నిజదేవుని ప్రవృత్తి
సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. దేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టించబడిన మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడిందిగనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు ఆత్మీయ పరిణితిపై ఆధారపడివుంది. ఈ కారణాన్నిబట్టి బైబిలులోని ప్రత్యక్షతలనుగురించిన విశ్వాసుల గ్రహింపులలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది.
పాతనిబంధన గ్రంథములో అంటే యూదుప్రవక్తలద్వారా యివ్వబడిన హీబ్రూ లేఖనాలలో (తనాఖ్) తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి రెండు ప్రాముఖ్యమైన హీబ్రూ పదాలను ధ్యానించడం ఆవశ్యకం–‘యఖీద్’ (יָחִיד = yahid or yachid) మరియు ‘ఎఖద్’ (אֶחָד = ehad or echad). ఎఖద్ అన్న పదానికి గణితశాస్త్ర సంఖ్య ఒకటి, సమిష్టి ఐఖ్యత, సామూహ ఏకత్వం వంటి అర్థాలు (ఉదా: ఆది.కాం. 2:24, 11:6; ద్వి.కాం.6:4), అలాగే యఖీద్ అన్న పదానికి ఏకైక, ఒకేఒక్క, ఏకాకి, ప్రియమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన వంటి అర్థాలు (ఉదా: న్యాయాధిపతులు 11:34; కీర్తనలు 25:16; 68:6) ఉన్నాయి.
(1) ఎఖద్ అనే “సమూహ ఏకత్వాన్ని” సూచించే హీబ్రూ భాషా పదం సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని ప్రకటించిన సంధర్భంలో ఆయన ఏకత్వాని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడింది (ద్వి.కాం.6:4). అయితే, ఈ పదం ఒక్కసారయినా నరుని ఏకత్వాన్ని సూచించడానికి వుపయోగించబడలేదు.”ఒక్క దేవుడు” అంటే సంఖ్యాపరంగా ఒకదేవుడని భావం (ఉదా: ఒక్క దేవుడు, యిద్దరుదేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు…). ఒక్క/ఒక్కడు/ఒక్కటి అన్న గణితశాస్త్ర సంఖ్య గణితశాస్త్ర సూత్రాలకు లోబడుతుంది. అయితే నిజమైన దేవుడు ఏశాస్త్రానికి లోబడడు లేక పరిమితి కాజాలడు. కనుక, ఆ కారణాన్ని బట్టి గణితశాస్త్రపరమైన ఒక్కటి/ఒక్కడు (one/1) అన్న భావార్థం నిజదేవునికి అన్వయించతగదు.
“దేవుడు ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో నిజదేవునిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. ఇదే సత్యాన్ని మరొకవిధంగా చెప్పలంటే దేవుడు అద్వితీయుడు. అంటే, ఆయనను పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు.
“దేవుడు ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే దేవుడు ఒంటరివాడు మరియు ఆయనలో ‘సమూహ ఏకత్వం’ అన్నది యేదిలేదన్నది సూచించబడుతున్నది. అయితే, హీబ్రూలేఖనాలలో ఎక్కడా దేవుని ఉనికి/అస్తిత్వానికి సంబంధించి ఈవిశయం చెప్పబడలేదు అన్నది గమనించదగిన విశయం. దీన్ని బట్టి యూదు లేఖనాలలో తనను తాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ఏకాకి లేక ఒకేఒక్కడు (יָחִיד = యఖీద్) కాదు అన్నది సుస్పష్టం.
(2) నరుని ఏకత్వాన్ని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడిన హీబ్రూ భాషా పదం యఖీద్. (ఉదా: న్యాయాధిపతులు 11:34). కాని, ఈ పదం ఒక్కసారయినా దేవుని ఏకత్వాన్ని సూచించడానికి ఉపయోగించబడలేదు అన్నది మరవకూడదు.”ఒక్క మనిషి” అంటే సంఖ్యాపరంగా ఒకమనిషని భావం (ఒక్క మనిషి, యిద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు…). “మనిషి ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో మనిషిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. కాని, హీబ్రూ లేఖనాలలో యెక్కడాకూడా మనిషి వునికికి సంబంధించి ఈలాంటి పదజాలం వుపయోగించబడలేదు. ఇందును బట్టి యూదు లేఖనాలు మనిషి ‘ఒక్కడు’ (אֶחָד = ఎఖద్) లేక ‘సమూహ ఏకత్వం’ కలవాడు అని బోధించడం లేదన్న వాస్తవం నిర్ధారించుకోవచ్చు.
