‘యూదులు’ అంటే ఎవరు?

‘యూదుడు’ లేక ‘యూదులు’ అన్న పదం ‘యూదా’ అన్న హీబ్రూ నామవాచక పదములోనుండి వచ్చింది.

దేవుని స్నేహితుడుగా అలాగే విశ్వాసులకు తండ్రిగా పేరుప్రఖ్యాతులు పొందిన హెబ్రీయుడైన అబ్రహాముకు దేవుని వాగ్ధాన ఫలితంగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు ఏశావు మరియు యాకోబు అనే యిరువురు కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడైన యాకోబును దేవుడు యెన్నుకొని ఆశీర్వదించాడు.

ఇశ్రాయేలు అనే పేరును పొందిన యాకోబుకు పన్నేండుమంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు. యాకోబు లేక ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారులలోని నాలుగవకుమారుని పేరు యూదా.       

ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారుల సంతానము పన్నెండు గోత్రాలుగా విస్తరించింది. వీరందరిని అంటే పన్నెండు గోత్రాలలోని యాకోబు సంతానమంతటిని సర్వసాధారణముగా ‘ఇశ్రాయేలీయులు’ అంటూ బైబిలు పేర్కొంటుంది. 

రెండు రాజ్యాల ప్రారంభం

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల సమిష్టి రాజ్యాన్ని పాలించిన చివరి రాజు సొలొమోను మరణము [930 క్రీ.పూ.]తరువాత ఇశ్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా అంటే ఉత్తరరాజ్యం మరియు దక్షిణరాజ్యంగా విడిపోయింది. పది గోత్రాలతో కూడిన ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలురాజ్యము అని రెండు గోత్రాలతో కూడిన దక్షిణ రాజ్యాన్ని యూదారాజ్యము అని పేర్కొంటారు. యూదా రాజ్యము ప్రధానంగా యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము కలిపి ఏర్పరచబడినా వారితోపాటు లేవీయ గోత్రములోని కొందరు అలాగే షిమియోను గోత్రీకులు కొందరు కలిసారు. 

యూదా రాజైన ఆసా యేలుబడిలో [911-870 క్రీ.పూ.] ఉత్తర రాజ్యములోని ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమియోను గోత్రాలలోని అనేకమంది భక్తిపరులు వలసవచ్చి దక్షిణరాజ్యమైన యూదారాజ్యములో స్థిరపడ్డారు (2ది.వృ.15:9).     

రెండు రాజ్యాల చెఱ

722 క్రీ.పూ. లో ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం అంటే పది గోత్రాల రాజ్యాన్ని అష్షూరీయులు జయించి ఆ గోత్రాలవారిని దాసులుగా తీసుకువెళ్ళారు. ఆ సందర్భములో కొందరు దక్షిణరాజ్యమైన యూదారాజ్యములోకి పారిపోవటము జరిగింది. మొదటి శతాబ్ధములో యెరూషలేములో ఆషేరు వంశములోనుండి వచ్చిన అన్న అను ఒక ప్రవక్తి యొక్క ఉనికి దీని పర్యవసానమేనని గ్రహించవచ్చు (లూకా.2:36-38). మరికొందరు ఉత్తర రాజ్యవాసులు అష్షూరీయులను తప్పించుకొని తమదేశములోనే జీవనం కొనసాగించారు. అయితే, అధిక సంఖ్యాకులు మాత్రం అష్షూరీయులచేతిలో బందీలుగా మారి వారికి దాసులుగా తీసుకువెళ్ళబడ్డారు. అలా వెళ్ళిన వారిలో అధికశాతం కాలక్రమంలో భూమి నలుమూలలకు చెదిరిపోవడం జరిగింది. 

ఉత్తర రాజ్యములోని ఇశ్రాయేలీయులను బందించి దాసులుగా తీసుకువెళ్ళిన అష్షూరీయులు ఉత్తర రాజ్య భూబాగమైన ఉత్తర పాలస్తీనా ప్రాంతములోకి తాము జయించిన అనేక అన్యజాతి ప్రజలను తెచ్చి స్థిరపరచారు. ఆ అన్యజాతులవారికి ఇశ్రాయేలు మతాన్ని బోధించేందుకు అష్షూరీయులు తాము దాసులుగా తీసుకువెళ్ళిన కొందరు లేవీయులను ఉత్తర పాలస్తీనాకు తిరిగి పంపించారు. ఈరకంగా తిరిగి వచ్చిన లేవియులు కాలక్రమములో పాలస్తీనాలో స్థిరపడిన అన్యజాతీయులను యూదామతములోకి మార్చారు (2రాజులు.17:24-41; ఎజ్రా.4:1-6). సమరయులు అలాంటివారికి చెందినవారే.            

586 క్రీ.పూ. లో దక్షిణరాజ్యాన్ని అంటే ప్రధానంగా యూదా మరియు బెన్యామీను గోత్రాలతో ఏర్పడినా కాలక్రమేణా మరికొన్ని యితర గోత్రాల వారికి కూడా ఆశ్రయముగా మారిన యూదారాజ్యాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు జయించి అధిక సంఖ్యాకులను దాసులుగా బబులోనుకు తీసుకువెళ్ళాడు. వారిలోని ముఖ్యులు తిరిగి 444/5 క్రీ.పూ.లో తిరిగి తమ స్వదేశమైన యూదయకు వచ్చారు. 

దక్షిణ రాజ్యమైన యూదారాజ్యములోనివారు ప్రధానంగా పాలస్తీనాలోని యూదయ ప్రాంతవాసులు గనుక చెఱలోనున్నప్పుడు వారిని కల్దీయులు యూదులు అంటూ సంబోధించటం మొదలయ్యింది. కొంతకాలానికే ఆ ప్రాంతములోనుండి చెఱపట్టబడిన వచ్చినవారందరికి సమిష్టిగా యూదులు అన్న పేరు స్థిరపడిపోయింది.

యూదులు అన్న పేరుతో మొదట గుర్తించబడినవారు యూదా గోత్రపువారే అయినా కాలక్రమేణా వారితోపాటు బెన్యామీను గోత్రపువారు, లేవీయ గోత్రపువారు, షిమ్యోను గోత్రపువారు అలాగే ఆసా పరిపాలనలో ఉత్తర రాజ్యములోనుండి వలసవచ్చిన ఎఫ్రాయీము మరియు మనష్షే గోత్రపువారు అంతేగాక అష్షూరీయుల దాడినుండి తప్పించుకొని పారిపోయి వచ్చి దక్షిణ రాజ్యములో స్థిరపడిపోయిన ఉత్తర రాజ్యములోని పది గోత్రాల సంబంధికులుకూడా యూదా గోత్రపువారితో కలిసి యూదులుగా గుర్తించబడ్డారు.  

భావ విస్తరణ

445 క్రీ.పూ.లో బబులోను చెరలోనుండి విడిపించబడి తిరిగి స్వదేశమైన యూదయకు మరలివచ్చిన దక్షిణదేశవాసులను లేఖనాలు ఇశ్రాయేలీయులుగాకూడా గుర్తిస్తున్నాయి (ఎజ్రా.2:1-2, 70; 3:1; నెహెమ్యా.1:1-6; 7:73; 11:3, 20). ఈ నేపథ్యములో క్రమక్రమంగా ఇశ్రాయేలీయులు మరియు యూదులు అన్న పదాలు రెండు ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోయాయి అన్నది ప్రస్పుటమవుతున్నది.  

మొదటిశతాబ్దములో మెస్సయ్య ఆగమనానికల్లా యూదులన్నా ఇశ్రాయేలీయులన్నా ఒకే భావం వ్యక్తపరచబడేది. అందుకే మెస్సయ్య ‘యూదుల రాజు ‘ (మత్తయి.2:2; మార్కు.15:2) లేక ‘ఇశ్రాయేలు రాజు ‘ (మత్తయి.27:42; యోహాను.1:49; 12:13) అన్నది లేఖన బోధ. 

“ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి” (అపొ.కా.2:5). అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు దినాన యెరూషలేములో కాపురమున్న ఆ యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ పలికిన మాటలు (అపొ.కా.2:14-36):

యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియునుగాక…ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి…దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను…మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

పేతురు పలికిన పై మాటలలో ఒకే భావాన్ని వ్యక్తపరచటానికి ‘యూదులు’ మరియు ‘ఇశ్రాయేలువారు’ అన్న రెండు పదాలను మార్చిమార్చి వాడటాన్ని గమనించవచ్చు. నిజానికి పేతురు తన ప్రసంగాన్ని యూదులను ఉద్దేశించి పలుకుతూ వారిని ఇశ్రాయేలువారలారా అంటూ కూడా సంబోధిస్తున్నాడు. కారణం? యూదులు అన్నా లేక ఇశ్రాయేలీయులు అన్న ఒకే భావం గనుక!  

కాలక్రమములో యూదులు అన్న పదప్రయోగము యొక్క భావము అంచెలంచెలుగా విస్తరించిన విధానము:

  • యూదా గోత్రపువారు
  • యూదా గోత్రము మరియు బెన్యామీను గ్రోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము మరియు లేవి గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము మరియు షిమ్యోను గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము మరియు ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము, ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు మరియు ఉత్తరరాజ్యములోని పది గోత్రాలలోనుండి వలసవచ్చిన పదిగోత్రాల శేషము
  • పన్నెండు గోత్రాలు లేక ఇశ్రాయేలీయులు

మెస్సయ్య ప్రజలు

మెస్సయ్య అయిన యషువ “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” (మత్తయి.1:21). ఆయన ప్రజలు ఇశ్రాయేలీయులు లేక యూదులు. ఆ కారణాన్ని బట్టే ఆయన “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్రెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకు నేను పంపబడలేదు” అని తన పరిచర్య యొక్క అర్దభాగములో ప్రకటించాడు (మత్తయి.15:24). అయితే, లేఖనాలు ఆయన “తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను.1:11) అంటూ ఘోషిస్తున్నాయి. ఇందునిమిత్తమే చివరికి మెస్సయ్య యూదులతో/ఇశ్రాయేలియులతో తెగేసి ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, “కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి.21:43).

ఈ నేపథ్యములో మెస్సయ్య తన మరణపునరుత్థానాలతదుపరి తన శిష్యులకు ఆజ్ఙాపించాడు: కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి (మత్తయి.28:19); మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి (మార్కు.16:15); యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును (లూకా.24:47).             

ఇశ్రాయేలు ప్రజలలోని ఉత్తర రాజ్యనివాసులలో అధికశాతం ప్రజలు అష్షూరు రాజులచేత చెరపట్టబడి ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదరగొట్టబడ్డారు. గత 2700 సంవత్సరాల కాలములో వారు తిరిగి తమ స్వదేశమైన ఉత్తర పాలస్తీనాకు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అయితే, ప్రభువైన దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలద్వారా వారిని తిరిగి తమ స్వదేశములో సమకూరుస్తాను అంటూ అనేక పర్యాయాలు వాగ్ధానము చేశాడు (యిర్మీయ.23:3; 31:7-8; 32:37; యెషయా.11:11-12,16). ఈ వాగ్ధానాల నెరవేర్పు మెస్సయ్య యొక్క రెండవ రాకడ సందర్భములో నెరవేర్చబడబోతున్నాయి. 

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)      

8 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *