సబ్బాతు సమాచారం

1. పదప్రయోగం: సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్న హీబ్రూ పదం (שַׁבַּת/shabbat/షబ్బాత్) పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 111 సార్లు వుపయోగించబడింది. గమనించాల్సిన విశయమేమిటంటే ఈ పదం బైబిలులోని మొదటి గ్రంథమైన ఆదికాండములోని 50 అధ్యాయాలలో యెక్కడా వుపయోగించబడలేదు. సబ్బాతు (విశ్రాంతిదినము) ను పాటించే ఆచారాన్ని లేక ఆజ్ఙను దేవుడు ఆదాము మొదలుకొని యోసేపువరకు యేవరికీ యివ్వలేదు. కాబట్టి, మోషేకు ముందు యేవరూ ఆ ఆచారాన్ని పాటించలేదు.  

వారములోని ఏడు దినాలు ఆదినుండే వున్నాయి. అందులో యేడవదినము కూడావుంది. యేడవదినాన్ని ఆదిలోనే దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు (ఆది.కాం.2:3). అయితే, యేడవదినాన్ని విశ్రాంతిదినముగా పాటించే ఆచారము మాత్రము మోషే కాలమునుండే ప్రారంభమయింది. అంతకుముందు ఆ ఆచారాన్ని పాటించాలన్న ఆజ్ఙ యివ్వబడలేదు పాటించిన దాఖలాలుకూడా లేఖనాలలో యేవీ లేవు.  

రెండుహీబ్రూపదాలు:

i) షబత్ (שָׁבַת/shabath): ఆగిపోవుట; విరమించుట; విశ్రమించుట (క్రియావాచక పదము/verb). ఈపదం పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 71 సార్లు వుపయోగించబడింది (ఉదా. ఆది.కాం.2:2,3, 8:22; నిర్గ.కాం.5:5, 12:15).    

ii) షబ్బాత్ (שַׁבַּת/shabbat): విశ్రాంతి; విశ్రాంతిదినము (నామవాచక పదము/noun).  ఈ పదం పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 111 సార్లు వుపయోగించబడింది (ఉదా. నిర్గ.కాం.16:23,25,26,29)

గమనించాలి, ఇక్కడ చర్చించబడుతున్నది “షబత్” (שָׁבַת/shabath) గురించి కాదు. ఇక్కడ చర్చించబడుతున్నది “షబ్బాత్” (שַׁבַּת/shabbat) గురించి. ఈ రెండు హీబ్రూ పదాలమధ్యనున్న సూక్ష్మమైన, సున్నితమైన, మరియు సంక్లిష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతే లేఖనాల అంతర్గతములో నిభిడీకృతమైవున్న  దైవ సత్యాన్ని గ్రహించడం అసాధ్యం.

ఈ సందర్భంగా మనం లేఖనాలలో వుపయోగించబడిన క్రింది మూడు పదాలను అవి వ్యక్తపరుస్తున్న భావాలను సరియైన విధంగా అర్థంచేసుకోవాల్సివుంది: 

విశ్రాంతి: ఇది దేవుని విశ్రాంతి. బైబిలు అనువాదాలలో ఆదికాండము 2:1-2 ప్రకారము దేవుడు ఆరుదినాలలో సమస్తాన్ని సృష్టించడం పూర్తిచేసి ఏడవదినం విశ్రమించినట్లు చదువుతాము. అంటే, దాని భావం దేవుడు ఆరు దినాలుగా సృష్టిస్తూ చెమటోడ్చి అలిసిపోయాడనా?! ససేమిరా కాదు. ఆమాటకొస్తే దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు, మరియు ఆయనకు విశ్రాంతి తీసుకోవలసిన ఆగత్యమూ లేదు (యెషయా.40:28)! ఇక్కడ వుపయోగించబడిన మూలభాషా పదాలు సూచిస్తున్నదాని ప్రకారం దేవుడు ఆరు దినాలుగా ఆయావాటిని సృష్టిస్తూవచ్చి ఆరవదినము సమస్తాన్ని సృష్టించడము పూర్తిచేసాడు. దానితరువాత, యేడవదినము సృష్టిక్రియనుండి విరమించాడు. దేవుడు సృష్టిక్రియనుండి విరమించిన యేడవ దినములోనే యిప్పటికీ కొనసాగుతున్నాడు. ఆవిధమైన ‘విశ్రాంతి’ లో దేవుడు కొనసాగుతూ తన ప్రజలనుకూడా తన ‘విశ్రాంతి’ లోకి ఆహ్వానించి చేర్చుకోబోతున్నాడు.  

విశ్రాంతిదినం: దేవుడు తాను చేస్తూవచ్చిన సృష్టి కార్యాన్ని ఆపిన దినాన్ని విశ్రాంతిదినముగా పేర్కొన్నాడు. దాని భావం ఆదినం దేవుడు విశ్రాంతి తీసుకున్నడని కాదుగాని, తాను చేస్తూవచ్చిన కార్యాలనుండి విరమించాడని. అది ఆత్మీయ విశ్రమాన్ని సూచించే దినం. మానవులు తమ స్వంత క్రియలతో ప్రయత్నాలతో సంపూర్ణతను/పరిపూర్ణతను సంపాదించి దేవున్ని తృప్తిపరచి తద్వారా ఆయనమెప్పు పొందగలము అనుకుంటూ చేస్తున్న ఆయా స్వనీతిప్రయత్నాలనుండి విరమించుకునే దినం. ఆదినానికి మెస్సయ్యగా వచ్చిన యేసు ప్రభువుగా వున్నాడు. ఆయన మానవుల పక్షాన తనే సమస్తాన్ని నిర్వహించి నెరవేర్చి తద్వారా దేవున్ని తృప్తిపరచి వారి సంపూర్ణతను/పరిపూర్ణతను సంపాదించాడు. అందునుబట్టే తనయొద్దకు వచ్చే ప్రతివ్యక్తికీ ‘విశ్రాంతిని’ యిస్తాను అంటూ ప్రకటించాడు.       

విశ్రాంతిదినాచారము: రాబోవుదినాలలో తన శ్రేష్టమైన విశ్రాంతిలోకి ప్రవేశించబోతున్న వాస్తవాన్ని దృష్టిపథంలో వుంచుకొని తన ప్రజలు ఈలోకములో జీవించినంతకాలము శుభప్రదమైన నిరీక్షణతో జీవితాన్ని గడపాలన్న ప్రణాలికతో దేవుడు విశ్రాంతిదినాచారాన్ని తాను ఎన్నుకొని ప్రత్యేకపరచుకొన్న ప్రజలకు ఒక సూచనగా నిర్దేశించాడు. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఈలోకములోనికి పంపబోతున్న తన ప్రియకుమారుడైన మెస్సయ్యానందు తన ప్రజలకు అనుగ్రహించబోయే తన ‘విశ్రాంతికి’ ఛాయారూపకమైన ఆచారము మాత్రమే. ఛాయారూపమైన విశ్రాంతిదినాచారము వెయ్యిన్నర సంవత్సరాలు (1470 క్రీ.పూ. – 30 క్రీ.శ.) పాటించబడిన తరువాత దాని నిజస్వరూపము క్రీస్తునందు నెరవేర్చబడింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందున్నవారందరు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించి అ విశ్రాంతిలో కొనసాగుతున్నారు. కనుక, నిజవిశ్వాసులు యిప్పుడు వారములోని ఒక రోజును మాత్రమే విశ్రాంతిదినముగా (ఛాయారూపమైన) పాటించే ప్రయత్నము చేయక ప్రతిదినాన్ని పరిశుద్ధ దినముగా ప్రతిదినము దేవుని విశ్రాంతిని అనుభవించే దినముగా పరిగణిస్తూ జీవించాలి. ఈ గ్రహింపులో వారములోని ఏదినమైనా సంఘముగా కూడి దేవున్ని ఆరాధించవచ్చు. శక్యమైతే ప్రతిదినం విశ్వాసులు సంఘముగా కూడి దేవున్ని ఆరాధించవచ్చు అన్నది లేఖన బోధ మరియు మాదిరి (హెబ్రీ.10:25; అపో.కా.2:46-47).                        

2. విశ్రాంతిదినాచారము మనుష్యులు సృష్టించబడిన తరువాతే నియమించబడింది: దేవుడు తన విశ్రాంతిలోనికి ప్రవేశించే ధన్యత తాను సృష్టించిన నరులకుకూడా అనుగ్రహించబోతున్నందున ఆ ధన్యతనుగూర్చిన ఆధారము అందించడానికి వారిలో కొందరిని తన ప్రత్యేక ప్రజగా ఎన్నుకొని  వారు విశ్రాంతిదినాచారాన్ని పాటించే సంస్కారాన్ని వారికి అందించాడు. ఈ ఆచారము నరులకు నియమించబడటమన్నది నరులు సృష్టించబడిన తరువాత అదీ దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని తన ప్రజగా యెన్నుకొన్నతరువాతే జరిగిన సంఘటన (ని.కాం.16:22-30). ఈ వాస్తవాన్ని సూచిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు (యషువ మషియాఖ్) “విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను…” (మార్కు 2:27) అంటూ ప్రకటించాడు. 

3. సబ్బాతు (విశ్రాంతిదినము) ఆచారము: విశ్రాంతిదినాచారమన్నది దేవుడు ఇశ్రాయేలీయులకు యిచ్చిన ఆచారము. ఇది వారికి తరతరాలకు యివ్వబడిన నిబంధనలోని భాగం. అంటే వారు పాతనిబంధనలో కొనసాగినంతకాలం ఈ ఆచారాన్ని పాటించాలి.  అదీ మోషేధర్మశాస్త్రములో సూచించినవిధంగా పాటించాలి. ఈ దినాన అంటే ఏడవదినాన వారు యేపని చేయకూడదు. ఇది ఇంటిలోని అందరికీ అంటే పనివారితోసహా అందరికి వర్తిస్తుంది. నిబంధనను మీరినవారికి మరణశిక్ష విధించాలి. ఆదినాన ఇంటిలో అగ్ని రాజబెట్టకూడదు (ని.కాం.31:12-17, 35:1-3; ద్వితీ.కాం.5:12-15). గమనించాలి, దేవుడు నోవహుద్వారా సర్వమానవులతో నిబంధనచేస్తూ నాలుగు ఆజ్ఙలను సర్వమానవులకు యివ్వడము జరిగింది (ఆది.కాం.9:1-17). కాని, ఈ గంభీరమైన విశ్రాంతిదినాచారాన్నిగూర్చిన ఆజ్ఙ మాత్రము మానవులందరికికాకుండా కేవళము ఇశ్రాయేలీయులకు పాతనిబంధన కాలానికి మాత్రమే యివ్వబడిన ఆజ్ఙ అన్నది గమనములో వుంచుకోవాలి!

“ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆవిశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమతరతరములకు విశ్రాంతిదినాచారమును అనుసరించి ఆ దినమునాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతై యుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.” (ని.కాం.31:15-17) 

పై లేఖనాలు బోధిస్తున్న విశయాలు:    

(అ) సబ్బాతు దినాన్ని ఆచరించడము అన్నది నిత్యనిబంధనలోని  భాగము. ఇక్కడ నిత్యము అన్న పదము (עוֹלָם/ఓలాం) యొక్క భావము నిరంతరము లేక నిత్యత్వమంతా అనికాదు. ఓలాం (עוֹלָם) అన్న హీబ్రూ పదము యొక్క భావము సుధీర్ఘకాలము లేక ఒక తరమంతా లేక అనేక తరాలు. ఈ పదముయొక్క సరియైన భావాన్ని అది వుపయోగించబడిన సందర్భాన్ని బట్టి గ్రహించాలి. ఈ వాక్యములోని సందర్భం “ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను.” ఇశ్రాయేలీయులు సబ్బాతుదినాచారాన్ని తరతరాలు ఆచరించాలి. అంతేకాని, నిరంతరం లేక నిత్యత్వం అంతా ఆచరిస్తూ వుండాలని కాదు.      

(ఆ) సబ్బాతు దినాన్ని ఆచరించడమన్నది దేవుడు ఇశ్రాయేలీయులకు తనకు మధ్య గుర్తుగా యిచ్చాడు. 

(ఇ) ఆదినాన్ని ఆచరించని ఇశ్రాయేలీయునికి మరణశిక్ష విధించాలి. 

ఇశ్రాయేలీయులకు యివ్వబడిన మోషేధర్మశాత్రానికి సంబంధించిన నిబంధనలో భాగంగా వున్న పది ఆజ్ఙలలోని సబ్బాతు ఆచారపు ఆజ్ఙను యిప్పుడుకూడా అంటే క్రొత్తనిబంధన కాలములో మేమూ ఆచరిస్తాము అని మొండిపట్టు పట్టేవారు ఆ ఆచారాన్ని తమకు వీలయినవిధనములోనో లేక అనుకూలమైన విధానములోనో గాక దేవుడు మోషేద్వారా ఆజ్ఙాపించిన విధానములోనే ఆచరించాలన్నది ఈసందర్భంగా జ్ఙాపకము చేసుకోవాలి. 

4. సబ్బాతు (విశ్రాంతిదినము) ను పాటించే ఆచారము మోషేతో మొదలైంది: ఇది కేవళము ఇశ్రాయేలియులకు మాత్రమే యివ్వబడిన మోషేధర్మశాస్త్రములోని పది ఆజ్ఙలలో ఒక ఆజ్ఙ (ని.కాం.19:3-6, 24:3-8, 31:12-14,16; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9). ఈ ఆజ్ఙ కాని లేక ఈ ఆజ్ఙకు సంబంధించిన నిబంధనకాని అన్యజనులకు యివ్వబడలేదు అన్న సత్యాన్ని మరచిపోకూడదు. అయితే ఈసందర్భంగా అన్యజనులకు సంబంధించి మనం గుర్తుంచుకోవలసినది ఒకటుంది. పూర్వ/పాత నిబంధనలో భాగమై యున్న మోషేధర్మశాస్త్రము అన్నది ఇశ్రాయేలీయులతోపాటు వారిమధ్య నివసిస్తూ ఈలోకములో పాలస్తినాదేశస్వాస్థ్యన్ని గూర్చిన వాగ్ధానములో పాలుపొందబోతున్న అన్యులకు అంటే ఇశ్రాయేలీయుల దాసదాసీలకు మరియు ఇశ్రాయేలు మతప్రవిష్టులకు కూడా వర్తిస్తుంది (ని.కాం.12:47-50; సం.కా.15:15,30; యెషయా 56:2-7). అంతేకాని లోకములో వున్న అన్యులందరికీ వర్తిస్తుందని కాదు.  

5. విశ్రాంతిదినాచారాన్ని పాటించిన యేసుక్రీస్తు: ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) ఒక యూదునిగా పుట్టి మోషేధర్మశాస్త్రము క్రింద శాపగ్రస్తులుగా వున్న వారిని విడిపించడానికి తాను మోషేధర్మశాస్త్రముక్రింద సంపూర్ణముగా జీవించి దాన్ని తు.చ. తప్పకుండా పాటించి/అనుసరించి (φυλάσσω/ఫులస్సో) తద్వారా పాపరహితుడుగా జీవించగలిగాడు (లూకా 24:44-48; యోహాను 8:46; 2కొరింథి.5:21; హెబ్రీ.2:14-17, 4:15, 5:7-9, 7:26, 9:14; 1పేతురు 2:22). అందుకే తాను ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఒక ధర్మశాస్త్ర బద్ధుడయిన యూదునిగా సబ్బాతు (విశ్రాంతిదినాన్ని) ఆచరించాడు. ఆ సమయములో తన రక్తముతో ప్రారంభించబోయే క్రొత్త నిబంధనను యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యింకా ఆవిష్కరించలేదన్నది యిక్కడ గుర్తుంచుకోవాలి.  

6. క్రొత్తనిబంధనలో నివిశ్రాంతిదినము: యూదుడని యూదేతరుడని బేధంలేకుండా విశ్వసించు ప్రతివానికి సమాధానాధిపతి అయిన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా పరమతండ్రి విశ్రాంతి అనుగ్రహిస్తున్నాడు (మత్తయి 11:28-30). ఈ విశ్రాంతిని పొందిన ప్రతివ్యక్తి దేవుడు వాగ్ధానము చేసిన ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఇందునుబట్టే ప్రతి నిజ క్రైస్తవునికి ప్రతిదినము అత్మీయంగా విశ్రాంతిదినము మరియు పరిశుద్ధ దినము.

దేవుని గొర్రెపిల్లగా మానవుల పాపరిహారార్థనిమిత్తము కలువరిసిలువలో మరణించిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తంతో ప్రారంభమైన క్రొత్త నిబంధనలో (లూకా 22:14-21) విశ్రాంతిదినాన్ని (సబ్బాతును) మోషేధర్మశాస్త్రప్రకారము ఆచరించాలన్న ఆజ్ఙ కాని లేక సూచన కాని యివ్వబడలేదు. అంతమాత్రమే కాకుండా క్రొత్త నిబంధన ప్రారంభము తరువాత యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలుగా మారిన యూదులైనా లేక యూదేతరులైనా విశ్రాంతిదినాన్ని మోషేధర్మశాస్త్ర ప్రకారము ఆచరించిన దాఖలాలు క్రొత్త నిబంధన లేఖనాలలో లేశమైనా లేవు.

లేఖనాలు యిస్తున్న సాక్షాన్ని బట్టి నిజమైన విశ్వాసులందరూ యేసు క్రీస్తులోకి (యషువ మషియాఖ్) బాప్తీస్మము పొందడముద్వారా ఆత్మీయంగా మరణించి క్రీస్తుతోకూడా తిరిగిలేచారు అన్న సాక్షాన్ని పొందుతారు (రోమా.6:3-4; కొలస్సీ.2:13-14; ఎఫెస్సీ.2:5). కనుక, క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించిన నిజవిశ్వాసులందరు పాత నిబంధనకు సంబంధించిన మోషేధర్మశాస్త్రాముపట్ల చనిపోయి క్రొత్త నిబంధనకు సంబంధించిన క్రీస్తుధర్మశాస్త్రాముక్రింద జీవించబద్ధులై వున్నారు (రోమా. 7:1, 4-6).

ఈ సందర్భంగా మనం గమనములో వుంచుకోవలసిన విశయమేమిటంటే క్రొత్తనిబంధనలో భాగంగా పాతనిబంధనలోని పది ఆజ్ఙలలో కేవళము తొమ్మిదింటిని మాత్రమే తిరిగి ప్రవేశపెట్టడము జరిగింది. క్రొత్తనిబంధనలో భాగంగా తిరిగి యివ్వబడని ఒకే ఒక ఆజ్ఙ సబ్బాతు ఆచరాన్ని సూచించే ఆజ్ఙ (ప్రకటన 14:7; అపో.కా.15:20; 1తిమోతి.6:1; మత్తయి 15:4-9; ఎఫేసీ.6:1; రోమా.13:8-10). 

7. పాతనిబంధనలోని విశ్రాంతిదినము: పాత నిబంధనలో పాలుపొంది మోషేధర్మశాస్త్రాన్ని యెరిగిన తన తోటి యూదులకు/ఇశ్రాయేలీయులకు వ్రాస్తు (హెబ్రీ.1:1) “హెబ్రీయులకు వ్రాసిన పత్రిక” యొక్క గ్రంథకర్త ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్ధానము చేసిన విశ్రాంతిని గురించి 3 మరియు 4 అధ్యాయాలలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను బహిర్గతంచేసాడు. ఇక్కడ గ్రంథకర్త ‘దేవుని విశ్రాంతిని’ గురించి వివరిస్తున్నాడు. విశ్రాంతిదినాన్ని గురించిగాని లేక విశ్రాంతిదినాచారాన్ని గురించిగాని యిక్కడ ప్రస్తావించడము లేదు అన్నది గమనములో వుంచుకోవాలి. 

దేవుని విశ్రాంతినిగురించి హెబ్రీ గ్రంథకర్త చేసిన ప్రబోధ:

– ఐగుప్తుదాసత్వములోనుండి రక్షింపబడిన ఇశ్రాయేలీయులలోని అనేకులు తమ అవిధేయత వలన అలాగే తమ అవిశ్వాసము వలన చివరికి దేవుడు వాగ్ధానము చేసిన విశ్రాంతిలో (విశ్రాంతిదినములో లేక విశ్రాంతిదినాచారములో కాదు) ప్రవేశించలేకపోయారు (హెబ్రీ.3:16-19).  

– దేవుని ప్రజలకు (యిక్కడ అన్యులగురించి చెప్పడములేదు) అంటే ఇశ్రాయేలీయులకు/యూదులకు (2సమూయేలు 14:13; హెబ్రీ.11:25) విశ్రాంతి (విశ్రాంతిదినము కాదు) యింకా నిలిచివుంది (హెబ్రీ.4:9). కాని, ఈనాడు యూదులలోని/ఇశ్రాయేలీయులలోని అనేకులు ఆ సత్యాన్ని గ్రహించడములేదు.   

– అయితే, యిప్పుడు అంటే ఈ క్రొత్ర నిబంధన కాలములో యూదులలోని/ఇశ్రాయేలీయులలోని కొందరు పై సత్యాన్ని గ్రహించి విశ్వాసముద్వారా ఆ విశ్రాంతిలో (ప్రభువైన యేసుక్రీస్తునందు అనుగ్రహించబడే దేవుని విశ్రాంతి) ప్రవేశించగలుగుతున్నారు (హెబ్రీ.4:2-3)   

-కనుక యిప్పుడు యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుడు వాగ్ధానము చేసిన విశ్రాంతిలోకి ప్రవేశించిన యూదుడు/ఇశ్రాయేలీయుడు తన కార్యములనుండి అంటే మోషేధర్మశాస్త్ర విధులను ముగించి క్రీస్తు (మషియాఖ్) సంపూర్ణముచేసి సిద్ధపరచిన రక్షణకార్యములో విశ్రమిస్తాడు (హెబ్రీ.4:10). అందునుబట్టి ఒకప్పుడు మోషేధర్మశాస్రమనే కాడీక్రింద శాపగ్రస్తునిగా జీవించిన  యూదుడు/ఇశ్రాయేలీయుడు సహితము ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా రక్షించబడి మోషేధర్మశాస్త్రమునుండికూడా విడుదల పొందాడు.           

– ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రకటింపబడిన సువార్తను విన్న యూదులు/ఇశ్రాయేలీయులు ఒకవేళ ఆ సువార్తకు విధేయులు కాకుండా కొనసాగితే వారు దేవుని ప్రజలకు నిలిచివున్న విశ్రాంతిలోకి ప్రవేశించలేరు. కనుక వారు ప్రకటింపబడిన సువార్తకు విధేయత చూపడములో జాగ్రత్తవహించాలి (హెబ్రీ.4:11). 

8. విశ్రాంతిదినము సువార్తప్రచారానికి అనుకూలము: క్రీస్తు యేసు రక్తములో కడుగబడి క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించిన నిజవిశ్వాసులు క్రొత్త నిబంధన ఆదిలో యూదుల సమావేశమందిరాలకు వెళ్ళేవారు (అపొ. కా.2:46; 13:14-44; 17:2; 18:4). దానికి కారణం తమతోటి యూదులకు సువార్త ప్రకటించి వారిని దేవుని రక్షణలోనికి తీసుకురావాలన్న తపన. మోషేధర్మశాస్త్రముయొక్క కాడీక్రింద జీవిస్తూ మోషేధర్మశాస్త్రములో యివ్వబడిన ఆజ్ఙ ప్రకారము యేడవ దినాన్ని సబ్బాతుగా లేక విశ్రాంతిదినముగా ఆచరించడానికి సమకూడే యూదులకు లేక యూదామతప్రవిష్టులకు పాత నిబంధన లేఖనాల (తనాఖ్) వెలుగులో సువార్తను ప్రకటించడానికి అలాగే యషువాయే (యేసే) హ మషియాఖ్ (క్రీస్తు) అని వప్పించడానికి వారు యుదుల విశ్రాంతిదినాన్ని యెన్నుకున్నారు. ఈ ప్రయత్నములో వారు సువార్త సకలజనులకు అన్న దేవుని నిత్యసంకల్పాన్ని మరిచిపోయి అన్యులవైపే కన్నెత్తలేదు. దీని పర్యవసానమే యెరుశలేములో ప్రారంభమైన మొదటి శ్రమలు మరియు వాటి ఫలితం విశ్వాసులు అన్యజనులలోకి చెదరిపోవటము (అపొ. కా.8:1). 

9. క్రీస్తుధర్మశాస్త్రములో ఆరాధనదినము: ఇప్పుడు క్రీస్తు యేసు (యషువ మషియాఖ్) నందున్న నిజమైన దేవుని సంబంధులందరు క్రీస్తు నియమము (క్రీస్తుధర్మశాస్త్రము) క్రిందికి వచ్చి (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6) తొమ్మిది ఆజ్ఙలతోపాటు (ప్రకటన 14:7; అపో.కా.15:20; 1తిమోతి.6:1; మత్తయి 15:4-9; ఎఫేసీ.6:1; రోమా.13:8-10) ప్రతిదినము దేవుని సంబంధులందరు విశ్రాంతిని అనుభవిస్తూ పరమతండ్రి సన్నిధిలో జీవిస్తూ ఆయనను సేవించాలి. ఇది కేవలం యేదో ఒక ప్రత్యేకదినాన ఒక ప్రత్యేకమైన స్థలములోమాత్రమే కాదు (యోహాను 4:20-24). దేవుని  సంబంధులందరు ప్రతిదినము ఆత్మీయ విశ్రాంతిని అనుభవిస్తూ ప్రతిస్థలములోనూ (1తిమోతీ.2:8) పరమతండ్రి సన్నిధిలో జీవిస్తూ ఆయనను సేవించాలి. కేవలం శుక్రవారమని లేక శనివారమని లేక ఆదివారమని క్రొత్త నిబంధనానియమము లేక క్రొత్త ధర్మశాస్త్రము సూచించటములేదు. (అపో.కా.2:37-47).

10. విశ్రాంతిదినములో అన్యులపాత్ర: యెషయా గ్రంథములో సబ్బాతు/విశ్రాంతిదినము పాటించే అన్యుల ప్రస్తావనవుంది. అది క్రొత్త నిబంధన లేక యెహోవా రక్షణ రాకముందు వున్న మోషేధర్మశాస్త్రపు కాలానికి సంబంధించిన విశయాలు (యెషయా 56:1). ఆదినాలలో అన్యులలో ఎవరయినా సబ్బాతు/విశ్రాంతిదినాన్ని ఆచరిస్తూ మోషేద్వారా చేయబడిన నిబంధన (పూర్వ/పాత) ఆధారంగా దేవుని పక్షము చేరి ఆయనను హత్తుకొని ఆయన పరిచర్య చేయాలని ఆశిస్తే అలాంటివారు దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తారని, వారి బలులు దేవుడు అంగీకరిస్తాడని, అలాగే వారు దేవుని మందిరములో ఆనందిస్తారని లేఖనాలు ఘోషిస్తున్నాయి (యెషయా 56:6-7). అయితే యిక్కడ మనం గమనములో వుంచుకోవలసిన అతిప్రాముఖ్యమైన విశయమేమిటంటే, పాత నిబంధన కాలములో అంటే మోషేధర్మశాస్త్ర కాలములోకూడా అన్యులకు నిజదేవున్ని తెలుసుకొని ఆయన సన్నిధికి చేరే అవకాశము దేవుడిచ్చాడు (ఉదా.యోబు, తామారు, రాహాబు, రూతు, ఊరియా), కాని వారినికూడా యూదులని/ఇశ్రాయేలీయులని దేవునిప్రజల పేరుతో పిలువలేదు అలా పిలువబడిన సందర్భాలుకూడా యేవీ లేఖనాలలో యివ్వలేదు.

11. దేవునిరాజ్యములో విశ్రాంతిదినము: యెషయా గ్రంథములో క్రొత్త నిబంధన కాలములో లేక దేవుని నిత్య రాజ్యములోకూడా విశ్రాంతిదినాన్ని గురించి ప్రస్తావించబడింది (యెషయా 66:22-24). గమనించాలి, క్రొత్త నిబంధన కాలములో మరిముఖ్యంగా నిత్యరాజ్యములో నిజవిశ్వాసులు లేక దేవుని బిడ్డలు దేవుడు వాగ్ధానము చేసిన ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తారు (హెబ్రీ.4:1-11). కనుక ఆ కాలములో (క్రొత్త నిబంధన) ప్రతిదినమూ సబ్బాతు/విశ్రాంతి దినమే. మూలభాష అయిన హీబ్రూ భాషలో “అమావాస్యదినమునుండి అమావాస్యదినమువరకు, విశ్రాంతిదినమునుండి విశ్రాంతిదినమువరకు నాసన్నిధికి మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు” (యెషయా 66:23) అని వ్రాయబడివుంది. అంటే, పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు అమావాస్య దినాలలో అలాగే విశ్రాంతిదినాలలో మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాదించేవారు, కాని క్రొత్త నిబంధన కాలములో ప్రతిదినము యూదులని యూదేతరులని బేధము లేకుండా దేవుని సన్నిధికి ఆయనను ఆరాధించడానికి వస్తారు అని దాని భావము. 

12. సబ్బాతు (విశ్రాంతిదినాచారము) పట్ల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వైఖరి: తన మరణంద్వారా ప్రారంభించబోతున్న క్రొత్తనిబంధనలోని ప్రత్యేకమైన జీవనవిధానానికి పునాదివేస్తు అందులో భాగంగా ఎన్నో విధులను ఆజ్ఙలను తన బోధలలో అందించాడు. ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవలసిన ఆయన బోధలలోని సబ్బాతుకు సంబంధించిన కొన్ని బోధలు ఈ క్రింద యివ్వబడినవి:

(అ) సబ్బాతు కొరకు మనుషులు నియమించబడలేదు, మనుషులకొరకు సబ్బాతు నియమించబడింది (మార్కు 2:27).

(ఆ) సబ్బాతునాడుకూడా తండ్రి అయిన దేవుడు దొడ్డకార్యాలు (మంచిపనులు) చేస్తున్నాడు, కనుక మనముకూడా మంచికార్యాలు చేయడములో వెనుకంజవేయకూడదు. ఈ కారణాన్ని బట్టే యేసు ప్రభువు సబ్బతునాడుకూడా అనేకులను స్వస్థపరచడం జరిగింది (యోహాను.5:16-17). 

(ఇ) సబ్బాతునాడు యాజకులు దేవాలయములో పనిచేసి సబ్బాతును మీరుతారు, అయినా అది వారివిశయములో అపరాధముగా ఎంచబడదు (మత్తయి.12:15). 

(ఈ)క్రీస్తు సబ్బాతుకు ప్రభువు (మత్తయి.12:8; మార్కు.2:28; లూకా.6:5).   

ఉ) మోషేధర్మశాస్త్రముక్రింద వుండి శాపగ్రస్తులుగా తీర్చబడిన వారిని రక్షించే  నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు తాను కూడా ఈలోకములో ఒక యూదునిగా పుట్టి పెరిగి మోషేధర్మశాస్త్రము క్రింద జీవించి ఆ ధర్మశాస్త్రములోనివన్నిఏ తు.చ. తప్పకుండా పరిపూర్ణంగా పాటించాడు/అనుసరించాడు. అందులో భాగంగా ఆయన సబ్బాతుదినాన్ని ఆచరించాడు. ఇదంతా ఆయన తన మరణముద్వారా క్రొత్తనిబంధనను ప్రారంభించకముందే చేసాడు.                  

విశ్రాంతిదినాన్ని ఆచరించే విశయములో క్రొత్తనిబంధనలో జీవిస్తున్న దేవుని సంబంధికులకు యివ్వబడిన సూచన: ఒకప్పుడు అన్యులుగా వుండి మెస్సయ్య రక్తంతో చేయబడిన క్రొత్తనిబంధన ద్వారా యిప్పుడు దేవుని ప్రజగా మారిన విశ్వాసులైన మిమ్ములను సబ్బాతును (విశ్రాంతిదినాన్ని) ఆచరించే విశయములో తీర్పుతీర్చడానికి యెవనికీ అధికారము యివ్వకూడదు అలాగే యెవనికీ మీరు ఈ విశయములో తీర్పుతీర్చకూడదు (రోమా.14:5-6; గలతీ.4:10; కొలస్సీ.2:13-17).

 • పరుని సేవకునికి తీర్పుతీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒకదినముకంటె మరియొకదినము మంచిదినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకుతానే తనమనస్సులో రూఢిపరచుకొనవలెను. 6 దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు, తిననివాడు ప్రభువు కోసము తినుటమాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రదుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము.” (రోమా.14:4-10)
  [పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు విశ్వాసులలో సంభవిస్తున్న పరస్పర విమర్శలను గురించి మరిముఖ్యముగా దినములను ఆచరించే విశయములో అంటే సబ్బాతును లేక విశ్రాంతిదినాన్ని ఆచరించే విశయములో జరుగుతున్న నిందాప్రతినిందలను గురించి వ్రాస్తున్నాడు. విశ్వాసులలో కొందరు అన్ని దినాలను సమానముగా పరిగణిస్తే కొందరు ఒక దినాన్ని (ఏడవదినాన్ని) ప్రత్యేకముగా లెక్కిస్తున్నారు. రెండువర్గాలుకూడా దేవున్ని ప్రేమించి ఆయనను ఘనపరుస్తూ దినాలవిశయములో తమతమ విశ్వాసాలను ఏర్పరచుకున్నారు. కనుక, వారిని దీవించే విశయములో లేక గద్దించే విశయములో దేవుడే తీర్పరి. ఒకరినొకరు విమర్శిస్తూ తీర్పుతీర్చుకోకూడదు అన్నది పౌలుద్వారా యివ్వబడిన బోధ.]
 • “ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లు కానివారికి దాసులై యుంటిరి గాని యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడినవారునై యున్నారు గనుక, బల హీనమైనవియు నిష్‌ప్రయోజనమైనవియునైన మూల పాఠములతట్టు మరల తిరుగనేల? మునుపటివలె మరల వాటికి దాసులైయుండ గోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీవిషయమై నేనుపడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మునుగూర్చి భయపడుచున్నాను.” (గలతీ.4:8-11)
  [గలతీ ప్రాంతములోని సంఘాలలో చాలామట్టుకు అన్యజనులలోనుండి వచ్చిన విశ్వాసులే. అయితే, ఆ ప్రాంతములో అనేక మంది చెదిరిపోయిన యూదులుకూడా జీవించేవారు (1పేతురు.1:1). వారిలోనుండికూడా అనేకులు యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా రక్షించబడి దేవుని సంఘములో చేర్చబడ్డారు. అలాంటివారు ఇంకా మోషేధర్మశాస్త్ర విధులను అంటే దినములను (అమావాస్యదినములను మరియు విశ్రాంతిదినములను) పండుగదినములను ఆచరించడం కొనసాగిస్తూ వచ్చారు. అలాంటివారినుద్దేశించి పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఒకప్పుడు మోషేధర్మశాస్త్రముయొక్క దాసత్వములో వుండి అటుతరువాత సువార్తను విని క్రీస్తు యేసునందు నిజవిశ్వాసులైన తరువాతకూడా అదే దాసత్వములో కొనసాగుతూవుంటే యిక తాను వారిని క్రీస్తునందు విశ్వాసులుగా చేయటానికి పడిన శ్రమంతా వృధా అవుతుంది అన్నది పౌలు ఆవేధన.]
 • “దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటివిషయములోనైనను, మీకు తీర్పుతీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులోఉన్నది.” (కొలస్సీ.2:14-17)
  [పైలేఖనాల బోధ ప్రకారం నిజవిశ్వాసులు దేవుని మహాగొప్ప కృపనుబట్టి అపరాధముల విశయములో చనిపోయి క్రీస్తుతోకూడా తిరిగి బ్రతికింపబడ్డారు. కనుక, నిజవిశ్వాసులు మోషేధర్మశాస్త్రముయొక్క దాసత్వము క్రింద లేరు యిప్పుడు. వారు క్రీస్తు అధికారముక్రింద జీవిస్తూ క్రీస్తునందున్న ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుభవించే వారు కనుక తమను ఏవ్యక్తీ పండుగ అమావాస్య విశ్రాందినము అనువాటి విశయములో తీర్పుతీర్చడానికి ఒప్పుకోకూడదు. నిజానికి ఒకప్పుడు అవన్నీకూడా రాబోవు వాటికి ఛాయారూపాలే. వాటి నిజస్వరూపం క్రీస్తునందున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ నిజస్వరూపం రెండువేల సంవత్సరాల క్రితమే క్రీస్తు రాకడతో నెరవేర్చబడింది. నిజస్వరూపం ప్రత్యక్షపరచబడిన తరువాతకూడా ఛాయారూపములోనే జీవించడం అన్నది హాస్యాస్పదం అర్థరహితం మరియు గర్హనీయం!]

2 comments

 • యు యోహాను

  చివరకి క్లారిటి ఇవ్వలేదు ఆరాధన దినము: – శనివారమా లేక ఆదివారమా అనేదిచెప్పలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *