ఆజ్ఙలు పలురకాలు
దేవుని వాక్యం నిరంతరం నిలుచునది. ఆవాక్యములోని భాగమే దేవుడు నరులకిచ్చిన ఆజ్ఙలు. దేవుని వాక్యములోని భాగమైన ఆయన ఆజ్ఙలుకూడా నిరంతరం నిలుచునవే. దీని భావం అన్ని ఆజ్ఙలు ఆన్ని కాలాలో అందరికీ వర్తిస్తాయని కాదు. దేవుని ఆజ్ఙలన్నీ సత్యమైనవి, నాశనము కానివి, సదా ఉనికిలో వుంటాయని దాని భావం. అయితే వాటి అనువర్తన మరియు అధికార పరిధులు అన్నవి ఆ యా కాలాలకు, వ్యక్తులకు, మరియు సందర్భాలకు పరిమితమై వుంటాయి.
దేవుని ఆజ్ఙలు
దేవుని ఆజ్ఙలు అనేకం. అవి పలురకాలు. ఆజ్ఙలన్నీ ఒకేసారి ఒకే వ్యక్తికి యివ్వబడలేదు. కాలానుగుణంగా సందర్భానుసారంగా వివిధ వ్యక్తులకు వివిధ ఆజ్ఙలు అందించబడ్డాయి. అవన్నీ దేవుని గ్రంథమైన బైబిలులో విపులీకరించబడ్డాయి. అయితే ఏ ఆజ్ఙలు ఎవరికి, ఎప్పుడు, ఎందుకు ఇవ్వబడ్డాయి అన్నవే మానవుల జీవితాలలో వాటి అన్వయింపుకు ప్రధాన నిర్ధేశకాలు. ఈ కారణాన్నిబట్టి దేవుని ఆజ్ఙలు క్రింద యివ్వబడినట్లుగా నాలుగు ప్రధాన భాగాలుగా విభజించబడుతాయి.
1) కాల-పరిమిత ఆజ్ఙలు–ఇవి ఒక పరిమిత సమయానికి లేక కాలానికి మాత్రమే అన్వయించదగిన ఆజ్ఙలు. ఈ ఆజ్ఙలు అన్ని కాలాలకు చెందినవి కావు. ఉదాహరణకు,
“తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆది.కాం.2:16-17)
పై ఆజ్ఙను యిచ్చింది దేవుడు. అయితే, ఈ ఆజ్ఙ మానవచరిత్ర ఆరంభకాలానికి మాత్రమే చెందిన ఆజ్ఙ. ఇంగితజ్ఙానమున్న ఎవరుకూడా ఆ ఆజ్ఙను ఈదినాలోకూడా పాటించాలని భావించి పాటించే ప్రయత్నము చేయరు. క్రింద ఇవ్వబడిన లేఖనాలలోని ఆజ్ఙలు ఈ విభాగానికి చెందినవే:
“ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను.” (ని.కాం.12:7-8)
“యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.” (ని.కాం.14:26)
“యెహోవా మోషేను చూచిఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.” (ని.కాం.16:4-5)
2) వ్యక్తి-పరిమిత ఆజ్ఙలు: ఇవి దేవుడు కేవళము ఒక నిర్ధిష్టమైన వ్యక్తికి/వ్యక్తులకు యిచ్చిన ఆజ్ఙలు. ఉదాహరణకు,
“కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకు దువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుము.” (ఆది.కాం.20:7)
పై ఆజ్ఙ దేవునిది. అయితే, ఆ ఆజ్ఙను దేవుడు ఎవరికి యిచ్చాడు? లోకములోని మనుషులందరికా…? కాదు. అది కేవళము అబీమెలెకు అన్న కనానుదేశ రాజుకు మాత్రమె యివ్వబడిన ఆజ్ఙ. ఇదే విధంగా క్రింది లేఖనాల వెలుగులో దేవుడు మోషేద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము మరియు దానితోకూడిన విధులు ఆచారాలు అన్నవి ఒక ప్రత్యేకమైన జనులకు అంటే ఇశ్రాయేలీయులకు, వారితో పాటు ప్రయాణముచేస్తూ దేవుడు వాగ్ధానము చేసిన కనానుదేశములోకి ప్రవేశించబోతున్న పరదేశులకు, మరియు వారందరి రాబోవు తరాలవారికి మాత్రమే యివ్వబడ్డాయి అన్న సత్యం విశదమవుతున్నది:
“ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను” (ని.కాం.31:16)
“నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల…మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను…యెహోవా మోషేద్వారా సీనాయికొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.” (లేవీ.కాం.26:2..46)
“కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు…నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?…మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి.” (ద్వి.కాం.4:1..8..47)
“మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.” (ద్వి.కాం.5:1-3)
“యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను…నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. …రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.1…11…29)
“సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.” (నెహెమ్యా.9:13-14)
“ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.” (కీర్తన.147:19-20)
“హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.” (మలాకి.4:4)
3) సందర్భ-పరిమిత ఆజ్ఙలు: కొన్ని ఆజ్ఙలను దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకొరకు మాత్రమే యివ్వడం జరిగింది. అలాంటి ఆజ్ఙలను అన్ని కాలాలలో అందరికి అన్వయించకూడదు. ఉదాహరణకు,
“చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను.” (ఆది.కాం.6:14)
దేవుడు పై ఆజ్ఙను జారీ చేసాడు. అయితే ఆ ఆజ్ఙ అన్నికాలాలకు అన్వయించ తగిందా? కాదు. అది కేవళము నోవహుకు అదీ జలప్రళయముకు ముందు యివ్వబడిన ఆజ్ఙ. జలప్రళయము తరువాతకూడా అలాంటి ఓడలను నిర్మిస్తూ వెళ్ళండి అని కాదు ఆ ఆజ్ఙ ఉద్దేశం! దానికో సందర్భం వుంది. అలా సందర్భ-పరిమిత ఆజ్ఙలను అన్ని కాలాలలో అందరూ పాటించే ప్రయత్నం చేయకూడదు. ఈ విభాగానికి చెందిన కొన్ని ఆజ్ఙలను క్రింది లేఖనాలలో చూడవచ్చు:
“గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా” (1సమూయేలు.8:22)
“ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.” (న్యాయాధిపతులు.20:23)
“నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను.” (ద్వి.కాం.7:2)
“యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.” (1సమూయేలు.23:2)
“యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెనుజనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.” (హోషేయ.1:2)
4) సార్వత్రిక ఆజ్ఙలు: ఇక అన్ని కాలాలకు అందరికి అన్వయించదగిన ఆజ్ఙలనుకూడా దేవుడిచ్చాడు. దైవలేఖనాలలో వాటిని గుర్తించి పాటించాల్సిన ఆవశ్యకత అందరికి అన్ని కాలాలలోనూ వుంది. ఉదాహరణకు,
“మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి.” (ఆది.కాం.9:7)
పై మాటలను దేవుడు జలప్రళయము తరువాత నోవహుకు ఆయన సంతానానికి ఆజ్ఙాపించాడు. ఈ ఆజ్ఙ సర్వకాలాలకు సర్వజనులకు యివ్వబడిన సార్వత్రిక ఆజ్ఙ. ఈ ఆజ్ఙ సర్వసాధారణంగా అందరికీ అన్నికాలాలకు అన్వయించదగినదైనా ఈ ఆజ్ఙను యిచ్చిన దేవుడే తన సార్వభౌమత్వములో కొందరికి కొన్ని సందర్భాలలో ఈ ఆజ్ఙనుంది మినహాయింపును యివ్వడం జరిగింది. ఉదాహరణకు దేవుడు ప్రవక్త అయిన యిర్మీయకు ఈ ఆజ్ఙ యిచ్చాడు, “ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు” (యిర్మీయ.16:1-2). సార్వత్రిక ఆజ్ఙలనుండి ఇలాంటి మినహాయింపులు అన్నవి సార్వత్రిక ఆజ్ఙలను యిచ్చే దేవునినుండి రావడాన్ని మనం లేఖనాలలో చూడవచ్చు. క్రింది లేఖనాలలోని ఆజ్ఙలు ఈ విభాగానికి చెందినవి:
“మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.” (ఆది.కాం.9:1)
“మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:2)
“ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.” (ఆది.కాం.9:3)
“మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు” (ఆది.కాం.9:4)
“మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.” (ఆది.కాం.9:5)
“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)
ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు దేవుడిచ్చిన కట్టడలకు/ఆజ్ఙలకు ఆయా వ్యక్తులు విధేయులై నడుచుకోవాలి. సార్వత్రిక కట్టడలకు/ఆజ్ఙలకు మాత్రం అందరు అన్నివేళల విధేయులై నడుచుకోవాలి.
“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల (מִצְוֹתָ֗יו/mishvota) ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి.12:13)