Monthly Archives: May 2019
మెస్సయ్య మానవుడా?
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవుడా…?
అవును, కన్యమరియకు జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] అక్షరాలా మానవుడే! కాని, “ఆయన కేవలం మానవుడు మాత్రమేనా?” అన్నది ఇక్కడి అసలైన ప్రశ్న!
కొందరి వాదనా విధానం: మరి యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు పుట్టుక వుంది మనకూ పుట్టుక వుంది. ఆయనకు దేవుడున్నాడు మనకూ దేవుడున్నాడు. ఆయనకు తండ్రి వున్నాడు మనకూ తండ్రి వున్నాడు. కనుక దేవుని ముందు యేసు క్రీస్తుకు మనకు ఆత్మీయంగా తేడాలున్నప్పటికిని అస్థిత్వంలో ఎలాంటి తేడా లేనట్లే కదా?!
అసలు ఆయనకు మనకు తేడా వుందా…? వుంటే అది ఎలాంటి తేడా…?
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు మనకు మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలున్నాయి
మొదటి ప్రాథమిక వ్యత్యాసం: ఆయన ఈలోకములోకి ప్రవేశించాడు; మనం ఈలోకంలో సృష్టించబడ్డాము.
అప్పుడు యెహోవా నేను సృజించిన [בָּרָא/bara/బరా] నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; (ఆది.కాం.6:7)
“నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి [בָּרָא/bara/బరా] యున్నావు?” (కీర్తన.89:47)
“వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు [בָּרָא/bara/బరా] జనము యెహోవాను స్తుతించును.” (కీర్తన.102:22)
‘సృష్టించుట’ లేక ‘శూన్యములోనుండి ఉనికిలోకి తెచ్చుట’ అన్న అర్థాన్ని వ్యక్తపరిచే బరా [בָּרָא/bara/బరా] అనే హీబ్రూ పదం బైబిలు అంతటిలో ఒక్కసారికూడా యేసు క్రీస్తుకు [యషువ మషియాఖ్] అన్వయించబడలేదు అన్నది గమనార్హమైన అంశం.
“కాబట్టి ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)
రెండవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని అసలైన కుమారుడు; మనం ఆయనయందున్న విశ్వాసమువలన దేవుని కుమారులముగా మార్చబడ్డాము
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]క దేవుని యొద్దనుండి లేక దేవునిలోనుండి వచ్చాడు. కనుక ఆయన అక్షరాల (literally) దేవుని కుమారుడు, కాని భౌతికంగా కాదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో ఆయన అద్వితీయకుమారుడుగా [μονογενής υἱός/మొనొగెనెస్ హుయియొస్ = ప్రత్యేకమైన/ద్వితీయములేని కుమారుడు] పేర్కొనబడ్డాడు (యోహాను.3:16,18; హెబ్రీ.11:17; 1యోహాను.4:9). మనం అంటే నిజవిశ్వారులైనవారు ఈలోకములోనే సృష్టించబడ్డాము. అయినా నిజవిశ్వాసులు యేసు క్రీస్తునందు విశ్వాసమూలముగా దత్తపుత్రాత్మనుబట్టి దేవునికి కుమారులముగా మారాము (యోహాను.1:12-13; రోమా.8:15; గలతీ.4:5-7). ఇది అక్షరార్థమైన మరియు భౌతికమైన పుత్రత్వసంబంధము ఎంతమాత్రము కాదు. ఇది ఆత్మీయమైన మరియు అలంకారరూపమైన సంబంధము.
“ఆదియందు [సృష్టికి పూర్వం] వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద [πρὸς τὸν Θεόν] ఉండెను, వాక్యము దేవుడై యుండెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] మహిమను కనుగొంటిమి.” (యోహాను.1:1,14).
యేసు (యషువ) ఈ లోకములోనికి నరునిగా రాకముందు దేవునితో/దేవునిలో దేవుని వాక్కుగా ఉనికిని కలిగివుండి తన ఉనికికి ఆరంభము లేనివాడై తానే ఆదియై వున్నాడు (ప్రకటన.21:6; 22:13). ఆయన సృష్టించబడలేదు, కాని సమస్తమూ–నీవు నేను కూడా–ఆయనకొరకు ఆయనద్వారా సృష్టించబడ్డాయి. “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను.1:3). ఆయన కన్యమరియకు జన్మించకముందే దేవుని కుమారుడు! ఆ కారణాన్నిబట్టే దేవుడు తన కుమారుని ఈలోకములోనికి పంపెను అంటూ లేఖనాలు సాక్షమిస్తున్నాయి (సామెతలు.30:4; యోహాను 3:17, గలతీ.4:4; 1యోహాను.4:9).
మూడవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని మర్మము; మనం దేవుని చేతిపని మాత్రమే
ఈలోకములోకి మానవశరీరాన్ని ధరించి విచ్చేసిన సందర్భంగా (యోహాను.1:14; హెబ్రీ.10:5) యేసు [యషువ] ‘దేవుని వాక్కు’గా దేవునిలో వుండి దేవునిగా వున్న (యోహాను.1:1) కారణాన్నిబట్టి తనకున్న దైవత్వపు లక్షణాలను మరియు హక్కులను వినియోగించుకోకుండా వాటిని మరుగుపరచుకొని మానవ పరిధులకు తన్నుతాను పరిమితునిగా చేసుకున్నాడు (ఫిలిప్పీ.2:6-7; హెబ్రీ.2:14).
పై లేఖన సత్యాలనుబట్టి ఒక నరునిగా జీవించిన యేసు క్రీస్తు దేవుని మర్మమై వున్నాడంటూ లేఖనాలు ఘోశిస్తున్నాయి (కొలొస్సీ.2:2). నిన్నూ నన్నూ లేక ఏనరున్నికూడా ‘దేవుని మర్మము’ అని లేఖనాలు ఎక్కడా ప్రకటించలేదు అన్నది ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి. ఆయనకు మనకు మధ్య వున్న ఈ భేదం అత్యంత ప్రాముఖ్యమైనది.
పై కారణాలను బట్టి దేవుని ఎదుట కారణజన్ముడు దైవాంశసంభూతుడు అయిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మరియు తతిమా మానవులందరు సమానం కాదు. ఈ రెండు వర్గాల మధ్య వున్న అస్థిత్వపు అగాధం అన్నది ఎప్పటికీ పూడ్చబడలేనిది. అందుకే ఆయన దేవున్ని సూచిస్తూ “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు” (యోహాను.20:17) అన్నడే కాని “మన దేవుడు మన తండ్రి” అంటు సంబోధించలేదు. ఈ సుక్ష్మమైన అదేసమయములో అత్యంత పాముఖ్యమైన వ్యత్యాసాన్ని విజ్ఙులుమాత్రమే గుర్తించగలరు గ్రహించగలరు.
Views: 284
నిజదేవుని ప్రవృత్తి
సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. దేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టించబడిన మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడిందిగనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు ఆత్మీయ పరిణితిపై ఆధారపడివుంది. ఈ కారణాన్నిబట్టి బైబిలులోని ప్రత్యక్షతలనుగురించిన విశ్వాసుల గ్రహింపులలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది.
పాతనిబంధన గ్రంథములో అంటే యూదుప్రవక్తలద్వారా యివ్వబడిన హీబ్రూ లేఖనాలలో (తనాఖ్) తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి రెండు ప్రాముఖ్యమైన హీబ్రూ పదాలను ధ్యానించడం ఆవశ్యకం–‘యఖీద్’ (יָחִיד = yahid or yachid) మరియు ‘ఎఖద్’ (אֶחָד = ehad or echad). ఎఖద్ అన్న పదానికి గణితశాస్త్ర సంఖ్య ఒకటి, సమిష్టి ఐఖ్యత, సామూహ ఏకత్వం వంటి అర్థాలు (ఉదా: ఆది.కాం. 2:24, 11:6; ద్వి.కాం.6:4), అలాగే యఖీద్ అన్న పదానికి ఏకైక, ఒకేఒక్క, ఏకాకి, ప్రియమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన వంటి అర్థాలు (ఉదా: న్యాయాధిపతులు 11:34; కీర్తనలు 25:16; 68:6) ఉన్నాయి.
(1) ఎఖద్ అనే “సమూహ ఏకత్వాన్ని” సూచించే హీబ్రూ భాషా పదం సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని ప్రకటించిన సంధర్భంలో ఆయన ఏకత్వాని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడింది (ద్వి.కాం.6:4). అయితే, ఈ పదం ఒక్కసారయినా నరుని ఏకత్వాన్ని సూచించడానికి వుపయోగించబడలేదు.”ఒక్క దేవుడు” అంటే సంఖ్యాపరంగా ఒకదేవుడని భావం (ఉదా: ఒక్క దేవుడు, యిద్దరుదేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు…). ఒక్క/ఒక్కడు/ఒక్కటి అన్న గణితశాస్త్ర సంఖ్య గణితశాస్త్ర సూత్రాలకు లోబడుతుంది. అయితే నిజమైన దేవుడు ఏశాస్త్రానికి లోబడడు లేక పరిమితి కాజాలడు. కనుక, ఆ కారణాన్ని బట్టి గణితశాస్త్రపరమైన ఒక్కటి/ఒక్కడు (one/1) అన్న భావార్థం నిజదేవునికి అన్వయించతగదు.
“దేవుడు ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో నిజదేవునిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. ఇదే సత్యాన్ని మరొకవిధంగా చెప్పలంటే దేవుడు అద్వితీయుడు. అంటే, ఆయనను పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు.
“దేవుడు ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే దేవుడు ఒంటరివాడు మరియు ఆయనలో ‘సమూహ ఏకత్వం’ అన్నది యేదిలేదన్నది సూచించబడుతున్నది. అయితే, హీబ్రూలేఖనాలలో ఎక్కడా దేవుని ఉనికి/అస్తిత్వానికి సంబంధించి ఈవిశయం చెప్పబడలేదు అన్నది గమనించదగిన విశయం. దీన్ని బట్టి యూదు లేఖనాలలో తనను తాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ఏకాకి లేక ఒకేఒక్కడు (יָחִיד = యఖీద్) కాదు అన్నది సుస్పష్టం.
(2) నరుని ఏకత్వాన్ని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడిన హీబ్రూ భాషా పదం యఖీద్. (ఉదా: న్యాయాధిపతులు 11:34). కాని, ఈ పదం ఒక్కసారయినా దేవుని ఏకత్వాన్ని సూచించడానికి ఉపయోగించబడలేదు అన్నది మరవకూడదు.”ఒక్క మనిషి” అంటే సంఖ్యాపరంగా ఒకమనిషని భావం (ఒక్క మనిషి, యిద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు…). “మనిషి ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో మనిషిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. కాని, హీబ్రూ లేఖనాలలో యెక్కడాకూడా మనిషి వునికికి సంబంధించి ఈలాంటి పదజాలం వుపయోగించబడలేదు. ఇందును బట్టి యూదు లేఖనాలు మనిషి ‘ఒక్కడు’ (אֶחָד = ఎఖద్) లేక ‘సమూహ ఏకత్వం’ కలవాడు అని బోధించడం లేదన్న వాస్తవం నిర్ధారించుకోవచ్చు.
“మనిషి ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే మనిషి ఒంటరివాడు మరియు అతనిలో ‘సమూహ ఏకత్వం’ ఏదీలేదన్నది సూచించబడుతున్నది. ఈ సత్యాన్ని హీబ్రూ భాషలోని యూదు లేఖనాలు నిర్ద్వంధంగా సూచిస్తున్నయి (కీర్తనలు 25:16; 68:6). దాదాపు ముప్ఫైమంది దైవాత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తలద్వార హీబ్రూలేఖన గ్రంథాలసంపుటి అయిన పాతనిబంధన మానవాళికి అందించబడింది. 39 లేఖన గ్రంథాల సంపుటి అయిన పాతనిబంధనలో ఎఖద్ అన్న పదం 967 సార్లు అలాగే యఖీద్ అన్న పదం 12 సార్లు వుపయోగించబడ్డాయి. అయితే, అందులో ఒక్క ప్రవక్త అయినా దేవుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘యఖీద్’ (יָחִיד = yachid) అన్న పదాన్ని అలాగే నరుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘ఎఖద్’ (אֶחָד = echad) అన్న పదాన్ని వుపయోగించడం అన్నది జరగలేదు.
దేవుడు ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్)
అంటే, దేవుడు ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, దేవుని పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు. ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఒక్కడు (ఎఖద్) కాదు’ అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, దేవుడు ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, దేవుని అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకివంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.
యెహోవా ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్). అంటే, ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, యెహోవాకు వేరుగా, సాటిగా, పోటిగా మరొకడు లేడు. ఆ గ్రహింపులో యెహోవా ఒక్కడు (ఎఖద్) కాదు అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, యెహోవా ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, యెహోవా అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకి వంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘యెహోవా ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.
(ద్వి.కాం.6:4; యెషయా 45:5,6,14; 46:9; మార్కు 12:29; రోమా 3:30)
దేవుడు సర్వవ్యాప్తి
దేవుడు అంతటా వ్యాపించి వున్నాడు మరియు ఆయన లేని స్థలము అంటూ లేదు. ఈ గుణలక్షణాన్నిబట్టి నిజదేవుడు ఒకేసమయంలో తన ఇచ్ఛప్రకారం రెండు లేక అంతకన్న ఎక్కువ స్థలాలలో ప్రత్యక్షంకూడా కాగలడు. ఇది సృష్టికి (నరులకు) అసాధ్యం, కాని సృష్టికర్తకు (దేవునికి) సుసాధ్యం!
దేవుడు రెండు వేరువేరు స్థలాలలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులుగా ప్రత్యక్షమైన సందర్భంలో ఇద్దరు దేవుళ్ళు అనిలెక్కించడము లేక తీర్మానిచడము అవివేకం. ఆవిధంగా ప్రత్యక్షమవగలగడం అన్నది దేవుని ప్రవృత్తి. ఈ సందర్భంగా నిజదేవుడు గణితశాస్త్ర పరిధులకు అతీతమైనవాడు అన్న సత్యాన్ని పరిగణాలోకి తీసుకోవాలి. అలాంటి సందర్భాలలోకూడా ఆయన అద్వితీయుడేనన్నది మరువకూడదు. అది సృష్టికి అతీతంగా వుంటూ కేవళము సృష్టికర్తకు మాత్రమే చెందిన దైవప్రవృత్తి.
(కీర్తనలు 139:7-10; యిర్మీయ 23:24; అపో.కా.17:28)
దేవుని స్వభావం వైవిధ్యంతోకూడినది
అంటే, ఆయన ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఇంకా చెప్పలంటే దేవుని అంతర్ఘత అస్తిత్వం సృష్టించబడిన వ్యక్తుల అస్తిత్వాన్ని పోలిన ఏకత్వంలా వుండక సృష్టిలోనే లేని ‘వైవిధ్యంతో కూడిన ఏకత్వాన్ని’ (Unity in Diversity) కలిగి వున్నాడు. బైబిలు పరిభాషలో చెప్పాలంటే, ఆయన తండ్రికుమారపరిశుద్ధాత్ములనే వైవిధ్యంతో కూడిన ఏకత్వమై యున్న అద్వితీయదేవుడు [అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;].
(ఆది.కాం.1:26; యెషయా 48:15-16; జెకర్యా 2:8-11; మలాకి 3:1; మత్తయి 28:19; యోహాను 1:1, 18)
దేవుడు నరులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించినా ఆయన అనేక విధాలుగా నరులకన్నా ఎంతో గొప్పవాడు మరియు వైవిధ్యమున్నవాడు. కనుక, దేవుడు నరులలాంటి వాడు కాదు అన్నది నిరాపేక్షమైన మాట. సర్వసాధారణంగా ఒక నరునిలో/మానవదేహములో ఒక వ్యక్తిమాత్రమే అస్తిత్వాన్ని కలిగివుంటాడు. దేవుడుకూడా అలాగే వుండాలన్న నియమమేదీ లేదు. మరోమాటలో చెప్పాలంటే, నరులలో లేని వైవిధ్యం/బహుళత్వం దేవునిలో వుండే అవకాశం వుంది. నిజానికి వుంది అని గ్రహించడానికి పైన వివరించిన విధంగా లేఖనాలు తిరుగులేని ఆధారాలెన్నో అందిస్తున్నాయి.
సృష్టికర్త ప్రవృత్తిని సంపూర్ణంగా కాకపోయినా పరిమితస్థాయిలోనైనా సరిగ్గా అవగాహన చేసుకోవటానికి మానవ మేధస్సుకు వున్న పరిమితులే పెద్ద ఆటంకం అన్నది లేఖనాల ప్రకటన:
“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీ.2:14)
Views: 342
తాల్ముద్-జూడాయిజం
తాల్ముద్ అన్నది యూదుమతబోధకులైన రబ్బీలు పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడిచ్చిన తనాక్ (పాతనిబంధన గ్రంథము) కు వేరుగా వ్రాసుకున్న యూదు మరియు అన్యసాంప్రదాయాలతో కూడిన అనేక గ్రంథాలలో ప్రధానమైనది.
“తాల్మూద్-జూడాయిజం” అన్న మతవిశ్వాసం ప్రధానంగా యూదుమతబోధకులైన రబ్బీల బోధలపై అంటే తాల్ముద్ బోధలపై ఆధారపడినది. కనుక దీన్ని “రబ్బీలజూడాయిజం” (Rabbinic Judaism) అనికూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జూడాయిజం (Judaism) అనేక శాఖోపశాఖలుగా విడిపోయింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తాల్ముద్-జూడాయిజం లేక రబ్బీలజూడాయిజం అన్నది 175 శాఖలుగా విడిపోయినట్లుగా కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 70 క్రీ.శ.లో యెరూషలేములోని దేవాలయము అంతముకావటముతో జూడాయిజపు పురోగతికి రెండు తక్షణ ప్రమాదాలను పసికట్టారు రబ్బీలుగా పిలువబడే ఆనాటి యూదుమతబోధకులు. ఒకవైపు యెరూషలేములోని దేవాలయపు నాశనము తనాక్-జూడాయిజపు విధులకు ఆచారాలకు తెరదించితే మరొకవైపు తనాక్-జూడాయిజములోని భక్తిపరులైన వేలాదిమంది యూదులు క్రమక్రమంగా క్రైస్తవ మార్గములోకి మళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జూడాయిజం అన్నదే వుండదిక. అదే జరిగితే యిక రబ్బీల పాత్రవుండదు వారి ప్రాధాన్యతా వుండదు.
క్రీస్తు శకము రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే రబ్బీలజూడాయిజం (తాల్ముదు-జూడాయిజం) మొలకెత్తి ఐదవ శతాబ్ధముకల్లా వేళ్ళుతన్ని వటవృక్షంగా మారిపోయింది. ఈ ఎదుగుదలలో తాల్ముద్-జూడాయిజం తనాక్-జూడాయిజం నుండి పూర్తిగా వేరై బబులోను లోని ఆచారాలు బోధల ప్రాతిపదికన స్థిరపడి పైకి మాత్రం తనాక్ (పాతనిబంధన గ్రంథం) వేశం ధరించి అంతర్గతంగా తనాక్ యొక్క బోధలకు వ్యతిరేకమైన బోధలను ఆచారాలను ప్రవేశపెడుతూ విస్తరించడం ప్రారంభించింది. నిజానికి ఈరకమైన పోకడలో మొదటి శతాబ్ధములో ప్రారంభమైన నిజక్రైస్తవ్యంనుండి దూరంగా వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా పెరిగి విస్తరించిన మతక్రైస్తవ్యానికి మరియు రబ్బీలజూడాయిజానికి దగ్గర పోలికలున్నయనే చెప్పవచ్చు. ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవలసిన వాస్తవం బైబిల్-క్రైస్తవ్యం లేక నిజక్రైస్తవ్యంలోని విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నా వారి సంఖ్య మాత్రం స్వల్పమైనదే. ఈ సత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలోనే వెల్లడిచేయబడింది:
“ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి.7:13-14)
“…అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (లూకా.18:8)
తాల్ముద్ అన్న పదానికి అధ్యయనం (study) అని అర్థం. తాల్ముద్-జుడాయిజంలో రెండురకాల తాల్ముదు సాహిత్యము వాడుకలోవున్నాయి. ఒకటి, ‘యెరూషలేము తాల్ముద్.’ ఇది 2వ శతాబ్ధము క్రీ.శ. – 3వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో పాలస్తీనాలోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. రెండు, ‘బబులోను తాల్ముద్.’ ఇది 3వ శతాబ్ధము క్రీ.శ. – 4వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో బబులోనులోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. కొంతవరకు రెండింటిలోని మూలపాఠాలు ఒకదానితో మరొకటి పోలివున్నా రెండింటిలోని వివరాలు సమాచారాలమధ్య వ్యత్యాసాలుకూడా వున్నాయి. రెండింటిలో బబులోను తాల్ముద్ పెద్దది మరియు క్రొత్తది. కనుక రబ్బీలజూడాయిజంలో బబులోను తాల్ముద్నే ప్రామాణికంగా లేక్కిస్తారు. తాల్ముద్ లో రెండు భాగాలుంటాయి—‘మిష్నా’ (Mishna) మరియు ‘గమారా’ (G’mara).
‘మిష్న’ అన్నది రబ్బీలచేత సంకలనము (compiled) మరియు సంపాదకత్వము (edited) చేయబడిన మౌఖికతోరా (Oral Torah) యొక్క గ్రంథస్థరూపముకాగా, ‘గమరా’ అన్నది మౌఖికతోరా (Oral Torah) యొక్క రబ్బీల వ్యాఖ్యానభాగము (commentary). మొత్తానికి తాల్ముదులోని ఈ రెండు భాగాలుకూడా యూదు మత పెద్దలైన రబ్బీల సృష్టి అన్నది గుర్తుంచుకోవలసిన విశయం!
జూడాయిజం లోని అన్ని శాఖలు తాల్ముద్ సాహిత్యానికి ఒకేవిధమైన ప్రాధాన్యత నివ్వవు అన్నది గమనార్హమైన విశయం. కొన్ని జూడాయిజం శాఖలు తాల్ముద్ గ్రంథాలను రబ్బీల సృష్టిగా గుర్తించి వాటిని తృణీకరిస్తున్నాయి. కారైటు జూడాయిజం, మధ్యయుగం లోని జూడాయిజం మార్మిక శాఖలు, రిఫామ్డ్ జూడాయిజం వారు, ఆధునిక యూదులు మొదలైన జుడాయిజం శాఖలు తాల్మూద్ గ్రంథాలను తిరస్కరిస్తారు.
క్రీస్తు శకము 1వ శతాబ్ధపు మొదటి అర్థభాగములోనే తనాక్-జూడాయిజం (బైబిలు జూడాయిజం) కు తెరపడటముతో రబ్బీలు బెంబేలెత్తిపోయారు. యూదుజాతిని యూదుమతాన్ని సమ్రక్షించే తన బృహత్తర ప్రణాళికలో భాగంగా రబ్బి అకివ రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే యూదుమతకొనసాగింపుకు అసలు దేవాలయముతోనే పనిలేకుండా నిరాటంకంగా కొనసాగగలిగే క్రొత్త జూడాయిజపు స్థాపనకై వేరొక తోరా (ఉపదేశము/ధర్మశాస్త్రము) ఆవిశ్కరణకు పూనుకొని మోషేతోపాటు యితర పాతనిబంధన ప్రవక్తలు ఎవరూ కని విని యెరుగని ‘మౌఖిక తోరా’ అన్న భావనకు (concept) రూపకల్పన చేసి దానికి యూదులమధ్య చెల్లుబాటును సంపాదించగలిగాడు. 200 క్రీ.శ. ప్రాంతములో ‘రాజకుమారుడు యూదా’ (Judah the Prince/యెహుదా హనసి: 135 క్రీ.శ.- 217 క్రీ.శ.) అనే రబ్బి మౌఖికతోరాగా చెల్లుబాటుసంపాదించిన యూదుబోధలను (Jewish teachings), పురాణాలను (legends), పిత్రుపారంపార్యాచారాలను (tranditions), ప్రాచిన జ్ఙానబోధలను (ancient wisdom), కొంత యూదుచరిత్రను (Jewish history) సేకరించి వాటన్నిటిని రంగరించి తన సంపాదకత్వముతో క్రొత్త జూడాయిజపు వుద్దరణకు తగిన మతబోధలు, ఆచారాలు, విధులతో కూడిన గ్రంథాన్ని సిద్దపరచి రాబోవుతరాలకు వుపయుక్తంగా వుండేందుకు గ్రంథరూపములో భద్రపరిచాడు. అదే ‘మిష్నా’గా పేరుస్థిరపరచుకొని వాడుకలోకి వచ్చింది.
రబ్బీలు అనబడే యూదా మతబోధకుల కథనం ప్రకారం సీనాయి కొండపై దేవుడు మోషేకు రెండు తోరాలను (ధర్మశాస్త్రాలను) యిచ్చాడట! అందులో ఒకటి వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరా (Written Torah) మరొకటి మౌఖికతోరా లేక నోటిమాటతో యివ్వబడిన మొదటి తోరా యొక్క వివరణ (Oral Torah). అయితే, బైబిలులో మాత్రం యిందుకు సంబంధించి ఎలాంటి ఆజ్ఙకాని, వివరణగాని, లేక సూచనగాని యివ్వబడలేదు. మోషేద్వారా వ్రాతపూర్వకంగా యిచ్చిన తోరా విశయములో దేవుడు అనేక పర్యాయాలు బైబిలులో సూచించాడు. కాని, మౌఖిక తోరాగా పిలువబడుతున్న రెండవ తోరానుద్దేశించి ఒక్కమాటకూడా మోషేగాని లేక ప్రవక్తలుగాని యేమాటా చెప్పలేదు. ఈ రెండవ తోరా/మౌఖిక తోరా అన్నది యూదుల పితృపారంపార్యాచారాల (traditions of men) ఆధారంగా వునికిలోకి వచ్చి రబ్బీల చేతిలో ప్రామాణికత్వాన్ని మరియు గ్రంథరూపాన్ని సంతరించుకొన్న రబ్బీల స్వసృష్టి అన్నది చెప్పకనే తెలుస్తోంది.
కేవలం యూదుల పిత్రుపారంపార్యాచారాలేకాక పుక్కిటిపురాణాలు (legends) ప్రాచీనుల జ్ఙానసముర్పార్జనలతోపాటు మోషేధర్మశాస్త్రములో వ్రాయబడని ఆచారవివరాలు సహితం రబ్బీల చొరవతో వునికిని సంతరించుకొని మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవ ధర్మశాస్త్రము) రూపములో విరాజిళ్ళుతున్నాయి. ఈకారణంగా తాల్ముదు బోధలు చాలావరకు దైవప్రేరణతో లిఖితరూపములో అందించబడిన మోషేధర్మశాస్త్రముయొక్క బోధలకు వేరుగా మరియు వ్యతిరిక్తంగా వుండటం కద్దు. ఈ వాస్తవాన్ని గ్రహించిన అనేకమంది ఆధునిక యూదుజాతీయులు మతవిశ్వాసాలనే పరిత్యజించి నాస్తికులుగా మారిపోయారు. ప్రపంచములోని మతాలన్నిటిలో నిమ్నమతాసక్తిగలవారు యూదులు. ఈ నేపథ్యములో ప్రపంచవ్యాప్తంగా వున్న యూదులలో కేవళం 38% మాత్రమే మతవిశ్వాసాలకు విలువనిచ్చేవారన్నది గమనార్హం (HAARETZ, New Poll Shows Atheism on Rise, with Jews Found to Be Least Religious. Website: https://www.haaretz.com/jewish/jews-least-observant-int-l-poll-finds-1.5287579. Accessed date: 17-12-2018).
ఈనాటి జూడాయిజములో (రబ్బీలజూడాయిజములో) సత్యముందని బ్రమించి అందులోకి మతమార్పిడిపొందిన వారిని విస్మయపరచే ఒక వాస్తవమేమిటంటే ఈనాటి రబ్బీలజూడాయిజంకు (తాల్ముద్-జూడాయిజం) మూలపురుషునిగా వుండి దానికి రూపకల్పన చేసినది యూదుడుకాదుగాని ఒక అన్యుడు. అది రబ్బీ అకివ (50 క్రీ.శ.-135 క్రీ.శ.). సిసెరా అనబడిన ఒక దుష్టుడైన అన్యుని వంశములోనుండి వచ్చి జూడాయిజములోకి మతమార్పిడి పొందినవాడు రబ్బీ అకివ (Jewishhistory.org. Rabbi Akiva. Website: https://www.jewishhistory.org/rabbi-akiva-2/, date of access: 18-12-2018). గమనించాలి, అన్యులెవరైనా జూడాయిజములోకి మతమార్పిడిపొందితే అలాంటివారికి ఇశ్రాయేలీయులనిగాని లేక యూదులనిగాని దేవుడు పేర్కొన్నట్లు తనాక్ అంతటిలో ఎక్కడా ఆధారాలు లేవు. దైవలేఖనాలైన తనాక్ (పాతనిబంధనగ్రంథము) బోధప్రకారము అలాంటి అన్యులు నిజదేవున్ని నమ్ముకున్న “అన్యులైన విశ్వాసులుగా” కొనసాగాలి. వారు దేవుని ప్రజలమధ్య నివసింపవచ్చు. దేవుని ప్రజలతో కలిసి మోషేధర్మశాస్త్రాన్ని పాటించి, దేవుని ప్రజలతో కలిసి దేవుని దీవెనలలో వారు పాలుపొందవచ్చు. అంతేకాక, ఇశ్రాయేలీయులను/యూదులను వివాహముకూడా చేసుకోవచ్చు. అలాంటిసందర్భాలలో వారి సంతానము మిశ్రమసంతానముగా లెక్కించబడదు. అయినప్పటికిని వ్యక్తిగతంగా వారికిమాత్రము తనాక్ లేఖనాలు ఇశ్రాయేలీయులని/యూదులని ససేమిరా గుర్తింపు నివ్వదు. ఈ వాస్తవాన్ని గ్రహించని అనేక అమాయక యూదేతరులు తాల్ముద్-జూడాయిజములో చేరి తాము యూదులమయ్యామన్న భ్రమలో కొనసాగుతున్నారు. అలాంటివారిని వుద్దేశించి మెస్సయ్య పలికిన మాటలు కటువైన మాటలు–
“యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను;” (ప్రకటన 3:9).
అయితే, ఈనాడు రబ్బీలజూడాయిజములో తనాక్ బోధలకు వ్యతిరేకమైన అనేక బోధలు ఆచారాలు వాడుకలోకి వచ్చాయి. అవి రబ్బీల బోధలలో పుట్టిన మానవకల్పితాలు అన్నది సత్యాన్వేషకులు మరవకూడదు (యెషయా 29:13).
దాదాపుగా క్రీస్తు శకము రెండవ శతాబ్ధములో రబ్బీ అకివ మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవధర్మశాస్త్రము/Oral Torah) అనబడే మోషేధర్మశాస్త్రానికి (మోషే-తోరా) వేరుగా మరొక ధర్మశాస్త్రాన్ని (అన్యధర్మశాస్త్రాము) సిద్ధంచేసి యూదులకు అందించాడు. అదే గత 2000 సంవత్సరాలుగా యూదు మతాచారాలకు జీవనశైలికి అంతిమ తీర్పరిగా మరియు దిశనిర్ధారణకు దిక్సూచిగా కొనసాగుతున్నది. మోషేధర్మశాస్త్రాన్ని పక్కకుబెట్టి దానిస్థానములో వేరొక ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టడముద్వారా జూడాయిజపు మతస్తులను ప్రక్కదోవ పట్టించిన అన్యజాతీయుడైన రబ్బీ అకివను తప్పుబట్టేదిపోయి ఈనాటి జూడాయిజం వారు మోషేఅంతటివాడు అంటు రబ్బీ అకివకు కితాబునిచ్చి అందలమెక్కించి ఆయన సహకారంతో వునికిలోకి వచ్చిన మౌఖికతోరాకు దాసోహమంటూ మానవకల్పిత మతాచారాలతో నిజదేవునికి దూరంగా కొనసాగుతున్నారు. ఈ బాపతు మతమూఢులను చూసి మెస్సయ్య అయిన యషువ (యేసు క్రీస్తు) “మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు” (మార్కు 7:13) అంటూ మందలించడం జరిగింది.
బైబిల్-జుడాయిజముకు ప్రతికూలంగా అవతరించి కొనసాగుతున్న రబ్బీలజుడాయిజం లేక తాల్ముద్-జూడాయిజమే అంత్యకాల జూడాయిజం! ఈరకమైన జుడాయిజమును అనుసరిస్తున్నవారిలో అనేకమంది దేవుని లేఖనాలను అలాగే దేవుడే అభిషేకించి పంపించిన యషువ హ-మషియాఖ్ (యేసు క్రీస్తు) ను తిరస్కరించడమేగాక ఆయనను దుర్భాషలాడుతూ మొదటిశతాబ్ధములో ఆయనను సిలువకప్పగించిన యూదామతపెద్దల స్థాయిలో ఆయనను ద్వేశిస్తూ దూశిస్తూ తాము అపవాదిసంతానమన్న వాస్తవాన్ని నిరూపించుకుంటూ దైవదుషణకు మరియు సత్యతిరస్కారానికి పాల్పడుతున్నారు. వీరి కుయుక్తులకు కుతర్కాలకు అనేకమంది నామకార్థ క్రైస్తవులు యిదివరకే మోసపోయి వారి అడుగుజాడలలో క్రొత్తనిబంధన తిరస్కరిస్తూ, యేసు ప్రభువును ద్వేశిస్తూ తద్వారా దైవదూషణకు పాల్పడుతూ సాతాను సంబంధులుగా నాశనపుత్రులుగా జీవిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు విశ్వాసులు సహితం విశ్వాసబ్రష్టులయ్యే అవకాశముందంటూ లేఖనాలు ఘోషిస్తున్నాయి,
“అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1తిమోతి.4:1-2)
Views: 463
తనాక్-జూడాయిజం
ఈనాటి యూదులు మరియు యూదామతప్రవిష్టులు క్రొత్తనిబంధన గ్రంథాన్ని దైవలేఖనాలుగా ఒప్పుకోరు విశ్వసించరు. వారిదృష్టిలో కేవళము క్రైస్తవులు పాతనిబంధన గ్రంథముగా పేర్కొనే 39 హిబ్రూ లేఖనగ్రంథాలు మాత్రమే దైవలేఖనాలు. దీన్నిబట్టి యూదులు/యూదామతప్రవిష్టులు తాము దైవలేఖనాలుగా విశ్వసించే 39 హిబ్రూ లేఖనగ్రంథాలను (పాతనిబంధన గ్రంథాన్ని) పాతనిబంధన గ్రంథము అని పేర్కొనకుండా “తనాక్” (TaNaK) అన్న ఒక క్రొత్తపేరుతో పిలుస్తారు.
తనాక్ (TaNaK) అంటే యూదుల పరిభాషలో కేవళము 39 హిబ్రూ లేఖనగ్రంథాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము. దీన్నే హిబ్రూ భాషలో మిక్రా (Mikra) అనికూడా సంబోధిస్తారు.తనాక్ లోని 39 హిబ్రూ లేఖనగ్రంథాలను యూదులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు–తోరా/Torah (మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలు), నెవియిం/Nevi’im (ప్రవక్తలు), మరియు కెతువిం/K’etuvim (వ్రాతలు/లేఖనాలు). ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడిన దైవ సందేశముతో కూడిన గ్రంథాలు. ఈ 39 గ్రంథాలు 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడ్డాయి (1400 క్రీ.పూ.— 400 క్రీ.పూ.). మూడు హిబ్రూ పదాలలోని (Torah, Nevi’im, K’etuvim) మొదటి అక్షరాలను చేర్చి తనాక్ (TaNaK) అన్న పదాన్ని యేర్పరచుకున్నారు యూదులు.
“తనాక్ ధార్మిక మార్గం” అన్న మతవిశ్వాసం కేవలం తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని దైవలేఖనాలపై మాత్రమే ఆధారపడిన మతవిశ్వాసం. ఈ మతవిశ్వాసాన్ని బైబిలు విశ్వాసము అనికూడా పేర్కొనవచ్చు. ఇది యెరూషలేములో హేరోదు కట్టించిన రెండవ మందిరము 70 క్రీ.శ. లో నాశనము/ద్వంసము చేయబడినతరువాత క్రమక్రమంగా వునికిని కోల్పోయింది. అంతకు పూర్వము తనాక్ ధార్మిక మార్గం లోని భక్తిపరులు చాలావరకు యేసును (యషువను) క్రీస్తుగా (మెస్సయ్యగా) గుర్తించి ఆయనను వెంబడించి క్రైస్తవులుగా మారిపోయారు. ఆరకంగా తనాక్ ధార్మిక మార్గం తన అస్తమయసమయానికంటే ముందే తనలో రూపుదిద్దుకున్న బైబిలు-క్రైస్తవ్యానికి పురుడుపోసి దేవుని ఆత్మీయ ప్రణాలికలో తన పాత్రను ముగించుకొని తన వారసుడైన “క్రొత్తనిబంధన సమాజము”లో క్రొత్త పేరుతో చిరంజీవిగా నిలిచిపోయింది (యెషయా 65:15).
తనాక్-జూడాయిజం ప్రధానంగా మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలు, విధులు, గుడారము/దేవాలయము లోని అర్చనాదులు, బలులు, నైవేధ్యాలు, శిక్షలు మొదలైనవాటిచుట్టు కేంద్రీకృతమైనది. అయితే, 70 క్రీ.శ.లో రోమాసైన్యము యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనముచేసి యూదులమతకేంద్రాన్ని ద్వంసం చేయడముతో తనాక్-జూడాయిజం తన అంతిమదశకు చేరుకున్నది. నిజానికి 40 సంవత్సరాలకుముందే అంటే దాదాపు 30 క్రీ.శ.లో దేవుని ప్రణాలికలోని మానవనిర్మిత మందిరముకుండిన ప్రధాన వుద్దేశము నెరవేర్చబడి సంపూర్ణము చేయబడింది. దేవుని సన్నిధిలో సర్వకాలాలకు సరిపోయిన దైవసుతుని బలియాగము సృష్టిలో దైవసాక్షిగా అర్పించబడింది. దానికి సాదృశ్యంగా పరిశుద్ధస్థలానికి మరియు అతిపరిశుద్ధస్థలానికి మధ్యలో వుండిన తెర తొలగి ప్రతిసంవత్సరము ఒకసారిమాత్రమే దేవుని ప్రజల పాపాలప్రాయశ్చిత్తార్థమై ప్రధానయాజకుడు పశువుల రక్తముతో దేవునిమందిరములోని అతిపరిశుద్ధస్థలములోకి ప్రవేశించే ఆగత్యానికి తెరపడింది. ఈరకంగా తనాక్-జూడాయిజం యొక్క అంతిమదశకు నాంది పడింది. అక్కడే క్రొత్తనిబంధనాసమాజానికి అంకురార్పణ జరిగింది. అయితే, అదేసమయంలో తనాక్-జుడాయిజం కు వేరుగా మరియు ప్రతికూలంగా తాల్మూద్-జూడాయిజం అనే ఒక క్రొత్త జూడాయిజం మొలకెత్తింది. దాన్నే రబ్బీలజూడాయిజం అనికూడా పేర్కోంటారు. అదే ఇనాటి ప్రపంచములో యూదుమతంగా పేరొంది విస్తరిస్తున్నది.
“బైబిల్-క్రైస్తవ్యం” లేక “క్రొత్తనిబంధనాసమాజం” అన్నది మోషేనిబంధన కాలములోనే దేవుడు వాగ్ధానం చేసిన వేరొక నిబంధనకు చెందిన దేవునిప్రజలు (ద్వి.కాం.32:21; కీర్తన.82:8). ఆ వేరొకనిబంధననే “క్రొత్తనిబంధన” అని లేఖనాలు అభివర్ణించాయి. కొందరు తప్పుగా అభిప్రాయపడుతున్నట్లు ఇది నూతనపరచబడిన మోషేనిబంధన కాదు. అసలు యిది మోషేనిబంధనవంటిదేమాత్రము కాదు. “అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు” అంటూ దేవుడే విస్పష్టముగా సెలవిచ్చినవిధంగా ఆ “క్రొత్తనిబంధన” మోషేనిబంధనవంటిది కాదు అన్నది గమనార్హమైన విశయము. అంతేకాక దేవుడే ఈ నిబంధనకు ‘నిత్యనిబంధన’ అంటూ మోషేనిబంధనకులేని ఉత్కృష్టస్థానాన్ని గుర్తింపును తనముద్రగా యిచ్చాడు (యిర్మీయ 31:31-34, 32:37-40).
పాత/పూర్వ నిబంధనగా వున్న మోషేనిబంధనలో భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రము గుడారము/దేవాలయము మరియు దాని ఆచారాలతో విధులతో ముడిపడివుంది. అయితే, క్రొత్తనిబంధనలో భాగంగా అక్షరార్థముగా అలాంటి ఆచారాలు విధులు ఎవీ లేని క్రొత్తధర్మశాస్త్రము లేక క్రీస్తుధర్మశాస్త్రము (Law of Christ—యెషయా.42:4; గలతీ.6:2) యివ్వబడింది (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). ఈ క్రొత్తనిబంధనాప్రజలే క్రీస్తు అనబడిన యేసు యొక్క శిష్యులు లేక క్రైస్తవులు. 30 క్రీ.శ.తరువాత ప్రారంభమైన క్రైస్తవ్యం మొదట్లో ఒక దశాబ్ధానికిపైగా కేవళము యూదులతో ప్రారంభమై యూదులమధ్యే విస్తరించింది. ఆ సమయములో కొన్ని వేల యూదులు సత్యాన్ని గ్రహించి జూడాయిజంను వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు (అపో.కా.21:20).
క్రైస్తవుడు (Christian) అంటే ‘క్రీస్తును వెంబడించే వాడు’ (follower of Christ)అని భావం. ప్రారంభములో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క ప్రత్యేకమైన విశ్వాసము మరియు అబ్బురపరచే జీవనవిధానాలు అన్యులను/అవిశ్వాసులను కదిలించివేసాయి. శిష్యులకున్న ఆ విశిష్ట గుణలక్షణాలే వారు క్రీస్తును వెంబడించే వారని అన్యులు/అవిశ్వాసులు గుర్తించేందుకు తోడ్పడ్డాయి. దాంతో అన్యులు/అవిశ్వాసులు శిష్యులను ఆ పేరుతో అంటే ‘క్రైస్తవులు’ అంటూ పిలవడం మొదలుబెట్టారు (అపో.కాం.11:26). యేసుక్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలైనవారికి క్రైస్తవులు (Christians) అన్న పేరు దైవలేఖనాలు ప్రమాణీకరించడాన్ని క్రొత్తనిబంధనలో చూడగలము (1పేతురు 4:16).
Views: 344
యెషయాలో మెస్సయ్యా
యెషయా గ్రంథములో దేవుడైన యేహోవా చేత ‘నా సేవకుడు’ అని పిలువబడింది ఎవరు?
యెషయా 52:13 – 53:12 వరకున్న లేఖనాలలో ఇశ్రాయేలీయులనందరిని సమిష్టిగా పేర్కొంటూ ‘నా సేవకుడు’ అన్న పదజాలము ఉపయోగించబడింది అంటూ కొందరు అలాగే ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతులయిన ఇశ్రాయేలీయులనందరిని కలిపి సాదృశ్యముగా సూచించడానికి ‘నా సేవకుడు’ అన్న అలంకార పదజాలము ఉపయోగించబడింది అంటు మరికొందరు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తూంటారు. మరి అలాంటి అభిప్రాయాలను లేఖనాలు సమర్ధిస్తున్నాయా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న.
1) ‘నాసేవకుడు ‘ (עַבְדִּ֑י=అబ్’ది) అన్నఏకవ్యక్తి పదజాలం యెషయా గ్రంథములో అనేకసార్లు ఉపయోగించబడింది
– 16 సార్లు వుపయోగించబడింది.
– ప్రవక్త యెషయా ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 20:3)
– హిల్కియా కుమారుడు ఎల్యాకీము ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 22:20)
– రాజైన దావీదు ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 37:35)
– యాకోబు సంతానము లేక ఇశ్రాయేలు జనాంగము ‘నా సేవకుడు’ గా పేర్కొనబడింది (యెషయా 41:8-9; 44:1,2,21; 45:4; 49:3).
– అప్పటికింకా నామము బహిర్గతం చేయబడని ఒక విశిష్టమైన వ్యక్తి ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 42:1,19; 43:10; 49:5-8; 52:13-53:12).
2) యెషయా గ్రంథములో ప్రభువైన దేవుడు ఉపయోగించిన ‘నాసేవకుడు’ అన్న పదజాలం భవిష్యత్తులో రాబోవుతున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి విశయంలో ఉపయోగించబడింది. అయితే, అదివరకేవచ్చిన/ఉండిన వ్యక్తులనుగాని లేక జనాంగాన్నిగాని ఉద్దేశించి ‘నాసేవకుడు’ అంటూ పేర్కొంటునప్పుడు ఆవ్యక్తియొక్క లేక జనాంగము యొక్క నామాన్ని కూడా అదేసందర్భములో స్పష్టంగా పేర్కొనడం చూస్తాము.
యెషయా గ్రంథములో దేవుడు (ప్రభువైన యెహోవా) ఏర్పరచుకున్న ప్రత్యేకమైన ‘సేవకుడు’ ప్రవక్త అయిన యెషయా కాదు, రాజైన దావీదు కాదు, కోశాధికారి అయిన ఎల్యాకీముకూడా కాదు. ఆమాటకొస్తే, ఆయన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగము యొక్క సాదృశ్య రూపము అంతకన్నా కాదు.
3) దేవుడైన యెహోవా ‘నాసేవకుడు’ అంటూ ప్రవక్త అయిన యెషయాద్వారా పరిచయం చేసిన ఆప్రత్యేకమైన కారణజన్ముని గూర్చి లేఖనాలు సెలవిస్తున్న సత్యాలు:
– అతడు దేవుడైన యెహోవాకు ప్రాణప్రియుడు (యెషయా.42:1) [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతనియందు యెహోవా ఆత్మ వుండును (యెషయా.42:1) [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతడు అన్యజనులకు న్యాయము అందిస్తాడు (యెషయా.42:1) [తండ్రి మహిమతో రాజుగా వచ్చినప్పటినుండి]
– అతని ఉపదేశము/ధర్మశాస్త్రము (తోర) కొరకు దూరప్రాంత ప్రజలలుకూడా ఎదురుచూస్తారు (యెషయా.42:4) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు ప్రభువైన యెహోవాచేత అన్యజనులకు వెలుగుగా నియమించబడ్డాడు (యెషయా.42:7) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు యెహోవా యొక్క దూత (యెషయా.42:19) [పాతనిబంధన కాలమునుండి]
– అతడు యెహోవా యొక్క సాక్షి (యెషయా.43:10) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు ఇశ్రాయేలీయులను తిరిగి యెహోవ యొద్దకు తీసుకు వచ్చేవాడు (యెషయా.49:5) [పరిచర్య ప్రారంభించినది మొదలుకొని తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు భూదిగంతములవరకు యెహోవా కలుగజేయు రక్షణకు సాధనముగా వుంటాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు అన్యజనులకు వెలుగుగా వుండేందుకు యెహోవా చేత నియమించబడ్డాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు మనుషులచేత నిరాకరించబడినవాడు (యెషయా.49:7, 53:2) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]
– అతడు జనులచేత అసహ్యించుకోబడ్డవాడు (యెషయా.49:7, 53:3) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]
– అతడు యెహోవాచేత ప్రజలకు నిబంధనగా (క్రొత్తనిబంధనగా) నియమించబడ్డవాడు (యెషయా.42:7; 49:8) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు మన (ప్రజల) రోగములను, వ్యసనములను వహిస్తాడు (యెషయా.53:4)
– అతడు మన (ప్రజల) స్థానములో శిక్ష అనుభవిస్తాడు (యెషయా.53:5)
– అతడు పొందే శిక్షనుబట్టి మనము (ప్రజలు) స్వస్థత పొందుతాము (యెషయా.53:5)
– అతడు దేవుని ప్రజల స్థానములో శిక్షించబడుతాడు మరియు ప్రాణత్యాగము చేస్తాడు (యెషయా.53:8)
– అతడు ఏ పాపము చెయకున్నా మరణశిక్షను అనుభవిస్తాడు (యెషయా.53:9)
– అతడు తననుతాను పాపపరిహారార్థబలిగా చేసుకుంటాడు (యెషయా.53:10)
– అతడు (మరణములోనుండి తిరిగి బ్రతుకుటద్వారా) దీర్ఘాయుష్మంతుడవుతాడు (యెషయా.53:10)
– అతనిద్వారా యెహోవా యొక్క ప్రణాలిక నెరవేర్చబడుతుంది (యెషయా.53:10)
– అతడు నీతిమంతుడైన యెహోవా సేవకుడు (యెషయా.53:11)
– అతడు ప్రజల దోషములను తాను భరించి వారిని నిర్దోషులుగా చేస్తాడు (యెషయా.53:11)
– అతడు మరణమునొందునంతగా తన ప్రాణమును ధారపోస్తాడు (యెషయా.53:12)
– అతడు ప్రజల పాపములను భరిస్తూ వారి కొరకు విజ్ఙాపన చేస్తాడు (యెషయా.53:12)
పై వైశిష్టాలన్నీకూడా కన్యమరియ యొక్క కుమారుడైన యేసు (యషువ) జీవితములో ప్రస్పుటముగా నేరవేర్చబడటాన్ని క్రొత్తనిబంధన లేఖనాలలో వివరించబడింది. ఈ రకంగా ఇశ్రాయేలీయుడైన ఒక వ్యక్తి జీవితములో పై ప్రత్యేకతలన్నీ నెరవేర్చబడటమన్నది చరిత్రలో కన్యమరియ కుమారుడు యేసు (యషువ) జీవితములో తప్ప మరొకరి జీవితములో నెరవేర్చబడలేదు. ఇది దేవుడే మాట యిచ్చి నెరవేర్చాడన్న సత్యము కేవళము సత్యాన్వేషకులైన విజ్ఙులు గ్రహించగలరు. తద్వారా అలాంటివారు మాత్రమే పరమతండ్రి యొక్క నిత్యసంకల్పములోని యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క పాత్రను గుర్తించి స్వీకరించగలరు.
జూడాయిజములోని కొందరు దుర్బోధకులు లేఖనాలను వక్రీకరించే ప్రయత్నములో యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అన్నది కన్యమరియ కుమారుడు యేసు [యషువ] కాదు అంటూ అసందర్భ అభ్యంతరాలను అనేకం లేవనెత్తుతుంటారు. అలాంటివారు చెప్పేది సత్యమయితే మరి పైన చూపిన యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అనబడిన ఆ వ్యక్తి ఎవరు? ఆవ్యక్తిలో పైన ప్రవచనాత్మకంగా పేర్కొనబడ్డ విశయాలు నెరవేర్చ బడ్డాయా? ఆ వివరాలను అందిస్తేతప్ప ఆ వ్యక్తి యేసు కాదు అనడానికి వారికి అర్హత లేదు.
4) యెషయా గ్రంథము 42:1-7; 43:10; 49:5-8; 52:13-53:12 వాక్యాలలో ప్రభువైన యెహోవా చేత ‘నాసేవకుడు’ అంటు పేర్కొనబడింది యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగాని సూచించే ఒక అలంకార రూపమైన వ్యక్తి కాదుగాని, దేవుడే యెన్నుకొన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గ్రహించడానికిగల కారణాలు:
అ) యెషయా.42:1-7 వచనాల ధ్యానము: ఈ వాక్యాలలో ప్రవక్త అయిన యెషయా పేరుగాని, రాజైన దావీదు పేరుగాని, లేక కోశాధికారి ఎల్యాకీము పేరుగాని పేర్కొనబడలేదు. అంతమాత్రమేగాక యాకోబు లేక ఇశ్రాయేలు అన్న జనాంగము పేరుకూడా పేర్కొనబడలేదు. కనుక, ఈ వాక్యాలలో పేర్కొనబడిన వ్యక్తి అప్పటికింకా పేరు వెల్లడి చేయబడని దేవుడైన యెహోవా చేత ఏర్పరచుకోబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నది సుస్పష్టము.
అంతేకాక, దేవుడైన యెహోవా ఈ వ్యక్తిని కాపాడి ప్రజలకు అంటే కేవలం అన్యులకే అనికాదు అందరికీ (ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు) నిబంధనగా నియమించబోటున్నట్లు వాగ్ధానము చేసాడు. ప్రజలతో అంటే మానవులందరితో చేయబడే నిబంధన నోవహునిబంధన తరువాత మెస్సయ్యనందు చేయబడే క్రొత్తనిబంధనే.
ఆ) యెషయా.43:10 వచన ధ్యానము:
ఇ) యెషయా.49:5-6 వచనాల ధ్యానము:
“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.”
– పై వాక్యాలలోని ‘నా సేవకుడు ‘ అన్నది యాకోబు/ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేషించి వాడబడిన పదజాలము కాదు. అది యెహోవా యెన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేషించి పేర్కొనబడింది. ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి ప్రభువైన దేవుని యొద్దకు తీసుకువచ్చేవాడు, వారిని ఉద్దరించేవాడు. ఆ ప్రత్యేకమైన వ్యక్తే ‘నా సేవకుడు ‘ (మత్తయి 12:18) లేక ‘తన సేవకుడు ‘ (అపొ.కా.3:13) అనబడిన యేసు (యషువ) అన్న సత్యాన్ని దేవుడు తన ఆత్మ ప్రేరణతో క్రొత్తనిబంధన లేఖనాలలో స్పష్టపరచాడు.
ఈ) యెషయా.52:13-53:12 వచనాల ధ్యానము
– అది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. ‘నా సేవకుడు ‘ అంటూ ఇశ్రాయేలు ప్రజలను సంబోధించిన ప్రతిసారి యాకోబు లేక ఇశ్రాయేలు అన్న నామాన్ని విస్పష్టముగా పేర్కొనడాన్ని యెషయా గ్రంథములో చూడగలము. అయితే ఇక్కడ ‘నా సేవకుడు ‘ అని ప్రకటిస్తున్న సందర్భములో యాకోబు అనిగాని ఇశ్రాయేలు అనిగాని పేర్కొనలేదన్నది గమనించాలి. దీన్ని బట్టి ఇక్కడ వివరించబడుతున్నది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదుగాని ప్రభువైన దేవుడు తానే ఎన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి అన్నది గ్రహించాలి.
– ఇక్కడ ‘నా సేవకుడు ‘ అన్నది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. కారణం, ఇక్కడ వివరించబడుతున్న ‘నా సేవకుడు ‘ “తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును.” (యెషయా 53:10). అపరాధపరిహారార్థబలి/పాపపరిహారార్థబలి విశయములో లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం “ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొర్రెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి” (లేవి.కాం.4:32).
అయితే, మోషే మొదలుకొని మలాకి వరకు గల సమయంలో పరమతండ్రి మాటలలో ఇశ్రాయేలీయులు…
- లోబడనొల్లని ప్రజలు [ని.కాం.32:9]
- పాపుల సంతానం [సం.కాం.32:14]
- దేవునికి విరోధముగా సణిగే సమాజం [సం.కాం.14:27]
- పాపిష్టి జనము [యెషయా.1:4]
- సొదొమ మరియు గొమొఱ్ఱా జనులు [యెషయా.1:10]
- విగ్రహారాధికులు [యిర్మీయ.11:17]
- హృదయ సున్నతిలేనివారు [యిర్మీయా.9:25]
- వేశ్య [యెహెజ్కేలు.16:15]
- అపవిత్రులు [యెహెజ్కేలు.36:16]
- బహిష్ట స్త్రీ వంటి అపవిత్రత గలవారు [యెహెజ్కేలు.36:16]
- వ్యభిచారులు [1ది.వృ.5:25; హోషేయ.1:2]
- అనీతిమంతులు [ఆమోసు.5:7, 6:13]
- కిరాతకులు [ఆమోసు.7:2]
- ముష్కరులు మరియు భ్రష్టులు [జెఫన్యా.3:1]
- దొంగలు మరియు శాపగ్రస్తులు [మలాకి.3:9]
– అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ‘నీతిమంతులు’ అంటూ బైబిల్ అంతటిలో మచ్చుకు ఒక్కసారి అయినా లేఖనాలు పేర్కొనటంలేదు, గుర్తించటంలేదు! కనుక, ఇశ్రాయేలీయులకు అపరాధపరిహారార్థబలిగా ఉండే అర్హత ఏమాత్రములేదు. ఆమాటకొస్తే, వారికే అంటే వారినే ప్రక్షాళనము చేసేందుకు ఒక అపరాధపరిహారార్థబలి అవసరమన్నది సుస్పష్టము. ఆ బలి ప్రభువైన దేవుడు ఎన్నుకొనిన ‘ఆయన సేవకుడు,’ ఆ సేవకుడు మెస్సయ్యగా విచ్చేసిన యషువ [యేసు].
– ఇక్కడ ‘నా సేవకుడు’ అన్నది ఇశ్రాయేలు ప్రజలను గురించి కాదు. “అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా 53:8-11).
పై వాక్యాలలోని అతడు యెవరు? నా జనులు ఎవరు? నా జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అయితే ‘అతడు’ ఇశ్రాయేలీయుల కొరకు బలిపశువుగా మారాడు అన్నది అర్థమవుతున్నది. మరి ‘అతడే’ ఇశ్రాయేలు జనాంగము అని కాదు! ఆ ‘అతడు’ ప్రభువైన దేవుని యొక్క ‘నీతిమంతుడైన నా సేవకుడు.’ ఆయనే మెస్సయా. పై వాక్యాలలో పేర్కొనబడ్డట్టుగా ఆ మెస్సయ్య నిర్వర్తించబోయే కార్యాలను నిర్వర్తించినది యేసు (యషువ). దీన్ని బట్టి కూడా యేసు (యషువ) మెస్సయా (మషియాఖ్/క్రీస్తు) అని నిరూపితమవుతున్నది.
Views: 343