అలా మోషేధర్మశాస్రము క్రింద జీవించి దాన్ని అనుసరించాలా…?
      – ఆయన సున్నతి పొందాడు. ఆయనను వెంబడించేవారు కూడా ఆయనలా సున్నతిపొందాలా…?
      – ఆయన అవివాహితునిగా జీవించాడు. ఆయనను వెంబడించేవారు కూడా అలా బ్రమ్మచారులుగా వుండిపోవాలా…?
      – ఆయన ఇశ్రాయేలీయుల మధ్యే దేవునివాక్యం ప్రకటించాడు. ఆయనను వెంబడించేవారు కూడా ఇశ్రాయేలీయులమధ్యే దేవునివాక్యం ప్రకటించాలా…?
      – ఆయన సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి పండుగలను ఆచరించాడు. ఆయనను వెంబడించేవారు కూడా అలా మూడుసార్లు యెరూషలేముకు వెళ్ళి పండుగలను ఆచరించాలా…?

      యషువ మషియాఖ్ [యేసు క్రీస్తు] గాని లేక ఆయన శిష్యులుగాని క్రొత్తనిబంధన ఆవిష్కరించబడినతరువాత చేసిన బోధలలో ఎక్కడాకూడా విశ్రాంతిదినాన్ని పాటించాలని బోధించలేదు వారుకూడా పాటించి చూపలేదు. వారు కేవళం యూదులకు సువార్తను ప్రకటించేందుకై విశ్రాంతిదినాన్న యూదులు సమకూడే స్థలాలకు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించే ప్రయత్నాలను చేసారు. ఆరకమైన ప్రయత్నాలను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడమేగాక వాటికి తమ తప్పుడు వ్యాఖ్యానాలను జోడిస్తూ అందులో భాగంగా ఆ సందర్భాలలో అపోస్తలులు విశ్రాంతిదినాన్ని పాటించారు అంటూ బోధిస్తున్నారు. అది శోచనీయము!

      మీరు ఇంకా విశ్రాంతిదినాన్ని యిప్పుడుకూడా పాటించాలంటూ భావిస్తే దయచేసి ఆపని మీకు వీలైనప్పుడు మీకు వీలైనవిధంగా కాక మోషేధర్మశాస్త్రములో పరమతండ్రిచేత నిర్ధేశించబడిన విధానంలోనే పాటించండి!

      విశ్రాంతిదినాచారాన్ని గురించిన వ్యాసాన్నికూడా పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోండి…

      పరమతండ్రి మిమ్ములను దీవించి సర్వసత్యములోనికి నడిపించును గాక! షలోం!

      • Admin

        ఇప్పుడు క్రీస్తు యేసునందు [యషువ మషియాఖ్] ఉన్నవారు క్రొత్తనిబంధనలో పాలుపొంది దేవునిప్రజలుగా మారారు. అలాంటివారు పాటించాల్సిన ఆజ్ఙలు నియమాలు అన్నీ ‘క్రీస్తు ఉపదేశములో’ [మెస్సయ్యతోరా] భాగంగా యివ్వబడ్డాయి (యెషయా.42:1-4; గలతీ.6:2). కనుక దేవునిప్రజలు ఈ క్రొత్తనిబంధన కాలములో వాటికి లోబడి జీవించాలి. పరిశుద్ధాత్మద్వారా అపోస్తలులను ప్రేరేపించి వారిద్వారా మెస్సయ్య తన బోధ/ఉపదేశమును విశ్వాసులకు అందించాడు.

        “నేను [మెస్సయ్య] మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి.28:20)

        “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను [మెస్సయ్య] మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహాను.14:26)

        “నేను [మెస్సయ్య] మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలుయజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.” (యోహాను.16:12-14)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *