Monthly Archives: February 2020

Permalink to single post

మెస్సయ్యనందు అన్యులు పొందే మేలు

ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య అయిన యషువనందు అందరికి చాలిన రక్షణను సిద్ధపరచి దాన్ని అందరికి కేవలం విశ్వాసదూరములోనే వుంచాడు.  

“దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” (ఆది.కాం.1:26-28)

“ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.” (ఆది.కాం.5:1-2) 

“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.” (యాకోబు.3:9)

“మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతికప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:1)

“మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.” (ఆది.కాం.9:8-10)

“కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక” (యెహోషువ.3:9-10) 

సర్వలోకనాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.”(యెహోషువ.3:13)

“సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.” (మీకా.4:13) 

“అతడు నాతో ఇట్లనెనుఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.” (జెకర్యా.6:5)

“వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.” (సం.కాం.16:22)

“అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.” (సం.కాం.27:15)

“నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.” (యెషయా.54:5)

“నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయా.32:27)

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనము [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపో.కా.10:34-35)

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునొందుదురు.” (రోమా.2:11-12)

“ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా.17:30)

“ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.” (1తిమోతి.2:3-4)

“కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2పేతురు.3:9)

“ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై” (తీతుకు.2:11)

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను.3:16)

“నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.” (1యోహాను.2:1-2)

“కాబట్టి మీరు వెళ్లి, సమస్తజనులను [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” (మత్తయి.28:19)

“మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” (మార్కు.16:15-16) 

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమా.10:12)

“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా.1:16)

“మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా.9:23-24)

Views: 147

Permalink to single post

‘యూదులు’ అంటే ఎవరు?

‘యూదుడు’ లేక ‘యూదులు’ అన్న పదం ‘యూదా’ అన్న హీబ్రూ నామవాచక పదములోనుండి వచ్చింది.

దేవుని స్నేహితుడుగా అలాగే విశ్వాసులకు తండ్రిగా పేరుప్రఖ్యాతులు పొందిన హెబ్రీయుడైన అబ్రహాముకు దేవుని వాగ్ధాన ఫలితంగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకు ఏశావు మరియు యాకోబు అనే యిరువురు కుమారులు జన్మించారు. వారిలో చిన్నవాడైన యాకోబును దేవుడు యెన్నుకొని ఆశీర్వదించాడు.

ఇశ్రాయేలు అనే పేరును పొందిన యాకోబుకు పన్నేండుమంది కుమారులు ఒక కుమార్తె జన్మించారు. యాకోబు లేక ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారులలోని నాలుగవకుమారుని పేరు యూదా.       

ఇశ్రాయేలు యొక్క పన్నెండుమంది కుమారుల సంతానము పన్నెండు గోత్రాలుగా విస్తరించింది. వీరందరిని అంటే పన్నెండు గోత్రాలలోని యాకోబు సంతానమంతటిని సర్వసాధారణముగా ‘ఇశ్రాయేలీయులు’ అంటూ బైబిలు పేర్కొంటుంది. 

రెండు రాజ్యాల ప్రారంభం

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల సమిష్టి రాజ్యాన్ని పాలించిన చివరి రాజు సొలొమోను మరణము [930 క్రీ.పూ.]తరువాత ఇశ్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా అంటే ఉత్తరరాజ్యం మరియు దక్షిణరాజ్యంగా విడిపోయింది. పది గోత్రాలతో కూడిన ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలురాజ్యము అని రెండు గోత్రాలతో కూడిన దక్షిణ రాజ్యాన్ని యూదారాజ్యము అని పేర్కొంటారు. యూదా రాజ్యము ప్రధానంగా యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము కలిపి ఏర్పరచబడినా వారితోపాటు లేవీయ గోత్రములోని కొందరు అలాగే షిమియోను గోత్రీకులు కొందరు కలిసారు. 

యూదా రాజైన ఆసా యేలుబడిలో [911-870 క్రీ.పూ.] ఉత్తర రాజ్యములోని ఎఫ్రాయిము, మనష్షే, మరియు షిమియోను గోత్రాలలోని అనేకమంది భక్తిపరులు వలసవచ్చి దక్షిణరాజ్యమైన యూదారాజ్యములో స్థిరపడ్డారు (2ది.వృ.15:9).     

