అంత్యకాల జూడాయిజం

ప్రపంచంలోని ప్రాచీన మతాలలో జుడాయిజం (Judaism) లేక యూదుమతం ఒకటి. ఇది మధ్యప్రాచ్యంలో (Middle-East) ఆవిర్భవించినా ప్రపంచములోని అనేక దేశాలలో అనుసరించబడుతున్నది. ఈ మతం ప్రధానంగా యూదులమధ్య యూదులకొరకు యూదు మతపెద్దలైన రబ్బీలచేత ప్రారంభించబడినా ఈమధ్యే విస్తృతమైన మతప్రచారాన్ని మతమార్పిడులనుకూడా చేపట్టింది.

గత రెండువేల సంవత్సరాలుగా ప్రపంచములో ఉనికిని కొనసాగిస్తున్న యూదుమతం నిజానికి ఒకప్పటి బైబిలువిశ్వాసం లేక తనాక్ ధార్మిక మార్గం యొక్క కొనసాగింపు కాదుగాని దాని తదనంతరము ఆవిర్భవించి విస్తరిస్తున్న తాల్ముద్ ఆధారిత మతం లేక రబ్బీలమతం అన్నది గమనములో వుంచుకోవాలి. ఈనాటి యూదుమతం (జూడాయిజం) బైబిలు ప్రబోధాలకు మరియు వాటిపై ఆధారపడిన విశ్వాసానికి సుదూరమైనది. నిజానికి దీన్ని ‘అంత్యకాల జూడాయిజం’ అని అభివర్ణించవచ్చు.

‘జూడాయిజం’ (Judaism) మరియు ‘యూదుమతం’ అన్న పదప్రయోగాలు గాని లేక అవి ప్రాతినిథ్యం వహిస్తున్న మతవిధానము గాని క్రీస్తుకు పుర్వమున్న దైవప్రవక్తలెవరు ఎరుగనివి. అయితే, జూడాయిజం [యూదుమతం] అంటే యూదుల మతం అన్నది ఈనాటి సర్వసాధారణ భావం. కాని, పాతనిబంధన గ్రంథం (తనాక్) అంతటిలో ఒక్కసారికూడా ఈ పదం ఉపయోగించబడలేదు. వాస్తవానికి ఈ పదం రబ్బీల సృష్టి!

‘యూదుడు’ అన్నపదం ‘యూదా’ అనే హెబ్రీ నామములోనుండి పుట్టిన పదమైనప్పటికిని ఇది అబ్రహాము ఎరుగని పదం, మోషే ఎరుగని పదం, చివరకు దావీదుగాని లేక అతని సంతానములోనుండి వచ్చిన ఏలికలలోనివారుగాని ఇశ్రాయేలీయుల గోత్రాలన్నీ దాసత్వములోకి వెళ్ళకముందు వరకు ఎరుగని పదం.

ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పదేపదే పాపము చేయడముద్వారా తమతో దేవుడు చేసిన నిబంధనను భంగంచేసి తత్ఫలితంగా దేవుని ఉగ్రతను కొనితెచ్చుకున్నారు. దాని పర్యవసానమే దేవుడు 722 క్రీ.పూ. లో పది గోత్రాలతోకూడిన ఉత్తరరాజ్యం ఇశ్రాయేలును అన్యులైన అష్షూరుదేశస్తులకు అలాగే 586 క్రీ.పూ. లో రెండు గోత్రాలతోకూడిన దక్షిణరాజ్యం యూదాను బబులోనుదేశస్తులకు బానిసలుగా అప్పగించాడు. ఆరకమైన దుస్థితిలో వారు కొనసాగుతున్న సమయములో కేవలము రెండు గోత్రాల ప్రజలను అంటే యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము వారిని సూచిస్తూ పలికేందుకు పుట్టింది ‘యూదులు’ (יְהוּדִים/యెహుదిం) అన్న పదం. ఈనాటి కొందరు యూదు పండితుల అభిప్రాయప్రకారం ఆఫ్రికాలోని నల్లజాతీయులను వివక్షతతో ‘నీగ్రోలు’ అంటూ పేర్కొన్నట్లు అన్యజాతీయులు ఇశ్రాయేలీయుల రెండుగోత్రాలవారిని తిరస్కారభావంతో ‘యూదులు’ అంటూ పిలవడం ప్రారంభించారు. చరిత్రాధారాలను బట్టి చూస్తే ప్రారంభములో బబులోనుదేశస్తులు యూదా రాజ్యములోనుండి వచ్చిన వారందరిని యుదులు అంటూ పిలిచారు. అప్పట్లో ఇది మతాన్నికాక జాతీయతను ఎత్తిచూపే పదంగా ఉపయోగించబడింది.

ఈ నేపద్యంలో ఇశ్రాయేలీయులు చెరలో వున్న సమయములో ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలలో ‘యూదుడు’ మరియు ‘యూదులు’ అన్న పదాలు చూడగలము. కాలక్రమేణా ఈ పదాలు ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలోనివారికి ఆపాదించడం మొదలైంది. ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలు పాతనిబంధన (తనాక్) బోధలతో మరియు యెరూషలేములోని దేవుని ఆలయముతో ముడిపడివుండటాన్ని ఈసందర్భంగా జ్ఙాపకం చేసుకోవాలి. ఈ కారణాన్నిబట్టి 70 క్రీ.శ. లో రోమీయులు యెరూషలేములో రెండవసారి కట్టబడిన దేవుని మందిరాన్ని ద్వంసముచేయడముతో ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలకు ఉపద్రవం యేర్పడింది. ఈ పరిస్థితి తమ మతగ్రంథాలను సంస్కరిస్తూ క్రొత్త గ్రంథాలను వ్రాసుకునేందుకు యూదుల మతపెద్దలకు అంటే ‘రబ్బీలకు’ తోడ్పడింది.

అప్పటినుండి యూదుజాతీయులు మరియు యూదుమతప్రవిష్టులు (యూదుమతాన్ని స్వీకరించినవారు) బైబిలు గ్రంథబోధలను ప్రక్కకుబెట్టి పాతనిబంధన లేఖనాలకు రబ్బీలు చెప్పే పొంతనలేని వ్యాఖ్యానాలను, వారు చేసే బోధలను, అలాగే వారు ప్రవేశపెట్టిన పితృపారంపార్యాచారాలను పాటించడం మొదలుబెట్టారు.

ప్రఖ్యాత ననాతన యూదు రచయిత మరియు రబ్బీ (యూదు బోధకుడు) ఖెయిం షిమ్మెల్ తాను వ్రాసిన “మౌఖిక తోరా” అన్న గ్రంథములో యదార్థంగా ఒప్పుకుంటూ వ్రాసిన మాటలు:

తోరాలో వ్రాయబడిన అసలు మాటల ప్రకారం యూదులు ఎప్పుడూ జీవించలేదు, అయితే వారు జీవించింది రబ్బీలు ప్రవేశపెట్టిన సంప్రదాయాల ప్రకారం! (రబ్బీ ఖెయిం షిమ్మెల్)

ఈ మతస్తులు తమ మతప్రచారములో ఇతర మతస్తులను ఆకట్టుకునేందుకు హెబ్రీ బైబిలును విరివిగా పేర్కొంటుంటారు. అయినా, వీరి మత విశ్వాసాలు ఆచారవ్యవహారాలు ప్రధానంగా రబ్బీలు చేసిన బోధలపై వారు ప్రవేశపెట్టిన ఆచారాలపై ఆధారపడి వుంటాయి.

యెరూషలేములోని హీబ్రూ విశ్వవిధ్యాలయములో ఆచార్యునిగా పనిచేసిన కిప్పాను ధరించి జుడాయిజములో కొనసాగుతున్న అవిగ్దోర్ షినాన్ ప్రస్తుతమున్న జూడాయిజంలోని వారు పాటించే ఆచారాల మూలాలను వివరిస్తూ చెప్పిన సత్యం,

“మా ధార్మికవిధ్య పాతనిబంధనాగ్రంథంపై (తనాక్ పై) ఆధారపడింది కాదు. ఈనాడు మేము అనుకరిస్తున్న ఆచారాలు పాతనిబంధనాగ్రంథపు ఆచారాలు కావు, అవి మా పూర్వికులలోని విజ్ఙులు (sages) ప్రారంభించిన ఆచారాలు.
      
“సబ్బాతు (విశ్రాంతిదిన) ఆచారాలు, కష్రుత్  నియమాలు మొదలైనవి లేఖనాలలో పాతనిబంధన గ్రంథములో లేనివి. పాతనిబంధనాగ్రంథములో సినగోగు లేదు, కద్దీష్ లేదు, కోల్ నిద్రె లేదు, బార్ మిట్స్ వ లేదు, తల్లీల్ లేదు. ఈనాడు యూదుత్వానికి చెందినదంటూ నిర్వచించబడే వాటిలో మొదలును పరిశోధించి చూస్తే అవి పాతనిబంధనాగ్రంథములోనివి కావుగాని మాపూర్వికులలోని విజ్ఙులు (sages) అందించిన సాహిత్య గ్రంథములలోనివి. అక్కడే ప్రతీది మొదలయ్యింది. యూదుమతం పాతనిబంధ గ్రంథములో ఎక్కడుంది? మోషే యూదుడని పిలువబడలేదు. అబ్రహాముకూడా అలా పిలువబడలేదు. కేవళం మొర్దెకై “యూదుడైన మొర్దెకై” గా పిలువబడ్డాడు, అదీ పాతనిబంధన గ్రంథములోని చివరి భాగములో పారసీకుల కాలములో జరిగిన సంఘటన.” (ఆచార్య అ. షినాన్) 

వీరు ఒకవైపు పాతనిబంధనాగ్రంథము యొక్క సహజ కొనసాగింపుగా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాన్ని తప్పుబడుతూ, తిరస్కరిస్తూ, ఇంకా దానిపై ఎన్నో అసత్యారోపణలు చేస్తూ మరొకవైపు పాతనిబంధనాగ్రంథానికి వేరైన వ్యతిరేకమైన బోధలు కలిగిన రబ్బీల గ్రంథాలలోని అంటే మిష్నా మరియు గమరాలతోకూడిన యెరూషలేము తాల్ముదు, బబులోను తాల్ముదు, జోహర్ మొదలైన బబులోనులోని అన్యుల ప్రభావముతో వ్రాయబడిన గ్రంథాలలోని ప్రబోధాలను మరియు ఆచారాలను అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు.

ఈనాటి జూడాయిజం వారు అనుకరిస్తున్న అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఒకప్పుడు యూదులు చెరలో జీవిస్తున్నప్పుడు వారిని చెరగా తీసుకుపోయిన అన్యజనుల ఆచారాలలోనుండి అరువుతీసుకున్నవే:

తలిస్మానులు, హంసాలు (హస్తరూప తాయత్తులు), లాగ్ బౌమ (ఒమెర్ 33వ దినాన జరుపుకునే యూదుమత పండుగ), కిప్పా (యూదులు ధరించే పుర్రె టోపి) ధరించటం, మరణించిన ఆత్మలతో షంభాషించే సమావేశాలు, టెఫిలీనులను కట్టుకోవడము, ద్వారబంధాలకు మెజుజాలను వ్రేలాడదీయడము, ప్రసిద్దిగాంచిన రబ్బీల సమాధులపై సాష్టాంగపడటము, మాంసాన్ని మరియు పాలవ్యుత్పత్తులను వేరుచేసే కష్రుత్ నియమాలను పాటించటం, మంత్రజాలాలు, కౌమార ప్రాయపు ప్రారంభ వేడుకలు (బార్ మిట్జ్వ) జరుపుకోవటం, పేరెన్నికగల రబ్బీల చిత్రపటాలను గోడలకు వ్రేలాడదీయడం, మంత్రోచ్చరణలు, మరియు వివాహ వేడుకలలో ద్రాక్షారసాన్ని త్రాగుటకు ఉపయోగించే గాజు పాత్రను పగలగొట్టడం మొదలైనవి.

ఓసారి ఓ జ్ఙాని యిలా అన్నాడు, “రబ్బీలు పెంపొందించిన జూడాయిజాన్ని ఈరోజు మోషే గనుక దర్శిస్తే ఆ మహానుభావుడే దాన్ని ఏకోశనా గుర్తించలేడు!”

ఇది చాలదన్నట్లు వారిలో కొందరు ముఖ్యంగా అన్యజాతులలోనుండి జూడాయిజమును స్వీకరించినవారు క్రొత్తనిబంధన గ్రంథాన్ని అలాగే పరమతండ్రి అభిషేకించి పంపిన మెస్సయ్యను తూలనాడుతు దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంటారు. వారి ప్రయత్నం మధ్యాహ్నపు సూర్యునిపై దుమ్మెత్తిపోసే మూర్ఖుల ప్రయత్నాలను తలదన్నేస్థాయిలో వుంటుంది.

ఇతరుల విశ్వాసాలను ప్రశ్నించటం, పరిశోధించటం, లేక తిరస్కరించటం అన్నవి సభ్యసమాజములో ప్రతివ్యక్తికీ వున్న సాధారణ హక్కులు. కాని, పనిగట్టుకొని ఇతరులను వ్యక్తి దూషణకు గురిచేయటము లేక ఇతరుల విశ్వాసాలను దూషించటము తూలనాడటము అన్నవి సంస్కారవంతులు చేసే పనికాదు. అవి సంస్కారహీనులకు చెందినవి.

మానవాళి రక్షణకై/విమోచనకై పరమతండ్రి చూపిన అపార ప్రేమ యొక్క ప్రత్యక్షతగా తననుతాను పాపపరిహారార్థబలిగా సమర్పించుకున్న మెస్సయ్య అయిన యషువ (యేసు) పై తాము ఎత్తిపోసే దుర్భాషల దుమ్ము తమ కళ్ళలలో, నోటిలో, మరియు బ్రతుకుళ్ళోనే పడుతుందన్న చేదు నిజాన్ని గ్రహించలేని అజ్ఙానాంధులు ఈబాపతు జూడాయిజం వారు!

తమ మతవిశ్వాసాల ప్రచారానికై క్రొత్తనిబంధనను శంకించేందుకు అనువుగా అనేక తర్కరాహిత్యమైన, ద్వంద్వనీతీప్రాయమైన, సాహిత్యపరిజ్ఙానలోపముతోకూడిన ప్రశ్నలు సంశయాలను లేవనెత్తుతు అమాయక క్రైస్తవులను విశ్వాసభ్రష్టులను చేస్తున్నారు. ఇలాంటివారినిగూర్చే క్రొత్తనిబంధనా లేఖనాలు రెండువేల సంవత్సరాలక్రితమే ప్రవచనాత్మకంగా క్రింది మాటలలో హెచ్చరించాయి:

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. (1తిమోతీ.4:1-2)

తమ మోసపూరిత కుతంత్రాలను ప్రయోగించే ప్రయత్నములో వీరు సోషల్ మీడియాను మరిముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను విరివిగా ఉపయోగిస్తుంటారు. తమ విశ్వాసాలతో ఏకీభవించనివారిని వ్యక్తిగత దూషణ చేయటం, ఇతరుల విశ్వాసాలను తూలనాడటం, క్రొత్తనిబంధన లేఖనాలను ఎగతాళిచేయటం, ప్రభువైన యేసు క్రీస్తును దూషించటం వీరి ప్రత్యేక లక్షణాలు. వారి భాషా మరియు పదజాలము పతనావస్తలోవున్న వారి వ్యక్తిగత స్వభావలక్షణాలనేగాక వారిపై ప్రభావాన్ని చూపుతున్న వారి మత స్వభావాన్నికూడా అవగతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

ఈరకమైన ప్రయత్నాలు ప్రముఖంగా నామకార్థ క్రైస్తవులమధ్య చేయటం ఈ మతవిశ్వాసుల ప్రధాన వ్యూహంగా గమనించగలం.

ఈనాటి క్రైస్తవ్యములో అధిక శాతం నామకార్థ క్రైస్తవులు లేక మతక్రైస్తవులేనన్నది సుస్పష్టం. పొట్టు విస్తారం, గింజలు స్వల్పం! అన్యమతాలనుండి మరియు దుర్బోధకులనుండి క్రైస్తవ సత్యం పై జరుగుతున్న దాడికి అనేకులు కదిలిపోయి నిజక్రైస్తవ్యాన్ని వదిలి నాశనమార్గాలలోకి అడుగిడుతున్నారు. ఇది అనిర్వార్యం. గాలివీస్తేనే పొట్టు గింజలు వేరయ్యేది. గాలికి పొట్టులాంటి క్రైస్తవులు చెదరగొట్టబడ్డప్పుడే స్థిరంగా నిలిచే గింజలలాంటి నిజక్రైస్తవులు గుర్తించబడేది.

ఆయన (మెస్సయ్య) చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.” (లూకా.3:17)

2 comments

  • P suryanarayana

    Very good message

  • B. Manohar

    అబ్రహాము నుండి యూదులు లేక యూద మతము ప్రారంభం కాలేదు. యాకోబు కుమారుడైన యూదా నుండి యూదులు ప్రారంభమైనారు. ఆ తర్వాత యూదా మతము లేక పాత నిబంధన ప్రారంభమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *