అనువాదం vs అపోహ
బైబిలులో నామము/పేరు అన్నది కేవలం…
- ఒక సిరాగుర్తుల సంకలనం కాదు
- హీబ్రూ భాషలోని అక్షరాల కూర్పు కాదు
- హీబ్రూ భాషాపదాల ఉచ్చారణ అంతకన్నా కాదు
నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం.
నామము అన్నది అనామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతేకాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. అయితే, ఈ సందర్భంగా మనం గమనములో వుంచుకోవలసిన మూడు ప్రాథమిక అంశాలున్నాయి. అవి: వ్యక్తి, ఆ వ్యక్తిని వుద్దేశించి వుపయోగించబడుతున్న నామము, ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తి. వీటిలోని నామము సూచిస్తున్న “వ్యక్తి” విశయములో ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తికి స్పష్టత వున్నంతవరకు వుపయోగించబడిన “నామము” భాషాశాస్త్రానికనుగుణంగా మర్పుచెందితే తప్పుకాదు అందులో ఏ సమస్యాలేదు.
ఉదాహరణకు, శ్రీనివాస్, హరి, శంకర్, విష్ను, కృష్ణ, సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైన పేర్లున్న హైందవ మిత్రులు మనందరికి వున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆ పేర్లు అన్నీకూడా అన్యదేవుల్ల/దేవతల పేర్లు. మీ స్నేహితులను వుద్దేశించి వారి పేర్లతో వారిని సంబోధిస్తున్నప్పుడు మీ దృష్టిపథం లో వుండేదెవరు…? అన్యదేవుల్లా/దేవతలా లేక ఆ పేరును పెట్టుకున్న మీ స్నేహితుడు/స్నేహితురాలా…? మీ స్నేహితుడు లేక స్నేహితురాలు మాత్రమే మీ దృష్టిపథంలో వుండేది. అందులో ఏసమస్యా లేదు! “అపొల్లొ” అన్నది గ్రీకు మరియు రోమనుల దేవుని పేరు. తల్లిదండ్రులచేత ఆ నామము పెట్టబడిన ఒక వ్యక్తి తాను పెద్దవాడిగా ఎదిగిన తరువాత యేసే [యషువనే] లేఖనాలలో ప్రవచించబడిన క్రీస్తు [మషియాఖ్] అని గ్రహించి విశ్వాసిగా మారాడు. విశ్వాసిగా మారిన తరువాతకూడా అతను అదే పేరుతో పిలువబడ్డాడు. ఆ పేరును లేఖనాలుకూడా వుపయోగించాయి (అపో.కా.18:24). లేఖనాలలో వున్న “అపొల్లొ” అన్న పదం గ్రీకు/రోమను దేవున్ని సూచించడములేదు. ఆ పేరును ధరించి వున్న ఒక వ్యక్తిని ఒక విశ్వాసిని సూచిస్తున్నాయి. నామము యొక్క భాషారూపము కాదు ప్రధానము, ఆ నామము సూచిస్తున్న వ్యక్తి ప్రధానము.
లేఖనము శాశిస్తున్నది, “…వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.” (ని.కాం.23:13)
అయితే, మీరు శ్రీనివాస్, హరి, శంకర్, విష్ను, కృష్ణ, సరస్వతి, లక్ష్మి, పార్వతి వంటి మొదలైన పేర్లతో మీ పరిచయస్తులను సంబోధిస్తున్న ప్రతిసారి మీరు అన్య దేవుల్ల/దేవతల పేర్లను ఉచ్చరిస్తున్నట్లా…? అలా అయిన పక్షములో మీరు ఆ పేర్లను ఉచ్చరించిన ప్రతిసారి పై లేఖనానికి వ్యతిరేకంగా పాపము చేసినట్లే కదా!
నిజానికి ఈ పేర్లను ఉపయోగించిన సందర్భములో మీరు దృష్టిస్తున్నది మీ తోటి వ్యక్తులను, అన్య దేవుల్లను/దేవతలను కాదు. కనుక, మీ పరిచయస్తులను ఉద్దేశించి వాటిని వుపయోగిస్తున్న సందర్భాలలో మీకు ఏపాపము ఆపాదించబడదు. కారణం, మీరు వుపయోగిస్తున్న పేర్లు మీరు వుపయోగిస్తున్న సందర్భాలలో కేవలం ఆ వ్యక్తులను సూచించే పేర్లు మాత్రమే.
క్రీస్తుకు పూర్వపు అనువాదాలు
హీబ్రూ లేఖనాలను అంటే తనాక్ (పాతనిబంధనను) ను క్రీస్తుకు పూర్వం మూడవ శతాబ్ధములోనే 72 మంది యూదు పండితులు భక్తులు గ్రీకు భాషలోనికి అనువదించారు. ఆ అనువదాన్నే సెప్టూజింట్ (Septuagint) అని పేర్కొంటారు.
2200 సంవత్సరాల క్రితమున్న యూదు పండితులు సెప్టూజింటులో హీబ్రూ పదాలైన ఎలోహిం (אֱלהִים) ను తియోస్ (θεός) గా, యోద్ హే వవ్ హె (הָיָה) ను కురియొస్ (Κύριος) గా, యషువ/యెహోషువ (יְהוֹשׁוּעַ) ను (ఈసు/యేసు/Ἰησοῦ) గా, మెస్సయా/మషియాఖ్ (מָשִׁ֣יחַ) ను క్రీస్తు (Χριστοῦ) గా అనువదించారు. ఈ రకమైన అనువాద మార్పులవెనుకనున్న ఆంతర్యము ఉచ్చారణ మరియు వ్యాకరణ నియమాలతో ముడిపడివున్న భాషాశాస్త్రము (Linguistics), పదఅధ్యయనశాస్త్రము (Semantics), శబ్దవ్యుత్పత్తిశాస్త్రము (Etymology), సంజ్ఞానామకపరిశీలనాశాస్త్రము (Onomastics) మొదలనవాటిలో పరిజ్ఙానము ప్రవేశము లేనివారికి ససేమిరా అర్థముకాని లోతైన అంశాలు.
విజ్ఙులు ఈ వాస్తవాన్ని గమనములో వుంచుకొని భాషాపరమైన అనువాదాల విశయములో తమ తీర్పులను అదుపులోవుంచుకుంటారు. విజ్ఙానశూన్యులు మాత్రమే ఇవేవి గమనములోకి తీసుకోకుండా విపరీత తీర్పులకు ప్రకటనలకు దిగజారుతుంటారు. ఈనాడు బైబిలులోని నామాల/పేర్ల అనువాదాన్ని తప్పుబట్టుతున్న వాళ్ళు సెప్టూజింటును అందించిన యూదు పండితులను భక్తులనుకూడా తప్పుబట్టి వారికి తీర్పుతీర్చి తమపైకి నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు!
పాతనిబంధన గ్రంథముగా పేరుపొందిన తనాక్ గ్రంథములో మోషే దేవుని ప్రవక్తలలో అతిగొప్ప ప్రవక్త. “మోషే” [משֶׁה] అన్న అతని పేరు అన్యదేవతలను పూజించే ఒక అన్యురాలైన ఐగుప్తీయురాలిద్వారా యివ్వబడింది అన్న సత్యాన్ని ఈసందర్భంగా జ్ఙాపకం చేసుకోవాలి (ని.కాం.2:10). మోషే అనే పేరు మొదట “మెస్” (కుమారుడు) అన్న ఐగుప్తు భాషా పదం లోనుండి వచ్చింది. అటుతరువాత బాలుడైన మోషే నీళ్ళలోనుండి రక్షించబడిన సంఘటన తరువాత ఆ పేరులోనుండి బయటికి లాగబడటము అన్న అర్థాముతోకూడిన మషాహ్ (משה) అన్న హీబ్రూ పదప్రయోగం మొదలయ్యింది. ఒక విగ్రహారాధికురాలు పెట్టిన మోషే అనే పేరును ప్రభువైన దేవుడు లేఖనాలలో తన ప్రవక్తకు వుపయోగించడం గమనార్హమైన విశయం.
లేఖనాల సాక్ష్యం: భాషల అనువాదము దేవుడు అంగీకరించిన ప్రక్రియ
వ్యక్తులను లేక సందేశాలను వ్యక్తీకరించటములో భాషలు పరికరాలుగా ఉపయోగపడుతాయి. ఈ ప్రక్రియను సృష్టికర్త ఎప్పుడు ఎక్కడా నిశేధించలేదు. ఈ కారణాన్నిబట్టే సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో [పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథాలలో] అనువాదాల ప్రక్రియను గూర్చిన సాక్షాధారాలు వున్నాయి.
పాతనిబంధన గ్రంథం
యోసేపు ఐగుప్తు అధికారిగా వున్నసమయములో తనను అప్పటికి గుర్తించని తన స్వంత అన్నలు ధాన్యాన్ని కొనుగోలు చేసే సందర్భములో వారితో ఐగుప్తు భాషలో మాట్లాడినా ఆ మాటల యొక్క హీబ్రూ అనువాదములో “దేవుడు” [הָאֱלֹהִ֖ים/హ ఎలోహిం] అన్న పదాన్ని వుపయోగించటాన్ని లేఖనాలే ధృవపరుస్తున్నాయి (ఆది.కాం.42:18-23).
దానియేలు గ్రంథములోని లేఖనాలు అరామిక్ భాషానువాదములో వ్రాయబడ్డాయి (దానియేలు.2:4-7:28).
క్రొత్తనిబంధన గ్రంథం
“మరియు యొప్పేలో తబితా [అరామిక్ భాషా పదము] అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా [గ్రీకు భాషా పదము] అని పేరు. ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.” (అపో.కా.9:36)
“పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు; హెబ్రీభాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసుదేశపు భాషలో వానిపేరు అపొల్లుయోను.” (ప్రకటన.9:11)
అన్యభాషలలో నుండి మరియు అన్యదేవుళ్ళ లేక దేవతల పేర్లలో నుండి వచ్చిన పేర్లుగా భావించబడే పాతనిబంధన గ్రంథములోని [తనాఖ్] కొన్నినామాలు:
1. ఎస్తేరు [אֶסְתֵּר]: బబులోను ప్రజలు పూజించిన దేవుడు “ఇష్తార్” నుండి వచ్చిన అరామిక్ భాషా నామము (ఎస్తేరు.2:7).
2. జెరుబ్బాబేలు [זְרֻבָּבֶל]: “బబులోను పుత్రుడు” అనే అర్థముతో కూడిన అరామిక్ భాషా నామము (ఎజ్రా.2:2).
3. ఎలాహ్ [אַלָהּ]: “దేవుడు” అన్న భావాన్ని వ్యక్తపరచే అరామిక్ భాషా పదం “దేవుడు” గానే అనువదించబడింది (దానియేలు.4:2).
పై నామాలను దేవుడు/లేఖనాలు ఏ అభ్యంతరము లేకుండా వుపయోగించడము జరిగింది. కారణం, సృష్టికర్తకు భాషలకన్నా భావవ్యక్తీకరణ మరియు వ్యక్తులు ప్రధానం!
ఒకే వ్యక్తికున్న నామము యొక్క వివిధ భాషలలోని అనువాద రూపాలు
యషువ మషియాఖ్ (מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ)
ఈసూ క్రిస్టూ (Ἰησοῦ Χριστοῦ)
జీసస్ క్రైస్ట్ (Jesus Christ)
ఈసా అల్-మసీహ్ (عيسى المسي)
యేసు క్రీస్తు
[యేసు (యషువ) అన్న నామానికి అర్థం ‘యెహోవాయే రక్షకుడు’ లేక ‘యెహోవా రక్షించును;’ క్రీస్తు (మషియాఖ్) అన్న బిరుదుకు అర్థం ‘అభిషిక్తుడు’ లేక ‘మెస్సయ్యా’]
పైవాటిలోని ఏదో ఒక నామాన్ని/పేరును వుపయోగిస్తున్న నా దృష్టిపథంలో అలాగే మీ దృష్టిపథంలో వున్నది ఒకే వ్యక్తి! అతనే పరమతండ్రిలోనుండి బయలుదేరి వచ్చిన ఆయన ప్రియకుమారుడు (కీర్తన. 2:7; యోహాను.6:38, 62; అపో.కా.13:33; హెబ్రీ.1:5, 5:5), మానవాళికున్న ఏకైక ప్రభువు మరియు రక్షకుడు.
మానవాళికి రక్షణ యేసు (మానవాళి రక్షణకై తనను తాను బలియాగము చేసుకున్న దేవుని ప్రియకుమారుడు) నామములోనే…అంటే ఆపేరును తెలిపే గుర్తులలో అనికాదు లేక ఆపేరు వ్రాయబడే అక్షరాలలో అనికాదు లేక అపేరు యొక్క ఉచ్చరణలో అనికాదు. రక్షణ అన్నది ఆపేరు ఎవరిని సూచిస్తున్నదో లేక ఎవరికి ప్రాతినిథ్యంవహిస్తున్నదో సాక్షాత్తు ఆ వ్యక్తిలోనే సిద్ధంచేయబడింది, ఆ వ్యక్తినందు ఆ వ్యక్తిద్వారానే అనుగ్రహించబడుతుంది!
“మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే (యేసు/యషువ) మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.” (అపొ.కా.4:12)
“ఈయన (యేసు/యషువ) తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.” (హెబ్రీ.7:25)
“తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు (యషువ) అను పేరు పెట్టుదువనెను.” (మత్తయి 1:21)
”ఆయనయందు (యేసు/యషువ) విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.” (అపొ.కాం.10:43)
“మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయము లన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే (యేసు/యషువ) నీతి మంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియు గాక.” (అపొ.కాం.13:39)
“అందుకు వారు ప్రభువైన యేసు (యషువ) నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.” (అపొ.కాం.16:31-32)
గమనిక:
కొందరు అభిప్రాయపడుతున్నట్లుగా దేవుడు హీబ్రూ భాషను దైవభాషగ లేక ఆత్మీయభాషగా ఉద్దేశిస్తే పాత నిబంధన గ్రంథములోని కొన్ని లేఖనాలను అరామిక్ భాషలో వ్రాయబడటానికి (ఎజ్రా 4:8–6:18; దానియేలు 2:4–7:28) దేవుడు అనుమతించేవాడు కాదు.
సృష్టికర్త తాను యిచ్చిన మోషేధర్మశాస్త్రములోని 613 ఆజ్ఙలలో ఒక్క ఆజ్ఙకూడా హీబ్రూభాషకు సంబంధించినది యివ్వలేదు. దీని కారణము భాషలన్నీ దేవునిముందు సమానమేనన్నది విజ్ఙులు గ్రహించగలరు!
వివిధ భాషల ప్రారంభమన్నది బాబేలులోని నరుల పాపమునుబట్టే కనుక దేవున్ని/సృష్టికర్తను సంబోధించటానికి లేక ఆరాధించటానికి అన్యభాషలను వుపయోగించరాదు అంటూ ఎవరైనా అభ్యంతరపడితే అలాంటివారు దుస్తులను ధరించి దేవున్ని/సృష్టికర్తను ఆరాధించటానికి కూడా అభ్యంతరపడక తప్పదు. కారణం, ఏదేను తోటలోని ఆదిదంపతుల పాపమును బట్టే దుస్తులను ధరించటమన్నది ప్రారంభమైంది అన్నది లేఖన సత్యం.
భాషలను అనువాదాలను వ్యతిరేకించేవారు ఆలోచించాల్సిన విశయాలు స్పందించాల్సిన ప్రశ్నలు అనేకం వున్నాయి…
Good information