“మనిషి ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే మనిషి ఒంటరివాడు మరియు అతనిలో ‘సమూహ ఏకత్వం’ ఏదీలేదన్నది సూచించబడుతున్నది. ఈ సత్యాన్ని హీబ్రూ భాషలోని యూదు లేఖనాలు నిర్ద్వంధంగా సూచిస్తున్నయి (కీర్తనలు 25:16; 68:6). దాదాపు ముప్ఫైమంది దైవాత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తలద్వార హీబ్రూలేఖన గ్రంథాలసంపుటి అయిన పాతనిబంధన మానవాళికి అందించబడింది. 39 లేఖన గ్రంథాల సంపుటి అయిన పాతనిబంధనలో ఎఖద్ అన్న పదం 967 సార్లు అలాగే యఖీద్ అన్న పదం 12 సార్లు వుపయోగించబడ్డాయి. అయితే, అందులో ఒక్క ప్రవక్త అయినా దేవుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘యఖీద్’ (יָחִיד = yachid) అన్న పదాన్ని అలాగే నరుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘ఎఖద్’ (אֶחָד = echad) అన్న పదాన్ని వుపయోగించడం అన్నది జరగలేదు.
దేవుడు ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్)
అంటే, దేవుడు ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, దేవుని పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు. ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఒక్కడు (ఎఖద్) కాదు’ అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, దేవుడు ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, దేవుని అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకివంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.
యెహోవా ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్). అంటే, ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, యెహోవాకు వేరుగా, సాటిగా, పోటిగా మరొకడు లేడు. ఆ గ్రహింపులో యెహోవా ఒక్కడు (ఎఖద్) కాదు అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, యెహోవా ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, యెహోవా అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకి వంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘యెహోవా ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.
(ద్వి.కాం.6:4; యెషయా 45:5,6,14; 46:9; మార్కు 12:29; రోమా 3:30)
దేవుడు సర్వవ్యాప్తి
దేవుడు అంతటా వ్యాపించి వున్నాడు మరియు ఆయన లేని స్థలము అంటూ లేదు. ఈ గుణలక్షణాన్నిబట్టి నిజదేవుడు ఒకేసమయంలో తన ఇచ్ఛప్రకారం రెండు లేక అంతకన్న ఎక్కువ స్థలాలలో ప్రత్యక్షంకూడా కాగలడు. ఇది సృష్టికి (నరులకు) అసాధ్యం, కాని సృష్టికర్తకు (దేవునికి) సుసాధ్యం!
దేవుడు రెండు వేరువేరు స్థలాలలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులుగా ప్రత్యక్షమైన సందర్భంలో ఇద్దరు దేవుళ్ళు అనిలెక్కించడము లేక తీర్మానిచడము అవివేకం. ఆవిధంగా ప్రత్యక్షమవగలగడం అన్నది దేవుని ప్రవృత్తి. ఈ సందర్భంగా నిజదేవుడు గణితశాస్త్ర పరిధులకు అతీతమైనవాడు అన్న సత్యాన్ని పరిగణాలోకి తీసుకోవాలి. అలాంటి సందర్భాలలోకూడా ఆయన అద్వితీయుడేనన్నది మరువకూడదు. అది సృష్టికి అతీతంగా వుంటూ కేవళము సృష్టికర్తకు మాత్రమే చెందిన దైవప్రవృత్తి.
(కీర్తనలు 139:7-10; యిర్మీయ 23:24; అపో.కా.17:28)
దేవుని స్వభావం వైవిధ్యంతోకూడినది
అంటే, ఆయన ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఇంకా చెప్పలంటే దేవుని అంతర్ఘత అస్తిత్వం సృష్టించబడిన వ్యక్తుల అస్తిత్వాన్ని పోలిన ఏకత్వంలా వుండక సృష్టిలోనే లేని ‘వైవిధ్యంతో కూడిన ఏకత్వాన్ని’ (Unity in Diversity) కలిగి వున్నాడు. బైబిలు పరిభాషలో చెప్పాలంటే, ఆయన తండ్రికుమారపరిశుద్ధాత్ములనే వైవిధ్యంతో కూడిన ఏకత్వమై యున్న అద్వితీయదేవుడు [అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;].
(ఆది.కాం.1:26; యెషయా 48:15-16; జెకర్యా 2:8-11; మలాకి 3:1; మత్తయి 28:19; యోహాను 1:1, 18)
దేవుడు నరులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించినా ఆయన అనేక విధాలుగా నరులకన్నా ఎంతో గొప్పవాడు మరియు వైవిధ్యమున్నవాడు. కనుక, దేవుడు నరులలాంటి వాడు కాదు అన్నది నిరాపేక్షమైన మాట. సర్వసాధారణంగా ఒక నరునిలో/మానవదేహములో ఒక వ్యక్తిమాత్రమే అస్తిత్వాన్ని కలిగివుంటాడు. దేవుడుకూడా అలాగే వుండాలన్న నియమమేదీ లేదు. మరోమాటలో చెప్పాలంటే, నరులలో లేని వైవిధ్యం/బహుళత్వం దేవునిలో వుండే అవకాశం వుంది. నిజానికి వుంది అని గ్రహించడానికి పైన వివరించిన విధంగా లేఖనాలు తిరుగులేని ఆధారాలెన్నో అందిస్తున్నాయి.
సృష్టికర్త ప్రవృత్తిని సంపూర్ణంగా కాకపోయినా పరిమితస్థాయిలోనైనా సరిగ్గా అవగాహన చేసుకోవటానికి మానవ మేధస్సుకు వున్న పరిమితులే పెద్ద ఆటంకం అన్నది లేఖనాల ప్రకటన:
“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీ.2:14)