రెండు రాజ్యాల చెఱ

722 క్రీ.పూ. లో ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలు రాజ్యం అంటే పది గోత్రాల రాజ్యాన్ని అష్షూరీయులు జయించి ఆ గోత్రాలవారిని దాసులుగా తీసుకువెళ్ళారు. ఆ సందర్భములో కొందరు దక్షిణరాజ్యమైన యూదారాజ్యములోకి పారిపోవటము జరిగింది. మొదటి శతాబ్ధములో యెరూషలేములో ఆషేరు వంశములోనుండి వచ్చిన అన్న అను ఒక ప్రవక్తి యొక్క ఉనికి దీని పర్యవసానమేనని గ్రహించవచ్చు (లూకా.2:36-38). మరికొందరు ఉత్తర రాజ్యవాసులు అష్షూరీయులను తప్పించుకొని తమదేశములోనే జీవనం కొనసాగించారు. అయితే, అధిక సంఖ్యాకులు మాత్రం అష్షూరీయులచేతిలో బందీలుగా మారి వారికి దాసులుగా తీసుకువెళ్ళబడ్డారు. అలా వెళ్ళిన వారిలో అధికశాతం కాలక్రమంలో భూమి నలుమూలలకు చెదిరిపోవడం జరిగింది. 

ఉత్తర రాజ్యములోని ఇశ్రాయేలీయులను బందించి దాసులుగా తీసుకువెళ్ళిన అష్షూరీయులు ఉత్తర రాజ్య భూబాగమైన ఉత్తర పాలస్తీనా ప్రాంతములోకి తాము జయించిన అనేక అన్యజాతి ప్రజలను తెచ్చి స్థిరపరచారు. ఆ అన్యజాతులవారికి ఇశ్రాయేలు మతాన్ని బోధించేందుకు అష్షూరీయులు తాము దాసులుగా తీసుకువెళ్ళిన కొందరు లేవీయులను ఉత్తర పాలస్తీనాకు తిరిగి పంపించారు. ఈరకంగా తిరిగి వచ్చిన లేవియులు కాలక్రమములో పాలస్తీనాలో స్థిరపడిన అన్యజాతీయులను యూదామతములోకి మార్చారు (2రాజులు.17:24-41; ఎజ్రా.4:1-6). సమరయులు అలాంటివారికి చెందినవారే.            

586 క్రీ.పూ. లో దక్షిణరాజ్యాన్ని అంటే ప్రధానంగా యూదా మరియు బెన్యామీను గోత్రాలతో ఏర్పడినా కాలక్రమేణా మరికొన్ని యితర గోత్రాల వారికి కూడా ఆశ్రయముగా మారిన యూదారాజ్యాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు జయించి అధిక సంఖ్యాకులను దాసులుగా బబులోనుకు తీసుకువెళ్ళాడు. వారిలోని ముఖ్యులు తిరిగి 444/5 క్రీ.పూ.లో తిరిగి తమ స్వదేశమైన యూదయకు వచ్చారు. 

దక్షిణ రాజ్యమైన యూదారాజ్యములోనివారు ప్రధానంగా పాలస్తీనాలోని యూదయ ప్రాంతవాసులు గనుక చెఱలోనున్నప్పుడు వారిని కల్దీయులు యూదులు అంటూ సంబోధించటం మొదలయ్యింది. కొంతకాలానికే ఆ ప్రాంతములోనుండి చెఱపట్టబడిన వచ్చినవారందరికి సమిష్టిగా యూదులు అన్న పేరు స్థిరపడిపోయింది.

యూదులు అన్న పేరుతో మొదట గుర్తించబడినవారు యూదా గోత్రపువారే అయినా కాలక్రమేణా వారితోపాటు బెన్యామీను గోత్రపువారు, లేవీయ గోత్రపువారు, షిమ్యోను గోత్రపువారు అలాగే ఆసా పరిపాలనలో ఉత్తర రాజ్యములోనుండి వలసవచ్చిన ఎఫ్రాయీము మరియు మనష్షే గోత్రపువారు అంతేగాక అష్షూరీయుల దాడినుండి తప్పించుకొని పారిపోయి వచ్చి దక్షిణ రాజ్యములో స్థిరపడిపోయిన ఉత్తర రాజ్యములోని పది గోత్రాల సంబంధికులుకూడా యూదా గోత్రపువారితో కలిసి యూదులుగా గుర్తించబడ్డారు.  

భావ విస్తరణ

445 క్రీ.పూ.లో బబులోను చెరలోనుండి విడిపించబడి తిరిగి స్వదేశమైన యూదయకు మరలివచ్చిన దక్షిణదేశవాసులను లేఖనాలు ఇశ్రాయేలీయులుగాకూడా గుర్తిస్తున్నాయి (ఎజ్రా.2:1-2, 70; 3:1; నెహెమ్యా.1:1-6; 7:73; 11:3, 20). ఈ నేపథ్యములో క్రమక్రమంగా ఇశ్రాయేలీయులు మరియు యూదులు అన్న పదాలు రెండు ఒకదానికొకటి పర్యాయపదాలుగా మారిపోయాయి అన్నది ప్రస్పుటమవుతున్నది.  

మొదటిశతాబ్దములో మెస్సయ్య ఆగమనానికల్లా యూదులన్నా ఇశ్రాయేలీయులన్నా ఒకే భావం వ్యక్తపరచబడేది. అందుకే మెస్సయ్య ‘యూదుల రాజు ‘ (మత్తయి.2:2; మార్కు.15:2) లేక ‘ఇశ్రాయేలు రాజు ‘ (మత్తయి.27:42; యోహాను.1:49; 12:13) అన్నది లేఖన బోధ. 

“ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి” (అపొ.కా.2:5). అపోస్తలుడైన పేతురు పెంతెకోస్తు దినాన యెరూషలేములో కాపురమున్న ఆ యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ పలికిన మాటలు (అపొ.కా.2:14-36):

యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియునుగాక…ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి…దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను…మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

పేతురు పలికిన పై మాటలలో ఒకే భావాన్ని వ్యక్తపరచటానికి ‘యూదులు’ మరియు ‘ఇశ్రాయేలువారు’ అన్న రెండు పదాలను మార్చిమార్చి వాడటాన్ని గమనించవచ్చు. నిజానికి పేతురు తన ప్రసంగాన్ని యూదులను ఉద్దేశించి పలుకుతూ వారిని ఇశ్రాయేలువారలారా అంటూ కూడా సంబోధిస్తున్నాడు. కారణం? యూదులు అన్నా లేక ఇశ్రాయేలీయులు అన్న ఒకే భావం గనుక!  

కాలక్రమములో యూదులు అన్న పదప్రయోగము యొక్క భావము అంచెలంచెలుగా విస్తరించిన విధానము:

  • యూదా గోత్రపువారు
  • యూదా గోత్రము మరియు బెన్యామీను గ్రోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము మరియు లేవి గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము మరియు షిమ్యోను గోత్రము
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము మరియు ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు
  • యూదా గోత్రము, బెన్యామిను గోత్రము, లేవీ గోత్రము, షిమ్యోను గోత్రము, ఎఫ్రాయీము మనష్షే గోత్రాలు మరియు ఉత్తరరాజ్యములోని పది గోత్రాలలోనుండి వలసవచ్చిన పదిగోత్రాల శేషము
  • పన్నెండు గోత్రాలు లేక ఇశ్రాయేలీయులు

మెస్సయ్య ప్రజలు

మెస్సయ్య అయిన యషువ “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” (మత్తయి.1:21). ఆయన ప్రజలు ఇశ్రాయేలీయులు లేక యూదులు. ఆ కారణాన్ని బట్టే ఆయన “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్రెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకు నేను పంపబడలేదు” అని తన పరిచర్య యొక్క అర్దభాగములో ప్రకటించాడు (మత్తయి.15:24). అయితే, లేఖనాలు ఆయన “తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను.1:11) అంటూ ఘోషిస్తున్నాయి. ఇందునిమిత్తమే చివరికి మెస్సయ్య యూదులతో/ఇశ్రాయేలియులతో తెగేసి ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, “కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.” (మత్తయి.21:43).

ఈ నేపథ్యములో మెస్సయ్య తన మరణపునరుత్థానాలతదుపరి తన శిష్యులకు ఆజ్ఙాపించాడు: కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి (మత్తయి.28:19); మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి (మార్కు.16:15); యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడును (లూకా.24:47).             

ఇశ్రాయేలు ప్రజలలోని ఉత్తర రాజ్యనివాసులలో అధికశాతం ప్రజలు అష్షూరు రాజులచేత చెరపట్టబడి ప్రపంచ దేశాలన్నిటిలోకి చెదరగొట్టబడ్డారు. గత 2700 సంవత్సరాల కాలములో వారు తిరిగి తమ స్వదేశమైన ఉత్తర పాలస్తీనాకు తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అయితే, ప్రభువైన దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తలద్వారా వారిని తిరిగి తమ స్వదేశములో సమకూరుస్తాను అంటూ అనేక పర్యాయాలు వాగ్ధానము చేశాడు (యిర్మీయ.23:3; 31:7-8; 32:37; యెషయా.11:11-12,16). ఈ వాగ్ధానాల నెరవేర్పు మెస్సయ్య యొక్క రెండవ రాకడ సందర్భములో నెరవేర్చబడబోతున్నాయి. 

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)      

Views: 5130