సున్నతి సంస్కారము

1. సున్నతి సంస్కారము:బైబిలులోని సున్నతి (హీబ్రూ:מוּל/మూల్=circumcision; గ్రీకు:περιτομή/పెరిటొమె=circumcision) సంస్కారము పురుషుల మర్మాంగము చివరి భాగాన్ని కప్పివుంచే చర్మాన్ని (గోప్యాంగ చర్మము) దేవుడు ఆజ్ఙాపించిన ప్రజలు ఆయన చెప్పిన కారణాన్నిబట్టి ఆయనకు అంగీకారమైన విధానములో తొలగించడము. దీనికి అనుకరణగా ఈనాడు పురుషుల గోప్యాంగ చర్మాన్ని తొలగించే ప్రక్రియను సున్నతిగా పేర్కొంటూ దాన్ని అనేకులు తమ స్వంత కారణాలను బట్టి అనుసరిస్తున్నారు. కొందరు పారంపర్యాచారాలనుబట్టి, కొందరు మతాచారాన్నిబట్టి, మరికొందరు వైద్యుల సలహామేరకు శారీరక ఆరోగ్యపరిరక్షణకొరకు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు.     

2. బైబిలులోని సున్నతి ఆచారము దేవుడే ప్రవేశపెట్టిన పరిశుద్ధ సంస్కారము . అయితే, ఈ ఆచారము దేవుడు నరులందరికీ యిచ్చిన ఆచారము కాదు అన్నది గమనములో వుంచుకోవాలి. పాలస్తీనా దేశాన్ని అబ్రహాముకు మరియు ఆయన సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తానంటూ దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనను చేసి దానికి గుర్తుగా సున్నతి ఆచారాన్ని అబ్రహాముకు ఆయన సంతతికి అలాగే ఆయన ఇంటపుట్టిన వారందరికి నిర్ధేశించాడు (ఆది.కాం.17:1-14).

1 అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెద నని అతనితో చెప్పెను.
అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.
నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజు లును నీలోనుండి వచ్చెదరు.నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. 
నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. 
మరియు దేవుడునీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొన వలెను.  
10 నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగామీలో ప్రతి మగవాడును సున్నతి పొంద వలెను.  
11 మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.  
12 ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.  
13 నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును.  
14 సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను. 

దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనలోని ప్రాముఖ్యమైన అంశాలు:

– దేవుడు అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి చెందించును (ఆది.కాం.17:2)
– దేవుడు అబ్రహామును అనేక జనులకు తండ్రిగా చేయును (ఆది.కాం.17:4-4)
– దేవుడు అబ్రహాముకు సంతానాభివృద్ది కలుగచేయును (ఆది.కాం.17:6)
– దేవుడు అబ్రహాములోనుండి జనములు మరియు రాజులు వచ్చునట్లు చేయును (ఆది.కాం.17:6)
– దేవుడు అబ్రహాముకును అతని సంతానమునకును దేవుడుగా వుండును (ఆది.కాం.17:7)
– దేవుడు అబ్రహాముకును అతని సంతానమునకును యిహలోకములోని కనాను దేశ ప్రాంతాన్ని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చును (ఆది.కాం.15:7, 17-21, 17:8; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)

దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్ధానములోని పై అంశాలన్నీకూడా అబ్రహాము యొక్క శారీరక సంతానమునకే అనువర్తించదగును. ఈ వాగ్ధానము ఇహలోకానికి చెందినది. అందునుబట్టే పాలస్తీనా దేశస్వాస్థ్యపు వాగ్ధానములో పాలుపొందని/పాలుపొందజాలని ఒక్క అన్యుడైనా సున్నతిపొంది దేవునిచేత ఇశ్రాయేలీయునిగా లెక్కించబడ్డ సంఘటన బైబిలులో ఒక్కటికూడా లేదు. ఈ వాగ్ధాన ఫలాలు విశ్వాసముద్వారా అబ్రహాముకు సంతానముగా మారే వారిని వుద్దేశించి యివ్వబడినవి కావు. అలాంటివారికి వర్తించే దీవెనలు ఆశీర్వాదాలు క్రొత్తనిబంధనలో భాగంగా క్రీస్తు యేసునందు అనుగ్రహించబడ్డాయి. అందులో యిహలోకానికి సంబంధించిన కనాను దేశస్వాస్థ్యము అన్నది లేనేలేదు!      

ఈ కారణాన్నిబట్టే అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మరియు ఆయన సంతానమేగాక (ఇశ్రాయేలీయులు) అబ్రహాము యొక్క యితర పుత్రులు మరియు వారి సంతానము కూడా ఈ ఆచారాన్ని పాటిస్తుండటాన్ని ఈనాటికీ చూడగలము. ఇస్సాకుకు వేరుగా వున్న అబ్రహాము సంతానములో హాగరుద్వారా పుట్టిన సంతానము (ఇష్మాయేలీయులు) మరియు కెతూరాద్వారా పుట్టిన సంతానముకూడా (ఏడుగురు కుమారులు) వున్నారు. మధ్య ప్రాశ్చములో (Middle-East) స్థిరపడిన వీరంతా ఇశ్రాయేలీయులు కాదు, వారిమతం జూడాయిజం కాదు. అయినా వీరంతా సున్నతి ఆచారాన్ని పాటించే వారు. చాలామట్టుకు వీరి వంశస్తులు క్రీస్తు శకము 10వ శతాబ్దములోపే ఇస్లాము మతాన్ని స్వీకరించి ముస్లీములుగా మారారు. అయితే ఇస్లాముకంటే ముందు వీరు మధ్య ప్రాశ్చములో విగ్రహారాధికులుగా వుండేవారు. అయినా, ఆసమయములోకూడా వీరు సున్నతి ఆచారాన్ని పాటించేవారన్నది గమనార్హమైన విశయము.

దురదృష్టవశాత్తు కాలక్రమంలో దేవుడు ఆజ్ఙాపించినట్లుగా కేవలం పురుషుల శరీరాలలో జరిగించాల్సిన ఈ సున్నతి ఆచారాన్ని కొన్ని తెగలు మతాలు వక్రీకరించి స్త్రీలకు కూడా చేయడం మొదలు బెట్టాయి. ఈ దైవవ్యతిరేకమైన పోకడ స్త్రీల లైగిక జీవితాన్ని నాశనం చేసే కడునీచమైన దుష్ క్రియ. స్త్రీల సున్నతిని యేనాగరిక సమాజము కూడా సహించకూడదు.   

3. అబ్రహాము యొక్క గొప్పదనాన్ని బట్టి ఆయన జీవించిన ప్రదేశములో అలాగే దాని చుట్టుప్రక్కల స్థిరపడిన ప్రజలు అబ్రహాములా తాముకూడా శారీరక సున్నతిని చేసుకొని దాన్ని పిత్రుపారంపర్యాచారముగా మార్చుకొని పాటించడము మొదలుబెట్టారు. అబ్రహాము యొక్క శారీరక సంతానములో జన్మించకున్నా, దేవుని ఆజ్ఙ తమకు వర్తించకున్నా పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందాన అనేక మతస్తులు దేశస్తులు శారీరక సున్నతిని అబ్రహాము పంథాలో అవలంబించడం ఈనాటికి చూడవచ్చు. అన్య మతాలవారు అన్య వంశాలవారు మాత్రమే కాకుండా విశ్వాసమూలముగా అబ్రహాము సంతానముగా మారిన కొందరు అబద్ద బోధకుల వక్రవ్యాఖ్యానాలకు మోసపోయి తాముకూడా శరీర సున్నతిని పొంది క్రీస్తునుండి పుర్తిగా కొట్టివేయబడి తిరిగి శాపగ్రస్తులుగా మారుతున్నారు (గలతీ.5:2-4). 

4. అబ్రహాముకు రెండురకాల సంతానమున్నట్లుగా బైబిలులోని సాక్షాధారాలను బట్టి గ్రహించగలము. మొదటిది శరీరసంబంధమైన సంతానము. ఈసంతానము అబ్రహాము యొక్క శారీరవంశావళికి సంబంధించిన సంతానము. రెండవది ఆత్మీయసంబంధమైన సంతానము. ఈసంతానము అబ్రహాముకుండిన  విశ్వాసమువంటి విశ్వాసముగలిగి ఆయనకు సంతానముగా లెక్కించబడేవారు (రోమా.4:11).    

అబ్రహాముయొక్క మొదటిసంతానము కేవలం ఇశ్రాయేలీయులుగా (యూదులుగా) పుట్టినవారు. వీరికే శారీరక సున్నతి అన్నది అతిప్రాముఖ్యమైన నిబంధనయొక్క గుర్తుగా యివ్వబడింది. ఇకపోతే, అబ్రహాముయొక్క రెండవసంతానము విశ్వాసులు/పరిశుద్ధులు లేక యేసుక్రీస్తునందు విశ్వాసమువలన దేవుని ప్రజలుగా తీర్చబడినవారు. వీరినే నిజక్రైస్తవులు అనవచ్చు. ఈ సంతానములో యూదుడని యూదేతరుడని, స్త్రీ అని పురుషుడని, లేక దాసుడని స్వతంత్రుడని బేధం లేదు (గలతీ.3:26-29). వీరందరికి అత్మీయ సున్నతి అన్నది నూతననిబంధనకు గుర్తుగా యివ్వబడింది (కొలస్సీ. 2:11).             

అబ్రహాముకు ముందుతరాలలో జీవించిన  నోవహు, హానోకు, హేబేలు వంటి భక్తులకు విశ్వాసులకు దేవుడు సున్నతి ఆచారాన్ని సూచించలేదు. కనుక వారు సున్నతి సంస్కారమును ఎరిగినవారు కాని లేక పాటించినవారు కాని కాదు. ఈ వాస్తవాన్నిబట్టి ఆకాలములోని దైవజనులు శారీరక సున్నతి లేనివారు అన్నదికూడా మనం మరచిపోకూడదు.     

5. అబ్రహాముతో నిబంధన చేసిన దాదాపు నలుగువందల సంవత్సరాల తరువాత దేవుడు మోషేద్వారా అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగముతో మరొక  నిబంధనను చేస్తూ అందులోని నియమాలలో భాగంగా సున్నతి ఆచారాన్ని తిరిగి పేర్కొనడం జరిగింది. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు అబ్రహాము-నిబంధన (Abrahamic Covenant) ప్రకారము అలాగే మోషే-నిబంధనలో (Mosaic Covenant) భాగమైన మోషేధర్మశాస్త్రము (Law of Moses) ప్రకారము తమ పిల్లలకు ‘ఎనిమిదవ దినాన’ సున్నతి జరిగించాలన్నది దేవుని ఆజ్ఙ మరియు విధి (లే.కాం.12:3).    

6. తనాక్ లేక పాతనిబంధన గ్రంథమంతటిలో అన్యులకు లేక అన్యులలోనుండి యూదా మతములో చేరినవారికి సున్నతి ఆచారాన్ని పాటించాలన్న ఆజ్ఙ కాని లేక సున్నతి ఆచారాన్ని పాటించిన వైనాలు కాని మచ్చుకు ఒక్కటైనా కానరావు. అయితే, నిర్గమాకాండము 12:43-49 వరకుగల లేఖనాల ప్రకారం వెండితో కొనబడిన దాసులు అలాగే ఇశ్రాయేలీయుల మధ్య వారి దేశములో నివసిస్తున్న పరదేశీయులు ఒకవేళ పస్కా పండుగను ఆచరింప గోరినయెడల అలాంటివారు మొదట సున్నతి (శరీర) పొంది తద్వారా ఇశ్రాయేలీయుల సమాజములో చేరి వారితోపాటు పస్కాను ఆచరింపవచ్చు. 

ఉదాహరణకు, సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను యెహోవా ప్రవక్త అయిన ఎలీషా మాటచేత కుష్ఠరోగము నుండి స్వస్థత పొంది ఎలీషా దేవుడైన యెహోవాను విశ్వసించాడు. అయితే, నయమాను ఇశ్రాయేలీయుల దేశములో వారిమధ్య నివసించలేదు. కనుక, నయమానులాంటి విశ్వాసులకు సున్నతి నియమము యివ్వబడలేదు (2రాజులు.5:1-19). బబులోనులోని పారసీక దేశపు రాజు కోరెషు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను విశ్వసించాడు మరియు దేవునిచేత “అభిషిక్తుడు” అని గుర్తించబడ్డాడు అంతేకాక యెరూషలేములోని దేవుని మందిరము మరల కట్టబడుటకు దేవునిచేత వాడబడ్డాడు. అయినా, రాజైన కోరెషు దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధానము ద్వారా స్వాస్థ్యముగా యిచ్చిన పాలస్తీనాలో ఇశ్రాయేలీయుల మధ్య నివసించలేదు. కనుక, రాజైన కోరెషు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను విశ్వసించి సేవించినా అతడు సున్నతి పొంది ఇశ్రాయేలీయుడుగా మారలేదు (2ది.వృ.36:22-23; ఎజ్రా 1:1-4,7-8, 5:13-15, 6:3-5; యెషయా.44:28, 45:1).

దేవుడు అన్యజనులకు లేక అన్యజనులలోనుండి వచ్చినవారికి ఆజ్ఙాపించనిదాన్ని మరియు నిర్దేశించనిదాన్ని ఒక ఆజ్ఙగా బోధించడమైనా లేక ఆచరించడమైనా లేఖనవిరుద్దమైన పాపానికేకాకుండా దైవోగ్రతకుకూడా దారితీస్తుంది అన్నది దైవసంబంధులు గమనములో వుంచుకోవాలి. 

7. దేవునిదృష్టికి హృదయసున్నతి లేక ఆత్మీయసున్నతి లేనివారు అసహ్యులు. అలాంటివారిని ఆయన శిక్షించబోతున్నాడు అన్న వాస్తవాన్ని లేఖనాలు ప్రస్పుటంగా పేర్కొంటున్నాయి:

“అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయసంబంధమైన సున్నతినొందినవారు కారుగనుక, రాబోవుదినములలో సున్నతి పొందియు సున్నతిలేనివారివలె నుండుఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపుప్రక్క లను కత్తిరించుకొను అరణ్యనివాసులైన వారినందరిని నేనుశిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయా.9:25-26) 

“బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడుకాడు; శరీరమందు బాహ్యమైనసున్నతి సున్నతికాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయసంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు.” (రోమా.2:28-29)

8. లేఖనాల సాక్షాన్ని బట్టి దేవుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకములోకి శరీరధారిగా వచ్చిన సందర్భములో సున్నతి సంస్కారాన్ని అనుభవించినట్లు గ్రహించవచ్చు. ఒక యూదు కుటుంభములో జన్మించి ఒక యూదు మగశిశువుగా వుండిన అతనికి తల్లిదండ్రులు ఎనిమిదవదినాన్న సున్నతి జరిగించినట్లు గ్రహించాలి (లూకా 2:21). అయితే, ఇశ్రాయేలీయుల మధ్య ఒక యూదుడిగా పుట్టిన కారణమే కాకుండా తాను మోషేధర్మశాస్త్రమనే కాడీక్రింద వుండి అందులో తాను పాటించాల్సినదంతా పరిపూర్ణముగా పాటించి దాని క్రింద వుండి శాపగ్రస్తులుగా వున్నవారిని విమోచించడానికి దేవుని బృహత్తర ప్రణాలికలోని భాగంగా కూడా ఆయనకు సున్నతి జరిగినట్లు మనం గ్రహించాలి (గలతీ.4:4-5).

“ఎవడైనను అన్యాయ ముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిద మునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి.క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకుమాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” (పేతురు. 2:19-23)

“ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగునడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.” (1యోహాను.2:4-6) 

పై రెండు వాక్యభాగాల ఆధారంగా క్రొత్తనిబంధనలోకూడా యేసుక్రీస్తునందు విశ్వసముద్వారా దేవుని సంబందులుగా మారిన విశ్వాసులు/క్రైస్తవులు యేసు ప్రభువును వెంబడిస్తూ ఆయన ఏవిధంగా మోషేధర్మశాస్త్రము ప్రకారము నడుచుకొని అందులో భాగంగా తన శారీరములో సున్నతి పొందాడో అదేవిధంగా శారీరక సున్నతి పొందాలి అంటూ వాదిస్తున్నారు బోధిస్తున్నారు. ఇది వాక్యానుసారమైన సద్బోధ కాదు! 

గమనించండి, పైవాక్యభాగాలలో సూచిస్తున్నదాని ప్రకారము యేసుక్రీస్తును పోలి నడుచుకోవడము లేక జీవించడము అంటే యేమిటి…?

  • ఆయనలా ఇశ్రాయేలీయుల మధ్య పుట్టి పెరగటమా…?
  • ఆయనలా మోషేధర్మశాస్త్రము క్రింద జీవించి దాన్ని పరిపూర్ణముగా అనుసరించటమా…?
  • ఆయనలా సున్నతి పొందటమా…?
  • ఆయనలా అవివాహితునిగా వుండటమా…?
  • ఆయనలా ఇశ్రాయేలీయుల మధ్యే దేవునివాక్యం ప్రకటించడమా…?
  • ఆయనలా సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి పండుగలను ఆచరించటమా…? 
  • ఆయనలా వేశధారులైన యూదామతాదికారులను అంటే శాస్త్రులను పరిసయ్యులను ఎండగడుతూ వుండటమా…?

ఆయన పైవన్నీ చేసాడు! మరి యివన్నీ ఆయన మాదిరినిబట్టి ఈలోకములో జీవించడానికి పాటించాల్సిన అవసరం లేదా?! లేదని లేఖనాల వెలుగులో ఖచ్చితంగా చెప్పవచ్చు. పైన యివ్వబడిన రెండు లేఖనసందర్భాలను జాగ్రత్తగా పరిశీలించిచూస్తే ‘తనను హింసించిన వారినికూడా క్షమిస్తూ ఏపాపము లేకుండా జీవించిన యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూ మన శత్రువులనుకూడా క్షమించి ప్రేమించాలని అలాగే ఆయన యిచ్చిన ఆజ్ఙలను (ఉదాహరణ: యోహాను 13:34) పాటించాలి’ అన్నది ఈ వాక్యాల ప్రబోధ.

యేసు క్రీస్తు మాత్రమే కాకుండా ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు జీవించి శిక్షణ పొందిన పన్నెండ్రుగురు శిష్యులుకూడా యూదులైవుండి యూదుల ఆచారము ప్రకారం లేక మోషేధర్మశాస్త్రము యొక్క నియమము ప్రకారం సున్నతి పొందినవారేనన్నది ఈ సందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి.  

9. యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క ఉపదేశము/బోధ/తోరా (యెషయా.42:4; గలతీ.6:2): మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు గల లేఖనాలు

“నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” (మత్తయి.28:20)

“ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.” (యోహాను.14:26)

యేసు క్రీస్తు తన బోధలో సున్నతి పొందాలి అంటూ ఆజ్ఙాపించాడా…? 

ఆజ్ఙాపించలేదు!

ఒకప్పుడు అన్యులుగా జీవించి అటుతరువాత సువార్తవిని యేసు క్రీస్తునందు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడి దేవుని ప్రజలలో చేర్చబడిన తరువాత వారు రక్షణలో కొనసాగడానికి శరీరసున్నతిని కూడా పొందాలి అని ఎక్కడైనా సూచించబడిందా…? 

బైబిలులో లేదు!

10. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తరక్తముద్వారా ప్రారంభించబడిన క్రొత్తనిబంధనలో ప్రవేశించినవారివిశయములో మాత్రము శారీరక సున్నతికి ఇక ఏ ఆత్మీయ మేలుతోకూడా సంబంధము లేదన్నది గ్రహించాలి. ఈ విషయములో లేఖనాలు స్పష్టమైన మరియు ఖచ్చితమైన వివరణ అందిస్తున్నాయి. (1కొరింథీ.7:17-19; గలతీ.5:6) 

“సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతిపోగొట్టుకొన వలదు; సున్నతి పొందని వాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు.”
(1కొరింథీ.7:18)
[ఈ వాక్యము ఒక అవిశ్వాసి అయిన వ్యక్తి ఏరకంగా విశ్వాసిగా మారి రక్షణపొందగలడోనన్నది వివరిస్తూ ఆ వ్యక్తి సున్నతిపొందని వ్యక్తి అయితే అలాంటివ్యక్తి విశ్వాసములోకి ప్రవేశించి రక్షణపొందినతరువాత కూడా సున్నతి పొందని స్థితిలోనే కొనసాగలి అని బోధిస్తున్నది] 

యేసుక్రీస్తునందుండువారికి సున్నతి పొందుటయందేమియులేదు, పొందకపోవుటయందేమియు లేదుగాని ప్రేమవలన కార్యసాధకమగువిశ్వాసమే ప్రయోజనకరమగును.” (గలతీ.5:6)
[ఈ వాక్యము నిజవిశ్వాసులైనవారు సున్నతిపొందుట లేక పొందకపోవుట వారి అత్మీయ స్థితిలో ఏ వ్యత్యాసాన్ని కలుగజేయదన్న సత్యాన్ని బోధిస్తున్నది]  

“క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతిపొందుటయందేమియులేదు, పొందకపోవుటయందేమియులేదు.” (గలతీ.5:6)
[ఈ వాక్యము కూడా నిజవిశ్వాసులైనవారు సున్నతిపొందుట లేక పొందకపోవుట వారి అత్మీయ స్థితిలో ఏ వ్యత్యాసాన్ని కలుగజేయదన్న సత్యాన్ని బోధిస్తూ నిజవిశ్వాసులు క్రొత్తసృష్తిగా మారడమే అతి ప్రాముఖ్యమైన విశయమంటూ నొక్కి వక్కాణిస్తున్నది]

“మీరును, క్రీస్తుసున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.” (కొలస్సీ. 2:11)
[ఈ వాక్యము నిజవిశ్వాసులైనవారు క్రీస్తు యేసు తాను శారీరమందు పొందిన సున్నతిని బట్టి అలాగే తాము పాతజీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తదైన పరిశుద్ధజీవితములో కొనసాగుతుండటాన్ని బట్టి చేతులతో చేయబడని ఆత్మీయ సున్నతిని పొందియున్నారు అంటూ బోధిస్తున్నది]

ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతనపరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతిపొందకపోవుటయని భేదములేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.” (కొలొస్సీ.3:8-11)
[ఈ వాక్యము బోధిస్తున్నదాని ప్రకారము క్రీస్తు యేసునందున్న నిజవిశ్వాసులు పాతదైన అపవిత్ర జీవితాన్ని వదిలి క్రొత్తదైన పరిశుద్ద జీవితాన్ని జీవిస్తూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు స్వారూప్యములో ఎదుగుతునారు. అల అంటివారి విశయములో యూదుడని లేక అన్యుడని, దాసుడని లేక స్వతంత్రుడని, సున్నతిపొందినవాడని లేక సున్నతిపొందనివాడని ఏబేధము లేదు. అందరూ సమానులే, ఎందుకంటే అందరిలో వున్నది క్రీస్తే!]

11. ఈ క్రొత్తనిబంధన కాలములో సున్నతి (శారీరక) పొందితేనేగాని రక్షణపొందలేరు అని బోధిస్తున్నవారు అబద్దబోధకులు. అలాంటివారు బైబిలు బోధలకు వ్యతిరేకులు. ఇలాంటి బోధలు దైవలేఖనాలకు విరుద్ధమైన దుర్బోధలు.
(అపో.కా.15:1-35; రోమా. 2:25; గలతీ.2:3-5, 5:1-4,10-12, 6:12-15; ఫిలిపీ.3:1-11; తీతుకు.1:10-11) 

 “కొందరు యూదయనుండి వచ్చి మీరు మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనేగాని రక్షణపొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహో దరులు నిశ్చయించిరి…” (అపో.కా.15:1-6)

మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని కొందరు బోధించడం ప్రారంభించారు. వీరు నిజమైన విశ్వాసులు కాదు, కపట సోదరులు. వీరు దొంగతనముగా విశ్వాసులమధ్య ప్రవేశించారన్న విశయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీయలోని విశ్వాసులకు వ్రాస్తూ పేర్కొన్నాడు (గలతీ.2:4). వీరుచేస్తున్న దుర్బోధను వ్యతిరేకిస్తూ పౌలు మరియు బర్నబాలిరువురూ వారితో వాదించడము జరిగింది. ఇదే సందర్భములో కొందరు యూదామతములోని పరిసయ్యుల తెగలోనుండి వచ్చిన విశ్వాసులుకూడా లేచి అన్యులలోనుండి మెస్సయ్యద్వారా విశ్వాసులుగా మారినవారు సహితం సున్నతిని పొంది మోషేధర్మశాస్త్రమును అనుసరించాలని ప్రతిపాదించారు. 

గమనించాలి, ఇక్కడ ప్రతిపాదించబడుతున్న రెండు విశయాలుకూడా అదివరకు యెవరూ అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు బోధించలేదు వారు వాటిని పాటించనూ లేదు (అపో.కా.8:1-17, 10:45). ఈ అంశాలనుగురించిన తగాదా సంఘ చరిత్రలోనే మొట్టమొదటి క్రైస్తవనాయకుల సమావేశము చోటుచేసుకోవడానికి దోహదపడింది. చివరికి, ఆ సమావేశపు తీర్మానములో అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులు యూదులనుసరిస్తున్నవాటిలోని కేవళము మూడింటిని మాత్రము పాటించాలని నిర్ధారించారు. అందులో శారీరసున్నతిని పొందటము మరియు మోషేధర్మశాస్త్రమును గైకొనడము అన్న రెండింటిని సంపూర్ణముగా తొలగించేసారు (అపో.కా.15:28-29). అంతేకాక, ఆ సమావేశ నాయకులు ‘సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని’ బోధించి విశ్వాసులను కలవరపెట్టిన కపటసోదరులను తాము పంపలేదు కనుక వారి మాటలకు తలవంచొద్దన్న హితోపదేశము అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు చేసారు (అపో.కా.15:24). ఇది నిజ విశ్వాసులకివ్వబడిన అపోస్తలుల బోధ మరియు మాదిరి! దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు లేక బోధించేవాడు అబద్ధ బోధకుడు మరియు నీతి విరోధి. 

12. అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలు క్రొత్తనిబంధనలో పాలుపొందే విశ్వాసులు రక్షణపొందుటకై శరీరసున్నతి పొందకూడదు అని సవివరమైన సమగ్ర బోధను అందిస్తున్నాయి. అయితే, కొందరు నీతివిరోధులు వాటిని వక్రీకరిస్తున్నారు. పౌలుద్వారా యివ్వబడిన లేఖనాల వక్రీకరణనుగూర్చి పేతురుద్వారా యివ్వబడిన లేఖనాలు ముందే హెచ్చరించాయి:

మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును [ గ్రీకు: ἀμαθής/అమథెస్=నేర్చుకోనటువంటి], అస్థిరులైనవారును [గ్రీకు: ἀστήρικτος/ఆస్టెరిక్టోస్=స్థిరత్వములేనటువంటి], తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి. (2పేతురు.3:15-17)  

శరీరసున్నతిని గురించి పౌలుద్వారా యివ్వబడిన లేఖనాల సమగ్ర బోధ: 

“నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీసున్నతి సున్నతికాకపోవును.” (రోమా. 2:25)
[మోషేధర్మశాస్త్రాన్ని తప్పిపోకుండా పాటించే వ్యక్తి సున్నతి పొందితే ప్రయోజనకరంగా వుంటుంది. అలా కాకుండా ఒకవైపు మోషేధర్మశాస్త్రాన్ని మీరుతూ మరొకవైపు సున్నతిని పొందితే దానివలన ఏ ప్రయోజనమూ వుండదు అన్నది ఇక్కడ పౌలుద్వారా చెప్పబడుతున్న బోధ]

“అటుపిమ్మట పదునాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతోకూడ యెరూష లేమునకు తిరిగి వెళ్లితిని. దేవదర్శన ప్రకా రమే వెళ్లితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవు నేమో, లేక వ్యర్థమై పోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని ప్రత్యేకముగా ఎన్నికైనవారికిని విశదపరచితిని. అయినను నాతోకూడనున్న తీతు గ్రీసుదేశస్థుడైనను అతడు సున్నతిపొందుటకు బలవంతపెట్టబడలేదు.” (గలతీ.2:1-3)
[అపోస్తలుడైన పౌలు అన్యజనులకు సువార్తను ప్రకటించడము మొదలుబెట్టాడు. దాని ఫలితంగా తీతు అనే అన్యుడు రక్షించబడ్డాడు. పౌలు ఈ అన్యజాతిలోనుండి విశ్వాసిగా మారిన తీతును తీసుకొని యెరూషలేముకు వెళ్ళి అక్కడి సంఘ పెద్దలకు అతడిని పరిచయంచేసి అన్యులలో జరుగుతున్న సేవను గురించి వివరించాడు. అది విని సున్నతిలేని తీతును చూసిన సంఘ పెద్దలు అతడు విశ్వాసములోకి వచ్చాడు కనుక ఇప్పుడు అతడు రక్షణలో కొనసాగటానికి సున్నతి పొందాలి అంటు అతన్ని కోరలేదు]

“ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరలదాస్యమనుకాడిక్రింద చిక్కుకొనకుడి. చూడుడి; మీరు సున్నతి పొందినయెడల క్రీస్తువలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింప బద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మను ష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు.” (గలతీ.5:1-4)
[గలతీయులకు వ్రాసిన పత్రికలోని 4వ అధ్యాయములో ధర్మశాస్త్రమునకు లోబడియుండాలని కోరుతున్న వారికి అది దాసత్వమని క్రీస్తునందున్నవారు ఆ దాసత్వములోనుండి విడిపించబడి స్వతంత్రులుగా చేయబడ్డారన్నది వివరించి 5వ ధ్యాయములో తిరిగి ఆ దాసత్వము క్రిందికి అంటే ధర్మశాస్త్రము క్రిందికి వెళ్ళొద్దు అని బుద్దిచెపుతున్నాడు. అందులో భాగంగా ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నముతో సున్నతిని పొందవద్దని బోధిస్తున్నాడు. అలా చేసే వారు క్రీస్తునుండి తొలగించబడటమేగాక వారు ధర్మశాస్త్రము అంతటిని తు.చ. తప్పకుండా పాటించాల్సిన ఆవశ్యకత వుంది అంటూ హెచ్చరిస్తున్నాడు.]

“మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మునుగూర్చి నేను రూఢిగా నమ్ముకొను చున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును.సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువవిషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? మిమ్మును కలవరపెట్టువారు తమ్మునుతాము ఛేదించుకొనుట మేలు.” (గలతీ.5:10-12)
[గలతీయులకు వ్రాసిన పత్రికలోని 4వ అధ్యాయములో ధర్మశాస్త్రమన్నది దాసత్వానికి సాదృశ్యమని వివరించి 5వ అధ్యాయములో ధర్మశాస్త్రాన్ని పాటించడములో భాగంగా సున్నతిని పొందకండి అంటూ బోధిస్తూ పై వాక్యాలలో తాను యూదులకు సువార్తను ఏరకంగా ప్రకటిస్తున్నాడో తద్వారా తాను ఏరకమైన బాధలు పడుతున్నాడో వివరిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించనవసరము లేదు అలాగే దాన్ని పాటించే ప్రయత్నములో సున్నతిని పొందనవసరముకూడా లేదు అని అపోస్తలుడైన పౌలు యూదులకు బోధిస్తుండటాన్ని బట్టే యూదులు పౌలును హింసించారు. అలా కాకుండ ఒక వేళ పౌలు సువార్తను ప్రకటిస్తూ మోషేధర్మశాస్త్రాన్ని అనుసరించండి అలాగే సున్నతినికూడా పొందండి అని బోధించడం ప్రారంభిస్తే అతడికి యూదులనుండి హింసలుండేవి కావు! అయితే కొందరు కపట సోదరులు/విశ్వాసులు ఈ పంథాలో క్రీస్తును ప్రకటిస్తూ యూదులనుండి వచ్చే హింసలబారినుండి తమను తాము కాపడుకుంటున్నారు అన్నది పౌలు 6వ అధ్యాయములో తెలియచేస్తున్నాడు]

“శరీరవిషయమందు చక్కగా అగపడగోరువారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువవిషయమై హింసపొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలెనని మిమ్మును బలవంతము చేయుచున్నారు.అయితే వారు సున్నతిపొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు; తాము మీశరీరవిషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతిపొందవలెనని కోరుచున్నారు.” (గలతీ.6:12-13)
[కపట సోదరులు/విశ్వాసులు తాము ప్రకటిస్తున్న సువార్త విశయములో యూదులనుండి తమకు ఏసమస్యా రాకుండుటకై తాము సున్నతిని పొంది క్రొత్తగా అన్యజనులలోనుండి విశ్వాసములోకి వచ్చిన వారిని కూడా సున్నతి పొందండి అంటూ బలవంతము చేస్తున్నారు. సున్నతిని పొందినవారు మోషేధర్మశాస్త్రము అంటటిని తప్పిపోకుండా పాటించాలి. అయితే, ఈ కపట సోదరులు/విశ్వాసులు తాము సున్నతిని మాత్రము పొంది ధర్మశాస్త్రమును పాటించడము వదిలేసారు. వీరు బోధిస్తున్నది పాటిస్తున్నది పౌలు బోధిస్తున్నదానికి పూర్తిగా వ్యతిరేకమైనది.] 

కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైనపనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదననాచరించువారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదముచేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.” (ఫిలిపీ.3:2-3)
[లేఖనాల బోధ ప్రకారం నిజమైన సున్నతి హృదయసున్నతి. శరీరసున్నతిపై ఆధారపడకుండా పరిశుద్ధాత్మతో ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయిస్తూ జీవిస్తున్న వారే నిజమైన సున్నతి ఆచారాన్ని పాటిస్తున్నవారు అన్నది అపోస్తలుడైన పౌలుద్వారా యివాబడిన పై లేఖనాల బోధ. అయితే, దీనికి వ్యతిరేకంగా బోధిస్తున్నవారు దుష్టబోధకులు. వారు కుక్కలతో సమానులు. అలాంటివారికి దూరంగా వుండండి అని పై లేఖనాల ఉవాచ.]

“అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునైయున్నారు. వారి నోళ్లుమూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.” (తీతుకు.1:10-11)
[పై లేఖనాలలో అపోస్తలుడైన పౌలు సున్నతి సంబంధులు అంటే సున్నతి పొందాలి అంటు అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు బోధిస్తూ వారిని కలవర పెట్టి అపోస్తలుల బోధకు విరుద్ధంగా శరీరసున్నతిని పొందేటట్లు చేస్తున్న వారు మోసపుచ్చే వారు అని వివరిస్తూన్నాడు. అలాంటివారు తాము అపోస్తలుల బోధకు అవిధేయులుగా వుండటమేగాక తమ మాటకారితనముచేత అనేకులను మోసపుచ్చుతూ కుటుంబాలకు కుటుంబాలనే విశ్వాసబ్రష్టులనుగా చేస్తున్నారంటూ హెచ్చరిక ఇస్తున్నాడు. (ఈ కోవకు చెందిన మోసగాళ్ళు ఈ దినాలలో అనేకులు బయలుదేరారు తెలుగు క్రైస్తవుల మధ్య)]

తమ గారడీమాటలతో వక్రవ్యాఖ్యానాలతో అమాయక క్రైస్తవులను మభ్యపెట్టి వారిని శారీరక సున్నతిని పొందేటట్లు చేసి తద్వారా వారిని క్రీస్తునుండి వేరుచేసే దుర్భోధకులు ఈనాడు అనేకులు లోకములో బయలుదేరారు. అలాంటి అబద్ధబోధకులను పరిశుద్ధ లేఖనాలు ‘సున్నతి సంబంధులు,’ ‘కపటసోదరులు,’ ‘విశ్వాసులను కలవరపెట్టే వారు,’ ‘అవిధేయులు,’ ‘వదరుబోతులు,’ ‘మోసపుచ్చువారు,’ ‘దుష్టులైన పనివారు,’ ‘శరీరమును ఆస్పదముచేసుకొనేవారు,’ ‘దుర్లాభముకొరకు ఉపదేశించేవారు,’ ‘కుక్కలు’ అంటూ వారికి తగిన విశేషణ నామాలతో గుర్తిస్తున్నది. అలాంటివారికి వారి బోధలకు నిజవిశ్వాసులు దూరంగా వుంటూ తాము క్రీస్తు యేసునందు కేవళము విశ్వాసముద్వారా దేవుని కృపచేత పొందిన రక్షణలో కొనసాగాలన్నది లేఖనాల బోధ.

13. అపోస్తలుడైన పౌలు కూడా  ఒక యూదునిగా ఎనిమిదవ దినాన సున్నతి పొందిన వ్యక్తి (ఫిలిప్పీ.3:5). తాను ప్రభువైన యేసే (యషువ) క్రీస్తు (మషియాఖ్) అని గ్రహించి ఆయనయందు విశ్వాసముద్వారా క్రొత్తనిబంధనలోకి ప్రవేశించిన తదుపరి ఒకానొక సందర్భములో తాను సువార్త ప్రకటించగా రక్షించబడిన యువవిశ్వాసి తిమోతికి సున్నతి చేయించడము జరిగింది. ఇందుకుగల కారణమేమిటి? దీని పర్యవసానమేమిటి? ఇది రక్షణపొందటానికా లేక రక్షణలో కొనసాగటానికా?  

పౌలు ఈవిధంగా చేయడముద్వారా క్రీస్తు యేసునందు విశ్వాసముద్వారా రక్షించబడిన వ్యక్తి ‘శరీరములో సున్నతినికూడా పొందాలి’ అనిగాని లేక ఆ వ్యక్తి ‘సున్నతి పొందితేనేగాని రక్షణ నిలుపుకోలేడు’ అనిగాని చూపించే ప్రయతనము చేయడము లేదు. అయితే, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే పౌలు ఆవిధంగా చేయడానికిగల కారణముకూడా అక్కడే వ్రాయబడి వున్న విషయాన్ని గమనించగలము.  

“పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు…అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతిచేయించెను.” (అపో.కా.16:1…3)

‘వారినిబట్టి’ అన్నది ఇక్కడ అసలు కారణము.

గ్రీసుదేశస్థుని కుమారుడైన తిమోతి సున్నతిని పొందకుండిన స్థితిలోనే మెస్సయ్య అయిన యేసు (యషువ) నందు విశ్వాసముంచి రక్షణపొంది శిష్యుడిగా మారాడు. విశ్వాసజీవితములో ఎదుగుతూ యితరవిశ్వాసులచేత మంచిపేరుకూడా సంపాదించాడు. అయినా ఆసమయములో సున్నతి పొందలేదు. అక్కడున్న విశ్వాసులెవరూ తిమోతిని సున్నతి పొందమంటూ బలవంతముచేయలేదు సూచించనూలేదు. అపోస్తలుడైన పౌలు తిమోతి వుంటున్న ప్రాంతానికి వచ్చిన సందర్భములో తిమోతిని తనతోకూడా పరిచర్య నిమిత్తం తీసుకొని వెళ్ళాలని ఆశించాడు. కాని, గ్రీసుదేశస్థుని కుమారుడైన తిమోతికి సున్నతి లేదన్న సంగతి ఆ ప్రాంతములోని యూదులకు తెలుసు. వారినిబట్టి అంటే ఆప్రాంతములోని యూదులకు తిమోతికి సున్నతి లేకపోవడమన్నది ఒక అభ్యంతరకారణముగా వుండకూడదని తిమోతికి సున్నతి చేయించాడు పౌలు. దీనిద్వారా పౌలుకు మరియు పౌలుతోపాటు పరిచర్యలో పయనించిన తిమోతికి యూదులమధ్యకు నిరాటంకంగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించడానికి వీలయ్యింది. అంతేగాని రక్షణపొందటానికో లేక రక్షణలో కొనసాగటానికో తిమోతికి పౌలు సున్నతి చేయించలేదు.    

ఈ సందర్భంగా మనం జ్ఙాపకము చేసుకోవలసిన లేఖన సత్యాలు, “యేసుక్రీస్తునందుండువారికి సున్నతిపొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు” (గలతీ.5:6, 6:15) మరియు “యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని” (1 కొరింథీ.9:20). ఇవి అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన దైవసందేశాలు. వీటి సమిష్టి తాత్పర్యము పౌలు తిమోతికి చేయించిన సున్నతిని తప్పుబట్టడములేదు అన్నది విజ్ఙులు మరియు దైవసంబంధులు గ్రహించగలరు.  

14. “నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పు చున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి. మరియు యూస్తు అను యేసుకూడ మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతిపొందినవారిలో చేరిన వారు, వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.” (కొలొస్సీ.4:10-11)

పై వాక్యాన్ని కొందరు సున్నతిసంబంధులు తాము అపార్థము చేసుకోవడమేగాక యితరులకు వక్రభాశ్యాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజవిశ్వాసులు ఈవిశయములో అప్రమత్తులుగా వుంటూ అబద్ధబోధకులకు ఆవేశాలకుగాక లేఖనాధారమైన సత్యాన్వేషణకే పెద్దపీట వేయాలి.  

పేతురు సున్నతిగలవారికి అంటే యూదులకు సువార్తను ప్రకటిస్తుండగా పౌలు సున్నతిలేనివారికి అంటే అన్యులకు లేక యూదేతరులకు సువార్తను ప్రకటించే పిలుపును అందుకున్నాడు (గలతీ.2:7). ఈరకంగా క్రీస్తు యేసునందు మానవాళికనుగ్రహించబడిన దేవుని సువార్తను అందరికీ అందించే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈప్రయత్నములో పౌలుకు సహకరించిన వారిలో ఒకప్పుడు యూదామతములో (జుడాయిజం) వుండిన కొందరు సువార్త సత్యాన్ని విని, గ్రహించి, దానిలో విశ్వాసముంచడముద్వారా రక్షించబడి పౌలు చేస్తున్న పరిచర్యకు సహకరించడం మొదలుబెట్టారు. వీరంతా యుదులు కాబట్టి శారీర సున్నతి పొందియున్నవారు. పౌలుకు సువార్తపరిచర్యలో సహకరిస్తున్నవారిలో కేవళము యూదులేకాదు యూదేతరులుకూడా వున్నారు. అయితే, పౌలు చేస్తున్న సువార్తపరిచర్యలో ఒకప్పుడు యూదమతస్తులైవుండి యేసుక్రీస్తు శిష్యులుగా మారుతున్న వారిసంఖ్య రానురాను తగ్గిపోతూ యూదేతరులలోనుండి విశ్వాసములోనికి వస్తున్నవారి సంఖ్య పెరగడము ప్రారంభించింది. ప్రత్యేకించి రోములోని ఈ పరిస్థితిని ప్రతిబింభిస్తూ పౌలు పై మాట చెప్పడము జరిగింది. 

ఆయాప్రాంతాలలో పౌలుతో కలిసి పనిచేస్తున్న వారిలో సున్నతి పొందినవారు అంటే యూదామతములోనుండి వచ్చినవారు వున్నారు అలాగే సున్నతిపొందనివారు అంటే అన్యులుకూడా వున్నారు. పౌలు రోములోని చెఱసాలలోనుండి కొలొస్సీలోని విశ్వాసులకు వ్రాస్తూ తానున్న పరిస్థితిలో దేవునిరాజ్య విస్తరణ విశయములో తనకు రోములో సహాయం చేస్తున్న వారు కొలస్సీ.4:10-11 వరకు పేర్కొన్న దాని ప్రకారం యూదా మతములోనుండి వచ్చిన విశ్వాసులు మాత్రమే అని సూచిస్తున్నాడు. గమనించాలి, అన్నిస్థలాలలో తనతో కలిసి పరిచర్యలో పాలుపొందుతున్నవారంతా సున్నతిపొందినవారేనని ఇక్కడ పౌలు చెప్పడము లేదు. ఇది కేవళం రోములో పౌలు చెఱసాలలోవున్నప్పటి పరిస్థితిని గురించిన వివరణ.  

15. యెహెజ్కేలు-మూడవమందిరము: కొందరు యెహెజ్కేలు గ్రంథములోని 44:7-9 వచనాలను రాబోవు కాలములో యెరూషలేము నగరములో మూడవ మందిరము కట్టబడిన సందర్భాన్ని సూచిస్తున్నవంటూ తప్పుడు భాష్యం చెపుతారు. 

“ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి. ​నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాహృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.”

సొలోమోను కట్టించిన మొదటి మందిరం 586 క్రీ.పూ. లో బబులోను రాజైన నెబుకద్నెజర్ సైనికులచేత నాశనం చేయబడింది. ప్రవక్త అయిన యెహెజ్కేలు 622 క్రీ.పూ. – 550 క్రీ.పూ. మధ్య జీవించాడు. తాను బబులోను చెరలో జీవిస్తూ అక్కడి యూదులమధ్య దేవుని వాక్యం ప్రకటిస్తూ వచ్చాడు. ఆ సందర్భములోనే యెహెజ్కేలు 44 వ అధ్యాయము వ్రాయబడింది. అప్పుడు యెరూషలేములో దేవుని మందిరము లేదు. 516 క్రీ.పూ. లో జెరుబ్బాబేలు నాయకత్వములో రెండవమందిరం కట్టబడింది. దాన్ని కూడా రోమీయులు 70 క్రీ.శ. లో నేలమట్టం చేసారు.         

పై లేఖనాలను జాగ్రత్తగా చదివి చూస్తే అక్కడ ప్రభువైన యెహోవా మొదటిమందిరము నాశనమవడానికిగల కారణాలను యూదులకు జ్ఙాపకం చేస్తూ తన మందిరములో అంటే కట్టబడబోతున్న రెండవమందిరములో అలాంటివి పునరావృతం కాకూడదంటు హెచ్చరిస్తున్నాడు. ఆ సందర్భములోనే శరీరమందు సున్నతిలేని అన్యులు తన మందిరములో (రెండవ మందిరములో) ప్రవేశించకూడదు అన్నది వివరిస్తున్నాడు. మూడవమందిరమునుగురించిగాని ఆసమయములోని శారీర సున్నతినిగురించిగాని పైవచనాలలో ప్రస్తావించడము లేదు.  

పై బైబిలు బోధల వెలుగులో క్రింది సత్యాలను విశ్వాసులు గమనములో వుంచుకోవాలి:

(1) కొందరు వైద్యుల సలహామేరకు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం సున్నతిపొందుతారు. అలాంటి సున్నతిని లేఖనాలు నిశేధించడము లేదు మరియు సమర్థించడము లేదు. 

(2) కొందరు తమప్రాంత సంసృతిని బట్టి లేక తాముంటున్న సమాజములోని ఆచారాన్ని బట్టి సున్నతిపొందుతారు. అలాంటి సున్నతిని లేఖనాలు తప్పుబట్టడము లేదు.    

(3) కొందరు ఒకప్పుడు అన్యులుగా వుండి తరువాత బైబిలు దేవున్ని విశ్వసించి ధర్మశాస్త్రాన్ని (మోషే-ధర్మశాస్త్రం) పాటించి తద్వారా దేవుని మెప్పును పొందాలన్న సదుద్దేశములో భాగంగా సున్నతిపొందే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి సున్నతి లేఖనానుసారమైన సున్నతి కాదు. అందుకు కారణాలు:     

అ) అలాంటి సున్నతిని పేర్కొంటున్న వుదాహరణలుగాని లేక మాదిరిగా చూపే సంఘటనలుగాని బైబిలులో లేవు.

ఆ) ఒకవేళ ఎవరైనా దేవుని దృష్టిలో నీతిమంతునిగా కనబడాలన్న వుద్దేశముతో మోషేధర్మశాస్త్ర ప్రకారం సున్నతి తీసుకుంటే ఆ వ్యక్తి మోషేధర్మశాస్త్రమును మొత్తము తు.చ. తప్పకుండా పాటించాల్సి వుంటుంది. అలా కానిపక్షములో ఆవ్యక్తి పొందిన సున్నతికి విలువలేదు (రోమా. 2:25).   

(4) ఈమధ్య కొందరు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) నందు విశ్వాసముంచినా సరే రక్షణపొందటానికి యింకా సున్నతిపొందాలి అన్న అబద్ధబోధకుల ఉవాచను బట్టి సున్నతి పొందుతున్నారు. ఈ రకమైన సున్నతి వాక్య విరుద్దమైన దుర్బోధ యొక్క ఫలితం! అలాంటి సున్నతి పొందినవారు యషువ మషియాఖ్ నుండి వేరై శాపగ్రస్తులుగా జీవించి నిత్యనాశనములోకి ప్రవేశిస్తారు అన్నది లేఖనాల హెచ్చరిక (గలతీ.5:1-4).   

(5) నిజవిశ్వాసులకు లేక నిజక్రైస్తవులకు చేతులతో చేయబడే సున్నతిగాక క్రీస్తు పొందిన సున్నతినిబట్టి హృదయమందు అత్మీయ సున్నతి  అనుగ్రహించబడింది (రోమా.2:28-29; ఫిలిపీ.3:2-3; కొలస్సీ.2:11). కనుక, వారు తిరిగి శరీర సున్నతిని పొందనవసరము లేదు (1కొరింథీ.7:18; గలతీ.2:1-3, 5:10-12, 6:12-13).  ఈ సత్యాన్ని ప్రతిబింబిస్తూ ఒకప్పుడు అన్యుడుగా వుండి క్రీస్తుయేసునందు నిజవిశ్వాసిగా మారి దేవుని కుటుంబములో చేరిన తీతు కూడా సున్నతిపొందవలెనంటు బలవంతము చేయబడలేదు (గలతీ.2:3).

(6) మెస్సయ్య యూదుడిగా మోషేధర్మశాస్త్రము క్రింద జీవించినవానిగా సున్నతిని పొందాడు. కాని, తన రక్తముద్వారా ఆవిష్కరించబోతున్న క్రొత్తనిబంధనలో పాలుపొందే వారందరిని ఉద్దేశించి సున్నతి పొందాలి అంటూ యేఆజ్ఙా ఇవ్వలేదు. మెస్సయ్యను విశ్వసించి ఆయన బోధ ప్రకారం జీవిస్తున్న వారికి రక్షించబడటానికి లేక ఆ రక్షణలో కొనసాగటానికి సున్నతి అన్నదాని ఆవశ్యకత అసలు లేనేలేదు.

(7) ఒకప్పుడు అన్యులుగా వుండి సువార్తను విని మెస్సయ్య (యషువ మషియాఖ్) నందు విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని ప్రజలలో చేరినతరువాత మెస్సయ్య ఉపదేశానికి అంటే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము వరకుగల లేఖనాల సమగ్ర బోధకు వ్యతిరేకంగా శరీర సున్నతిని పొందితే మెస్సయ్యనుండి వేరుచేయబడి శాపగ్రస్తులవుతారు. అలాంటివారు తిరిగి మెస్సయ్య కృపలోకి చేరుకొని రక్షణలో కొనసాగడానికి తిరిగి మెస్సయ్య ముందు హృదయపూర్వకంగా పశ్చత్తాపపడి క్షమాపణ కోరి ఆయన కనికరము కొరకు ఎదురుచూడటము తప్ప వేరే మార్గము లేదు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *