నిజమైన ఆరాధన
సృష్టి ఆదినుండి మానవుడు తన సృష్టికర్తపట్ల వ్యక్తపరచాల్సిన వైఖరులలో అతి ప్రాముఖ్యమైనది దేవునికి ఆపాదించాల్సిన ఆరాధన. పాతనిబంధన గ్రంథములో దేవున్ని ఆరాధించే విధానాలు నాలుగురకాలు. అవి ఈ క్రింద యివ్వబడినవి:
- అర్పణలు: దేవునికి అర్పణలు అర్పించుట. ఉదాహరణకు, బలులు, నైవేధ్యాలు, ప్రథమ ఫలాలు, మ్రొక్కుబడులు మొదలైనవి.
- జిహ్వాఫలము: కృతజ్ఙతాస్తుతులు పలకటము, స్తోత్రగీతాలు పాడటము, ప్రార్థన చేయుట మొదలైనవి.
- భంగిమలు: దేవునికి మ్రొక్కటము. సాగిలపడటము, చేతులెత్తి మ్రొక్కటము, మ్రోకాళ్ళూనటము మొదలైనవి.
- సేవ: దేవునికి సేవ చేయటము [హీబ్రూ మూలపదం: פְּלַח/పెలాఖ్ & గ్రీకు మూలపదం: λατρεύω/లాట్రేయో]. దేవాలయములోని పనులు, దేవునికి సంబంధించిన కార్యాలను నిర్వర్తించటము మొదలైనవి.
అయితే, లేఖన బోధ ప్రకారము దేవుని మాట వినుట అన్నది పై నాలుగువిధాల ఆరాధనకన్నా గొప్పది:
“అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.” (1సమూయేలు.15:22)
మోషేనిబంధనాకాలములో కేవలము ఒక నగరములో [యెరూషలేము] వున్న ఒక పర్వతముపైన [మోరీయా ప్రాంతపు పర్వతము] కొన్ని ప్రత్యేకమైన దినాలలో ప్రత్యేకమైన విధానములో ప్రత్యేకమైన వ్యక్తులద్వారా ఆపాదించబడిన అర్పణలనే నిజదేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. ఆ కాలములో ఆదిశలో చేయబడిన ఆరాధనా భంగిమలను వ్యవ్యక్తపరచబడిన జిహ్వాఫలాలను దేవుడు అంగీకరించాడు.
మోషేనిబంధనాకాలములో (పాతనిబంధనాకాలములో) దేవుడు ఇశ్రాయేలీయులు భంగం చేసిన మోషేనిబంధన స్థానములో వేరొక సరికొత్త నిబంధనను చేయబోతున్నట్లు వాగ్ధానము చేసాడు. తాను చేయబోతున్న ఆ నిబంధన తన సేవకుడైన మెస్సయ్యా ద్వారా చేయబోతున్నట్లుకూడా ఆ యా ప్రవక్తలద్వారా సూచించాడు. అదే సందర్భములో దైవారాధనలో భాగమైన దైవసేవను [פְּלַח/పెలాఖ్] రాబోతున్న మెస్సయ్యకు సమస్తజనులు ఆపాదించాలి అన్న దేవుని చిత్తాన్ని భవిశ్యవాణిద్వారా విపులీకరించాడు:
“సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు [హీబ్రూ మూలపదము: פְּלַח/పెలాఖ్] ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు.7:14)
నిత్యరాజ్యములోని పాలక సింహాసనము ఒక్కటే. దానిపై ఆశీనుడైనవాడు ఒక్కడే–తండ్రికుమారుల ఏకత్వం! ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు [1తిమోతి.6:15; ప్రకటన.17:14, 19:16]. ఆయననే సమస్త ప్రజలు సృష్టి ఆరాధిస్తూ సేవించాలి:
“ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు [గ్రీకు మూలపదం: λατρεύω/లాట్రేయో] ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. ” (ప్రకటన.22:2-3)
క్రొత్తనిబంధనలో దైవారాధన
క్రొత్తనిబంధనాకాలములో దైవారాధనలో భాగంగా యివ్వబడే అర్పణల విశయములో ప్రాముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. అంతేగాక పాతనిబంధనాకాలములో దైవారాధనకుండిన పరిమితులు తొలగించబడ్డాయి.
మెస్సయ్య యొక్క ప్రశస్త రక్తముతో చేయబడిన క్రొత్తనిబంధనలో ప్రవేశించినవారంతా మెస్సయ్య ఉపదేశానుసారముగా నిజదేవున్ని ఆరాధించాలి/పూజించాలి.
దేవుని నిర్ణయకాలములో మెస్సయ్య వచ్చాడు. సాతానుని శోధనలకు వాక్యానుసారముగా స్పందిస్తూ మెస్సయ్య పాతనిబంధనగ్రంథములోని బోధను ఉటంకిస్తూ క్రింది విధంగా బదులిచ్చాడు:
యేసు వానితో సాతానా, పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. (మత్తయి.4:10)
దైవారాధనవిశయములో మెస్సయ్య చేసిన ఉపదేశము:
“అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింప [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] వలెననెను.” (యోహాను.4:23-24)
మెస్సయ్య ఆగమనము తదుపరి ఆయన బోధ/ఉపదేశము ప్రకారము మ్రొక్కటము లేక ఆరాధన [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] అన్న పదము ఆత్మీయ విశిష్టతను అందుకుంది. అది నరమాత్రులకు ఆపాదించకూడదు (అపో.కా.10:25-26). దేవదూతలకు కూడా దాన్ని ఆపాదించరాదు (ప్రకటన.19:10, 22:8-9). అది దేవునికి చెందినది (మత్తయి.4:10; యోహాను.4:23-24; అపో.కా.8:27, 24:11; హెబ్రీ.11:21; ప్రకటన.19:10, 22:9). అయినా దేవుని ప్రియకుమారుడైన మెస్సయ్యకు దాన్ని ఆపాదించడముద్వారా (మత్తయి.2:11; 8:2; 9:18-19; 28:9,17; యోహాను.9:38-39; హెబ్రీ.1:6; ప్రకటన.5:14) దేవునికి ఆపాదించగలము! ఇది అపోస్తలుల బోధ మరియు మాదిరి.
మెస్సయ్య ఉపదేశానికి అపోస్తలుల వివరణ
కుమారునిద్వారా తండ్రికి కృతజ్ఙతలు, మహిమ, మరియు ఆరాధన ఆపాదించాలి:
“కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీ.13:15)
“యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.” (1పేతురు.2:5)
“ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తుద్వారామహిమపరచబడును...” (1పేతురు.4:11)
కుమారునిద్వారా తండ్రికి కృతజ్ఙతలు, మహిమ, మరియు ఆరాధన ఆపాదించటము అంటే క్రింది మూడు విధాలుగా అర్థము చేసుకునే అవకాశముంది:
(1) కుమారునికి వాటిని ఆపాదిస్తే తండ్రికి ఆపాదించినట్లే.
(2) కుమారుని నామములో తండ్రికి అపాదిస్తున్నాను అని ప్రకటించడము.
(3) కుమారునికి వాటిని అందిస్తూ తండ్రికి వాటిని అందించమని కుమారునికి తెలియచేయడము.
మొదటి రెండురకాల అర్థాలకు లేఖనాధారాలునాయి. కాని, మూడవ అర్థానికి లేఖనాధారాలు లేవు.
“యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.” (హెబ్రీ.13:21)
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్.” (2పేతురు.3:18)
“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.” (ప్రకటన.1:6)
“ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు…మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] చేసిరి.” (ప్రకటన.5:8-14)
తండ్రికి ఆపాదించాల్సినవి:
- మ్రొక్కటము/పూజించటము (మత్తయి.4:10; యోహాను.4:23-24; ప్రకటన.19:10; 22:8-9)
- స్తుతి/స్తోత్రము (రోమా.15:9-11)
- మహిమ (గలతీ.1:5; రోమా.11:36, 16:27; ఫిలిప్పీ.4:20; 1తిమోతీ.1:17; ప్రకటన.4:9; 5:13)
- ఘనత (1తిమోతీ.1:17; ప్రకటన.4:9; 5:13)
- ప్రభావము (1పేతురు.5:11; ప్రకటన.4:13)
కుమారునికి ఆపాదించాల్సినవి:
- మ్రొక్కటము/పూజించటము (మత్తయి.28:9,17; ప్రకటన.5:8,14)
- స్తుతి/స్తోత్రము (ప్రకటన.5:12-13)
- మహిమ (2తిమోతీ.4:18; హెబ్రీ.13:21; ప్రకటన.5:12-13)
- ఘనత (యోహాను.5:23; అపో.కా.19:17; ప్రకటన.5:12-13)
- ప్రభావము (ప్రకటన.5:13)
“యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్.” (రోమా.16:26-27)
“తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” (యూదా.1:24-25)
అపోస్తలుల మాదిరి
“పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] గాని, కొందరు సందేహించిరి.” (మత్తయి.28:16-17)
“వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.” (లూకా.24:51-53)
మెస్సయ్య వివరణ
“తండ్రిని ఘనపరచునట్లుగా [καθὼς/కాతొస్ = same as; just as; even as] అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” (యోహాను.5:23)
“నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 12:45; 14:9)
“నాయందు విశ్వాసముంచు వాడు…నన్ను పంపినవానియందు విశ్వాసముంచుచున్నాడు. (యోహాను 12:44)
“కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.” (1యోహాను 2:23)
“నన్ను ద్వేశించువాడు నా తండ్రినికూడా ద్వేశించుచున్నాడు.” (యోహాను. 7:7; 15:23)
పై కారణాలనుబట్టి మెస్సయ్య దేవునికి చెందిన ఆరాధనను స్వీకరించాడు (మత్తయి.8:2, 28:9,17; లూకా.24:52; యోహాను.9:35-38). అది తండ్రి చిత్తము. అది కుమారునిద్వారా తండ్రిని ఆరాధించే విధానము. ఇందులో తండ్రి చిత్తానికి/ఆజ్ఙకు లోబడనివాడు దేవుని సంబంధి కాడు. అలాంటివాడు క్రీస్తు విరోధి!