యెషయా 53

యెషయా గ్రంథంలో “నా సేవకుడు” [עַבְדִּ֑י/అబ్ది] అన్న పదజాలము విరివిగా వాడబడింది. ఈ గ్రంథంలోనే ఈ పదజాలము ప్రవక్త అయిన యెషయాకు, రాజైన దావీదుకు, కోశాధికారి అయిన ఎల్యాకీముకు, మరియు ఇశ్రాయేలు జనాంగముకు ఉపయోగించబడింది.

53వ అధ్యాయం “నా సేవకుడు” అనబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నది. ఆ వ్యక్తి మరివిశేషముగా వ్యసనాక్రాంతుడైన సేవకునిగా చిత్రీకరించబడ్డాడు.

యెషయా గ్రంథంలో 52:13-53:12 వరకు గల లేఖన భాగం ఆ “నా సేవకుడు” ఎవరు, ఏవిధంగా ఆయన వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డాడు, ఎవరికొరకు ఆ విధంగా చేయబడ్డాడు, ఇంకా ఆయన అనుభవించిన దుస్థితి యొక్క పర్యవసానం యేమిటి అన్న వివరాలను కూడా అందిస్తున్నది.

యెషయా గ్రంథంలో పరిచయం చేయబడిన వ్యసనాక్రాంతుడైన “నా సేవకుడు” రాబోతున్న మెస్సయ్య లేక మషియాఖ్ అని క్రీస్తు పూర్వం 2వ మరియు 3వ శతాబ్ధాలలో వ్రాయబడిన మృతసముద్ర తాళపత్ర గ్రంథాలు [Dead Sea Scrolls] పేర్కొన్నాయి.

రబ్బీనిక్ సాహిత్యం కూడా యెషయా గ్రంథంలోని వ్యసనాక్రాంతుడైన “నా సేవకుడు” రాబోతున్న మెస్సయ్యా అంటూ బోధిస్తున్నాయి:

మెస్సయ్య–ఆయన నామమేమిటి?…రబ్బీలు తెలియచేస్తున్నారు, “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు” అని చెప్పబడినట్లుగా ఆయన పేరు మొత్తబడిన పండితుడు లేక కుష్ఠరోగ పండితుడు–బబులోనియన్ తాల్ముద్: సన్ హెడ్రిన్ 98బి

(రూతు 2.14 యొక్క) మరొక వివరణ:–ఆయన రాజైన మెస్సయ్యను గురించి మాట్లాడుతున్నాడు; ‘నీ విక్కడికి వచ్చి,’ సింహాసనానికి చేరువగా రా; ‘భోజనముచేసి,’ అది రాజ్యమనే భోజనము; ‘చిరకలో నీ ముక్క ముంచి,’ ఇది “మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను” అని తెలియచేయబడినట్లు ఆయనపొందే దెబ్బలను సూచిస్తున్నది;” -మిద్రాష్ రూతు రబ్భా

13వ శతాబ్ధంవరకు గల యూదుమత రబ్బీలలోని కొందరు ప్రఖ్యాతిచెందిన వారు సహితం యెషయా గ్రంథం 52:13 నుండి 53:12 వరకు గల లేఖన భాగం రాబోవు మెస్సయ్యాను గూర్చినది అని బోధించారు! అలాంటివారిలోని కొందరు క్రింద పేర్కొనబడిన రబ్బీలు:

(1) యోనాతాన్ బెన్ ఉజ్జిఎల్ [తార్గం జోనాథాన్]
(2) రబ్బీ ఇట్జాక్ అబ్రవానెల్
(3) రబ్బీ ఎలియేజర్
(4) రబ్బీ మోషే హదర్షన్
(5) మైమోనిడెస్ [Rambam]
(6) రబ్బీ షిమోన్ బార్ యోఖాయ్

అయితే, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములోని వ్యసనాక్రాంతుడైన “నా సేవకుడు” అన్న వ్యక్తి యొక్క వివరాలు నిజానికి మొదటి శతాబ్ధంలో వచ్చిన యషువ [యేసు] జీవితానికి అద్దంపట్టినట్లుండటం చేత ఆయనే మషియాఖ్ [మెస్సయ్య] అని నిర్ధారించబడుతుండటం యూదుమత రబ్బీలు గమనించి ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిజానికి ఈ సత్యమే అనేకమంది యూదు మతస్తులు యేసే క్రీస్తు అని నమ్మి క్రైస్తవ్యాన్ని స్వీకరించేందుకు కారణమవుతూ వచ్చింది. ఈ సమస్యను అధిగమించే క్రమంలో 12వ శతాబ్ధంలో రబ్బీ ష్లొమొ ఇట్జాక్ [Rashi/రషి] అనే రబ్బీ యెషయా 53లోని “నా సేవకుడు” ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తున్నది అంటూ ఒక క్రొత్త భాశ్యం ప్రవేశపెట్టాడు.

రషి చెప్పిన భాశ్యం యూదుమతస్తుల మధ్య క్రైస్తవ సువార్త ప్రకటనను సమర్దవంతంగా అడ్డుకోవటమేగాక యూదుమతానికి స్థిరత్వాన్ని తెస్తుండటాన్నిబట్టి 12వ శతాబ్ధం నుండి రబ్బీలు పాతనిబంధన గ్రంథంలోని [తనాక్] లేఖనాలు వ్యతిరేకిస్తున్న రషి భాశ్యాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చారు.

To be continued…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *