మెస్సయ్య మానవుడా?
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవుడా…?
అవును, కన్యమరియకు జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] అక్షరాలా మానవుడే! కాని, “ఆయన కేవలం మానవుడు మాత్రమేనా?” అన్నది ఇక్కడి అసలైన ప్రశ్న!
కొందరి వాదనా విధానం: మరి యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు పుట్టుక వుంది మనకూ పుట్టుక వుంది. ఆయనకు దేవుడున్నాడు మనకూ దేవుడున్నాడు. ఆయనకు తండ్రి వున్నాడు మనకూ తండ్రి వున్నాడు. కనుక దేవుని ముందు యేసు క్రీస్తుకు మనకు ఆత్మీయంగా తేడాలున్నప్పటికిని అస్థిత్వంలో ఎలాంటి తేడా లేనట్లే కదా?!
అసలు ఆయనకు మనకు తేడా వుందా…? వుంటే అది ఎలాంటి తేడా…?
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు మనకు మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలున్నాయి
మొదటి ప్రాథమిక వ్యత్యాసం: ఆయన ఈలోకములోకి ప్రవేశించాడు; మనం ఈలోకంలో సృష్టించబడ్డాము.
అప్పుడు యెహోవా నేను సృజించిన [בָּרָא/bara/బరా] నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; (ఆది.కాం.6:7)
“నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి [בָּרָא/bara/బరా] యున్నావు?” (కీర్తన.89:47)
“వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు [בָּרָא/bara/బరా] జనము యెహోవాను స్తుతించును.” (కీర్తన.102:22)
‘సృష్టించుట’ లేక ‘శూన్యములోనుండి ఉనికిలోకి తెచ్చుట’ అన్న అర్థాన్ని వ్యక్తపరిచే బరా [בָּרָא/bara/బరా] అనే హీబ్రూ పదం బైబిలు అంతటిలో ఒక్కసారికూడా యేసు క్రీస్తుకు [యషువ మషియాఖ్] అన్వయించబడలేదు అన్నది గమనార్హమైన అంశం.
“కాబట్టి ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)
రెండవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని అసలైన కుమారుడు; మనం ఆయనయందున్న విశ్వాసమువలన దేవుని కుమారులముగా మార్చబడ్డాము
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]క దేవుని యొద్దనుండి లేక దేవునిలోనుండి వచ్చాడు. కనుక ఆయన అక్షరాల (literally) దేవుని కుమారుడు, కాని భౌతికంగా కాదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో ఆయన అద్వితీయకుమారుడుగా [μονογενής υἱός/మొనొగెనెస్ హుయియొస్ = ప్రత్యేకమైన/ద్వితీయములేని కుమారుడు] పేర్కొనబడ్డాడు (యోహాను.3:16,18; హెబ్రీ.11:17; 1యోహాను.4:9). మనం అంటే నిజవిశ్వారులైనవారు ఈలోకములోనే సృష్టించబడ్డాము. అయినా నిజవిశ్వాసులు యేసు క్రీస్తునందు విశ్వాసమూలముగా దత్తపుత్రాత్మనుబట్టి దేవునికి కుమారులముగా మారాము (యోహాను.1:12-13; రోమా.8:15; గలతీ.4:5-7). ఇది అక్షరార్థమైన మరియు భౌతికమైన పుత్రత్వసంబంధము ఎంతమాత్రము కాదు. ఇది ఆత్మీయమైన మరియు అలంకారరూపమైన సంబంధము.
“ఆదియందు [సృష్టికి పూర్వం] వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద [πρὸς τὸν Θεόν] ఉండెను, వాక్యము దేవుడై యుండెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] మహిమను కనుగొంటిమి.” (యోహాను.1:1,14).
యేసు (యషువ) ఈ లోకములోనికి నరునిగా రాకముందు దేవునితో/దేవునిలో దేవుని వాక్కుగా ఉనికిని కలిగివుండి తన ఉనికికి ఆరంభము లేనివాడై తానే ఆదియై వున్నాడు (ప్రకటన.21:6; 22:13). ఆయన సృష్టించబడలేదు, కాని సమస్తమూ–నీవు నేను కూడా–ఆయనకొరకు ఆయనద్వారా సృష్టించబడ్డాయి. “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను.1:3). ఆయన కన్యమరియకు జన్మించకముందే దేవుని కుమారుడు! ఆ కారణాన్నిబట్టే దేవుడు తన కుమారుని ఈలోకములోనికి పంపెను అంటూ లేఖనాలు సాక్షమిస్తున్నాయి (సామెతలు.30:4; యోహాను 3:17, గలతీ.4:4; 1యోహాను.4:9).
మూడవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని మర్మము; మనం దేవుని చేతిపని మాత్రమే
ఈలోకములోకి మానవశరీరాన్ని ధరించి విచ్చేసిన సందర్భంగా (యోహాను.1:14; హెబ్రీ.10:5) యేసు [యషువ] ‘దేవుని వాక్కు’గా దేవునిలో వుండి దేవునిగా వున్న (యోహాను.1:1) కారణాన్నిబట్టి తనకున్న దైవత్వపు లక్షణాలను మరియు హక్కులను వినియోగించుకోకుండా వాటిని మరుగుపరచుకొని మానవ పరిధులకు తన్నుతాను పరిమితునిగా చేసుకున్నాడు (ఫిలిప్పీ.2:6-7; హెబ్రీ.2:14).
పై లేఖన సత్యాలనుబట్టి ఒక నరునిగా జీవించిన యేసు క్రీస్తు దేవుని మర్మమై వున్నాడంటూ లేఖనాలు ఘోశిస్తున్నాయి (కొలొస్సీ.2:2). నిన్నూ నన్నూ లేక ఏనరున్నికూడా ‘దేవుని మర్మము’ అని లేఖనాలు ఎక్కడా ప్రకటించలేదు అన్నది ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి. ఆయనకు మనకు మధ్య వున్న ఈ భేదం అత్యంత ప్రాముఖ్యమైనది.
పై కారణాలను బట్టి దేవుని ఎదుట కారణజన్ముడు దైవాంశసంభూతుడు అయిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మరియు తతిమా మానవులందరు సమానం కాదు. ఈ రెండు వర్గాల మధ్య వున్న అస్థిత్వపు అగాధం అన్నది ఎప్పటికీ పూడ్చబడలేనిది. అందుకే ఆయన దేవున్ని సూచిస్తూ “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు” (యోహాను.20:17) అన్నడే కాని “మన దేవుడు మన తండ్రి” అంటు సంబోధించలేదు. ఈ సుక్ష్మమైన అదేసమయములో అత్యంత పాముఖ్యమైన వ్యత్యాసాన్ని విజ్ఙులుమాత్రమే గుర్తించగలరు గ్రహించగలరు.